‘కేసీఆర్' కమిటీతో అభివృద్ధి

7 Jul, 2014 01:45 IST|Sakshi
‘కేసీఆర్' కమిటీతో అభివృద్ధి

 ప్రైవేట్, పాలకవర్గాల భాగస్వామ్యం
- నిష్ణాతులైన 12 మందితో కమిటీ
- వీధి వ్యాపారులకు ప్రత్యేక స్థలాలు
- ఎమ్మెల్యే గంగుల కమలాకర్
 కరీంనగర్ కార్పొరేషన్: కరీంనగర్ సిటీ రెనోవేషన్ (కేసీఆర్) పేరున నగరాన్ని అభివృద్ధి చేసేందుకు పాలకులు, ప్రైవేటు భాగస్వామ్యంతో కార్యవర్గాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తెలిపారు. నగరంలోని మీసేవ కార్యాలయంలో ఆదివారం మేయర్ రవీందర్‌సింగ్, డెప్యూటీ మేయర్ గుగ్గిళ్లపు రమేశ్‌తో కలిసి విలేకరులతో మాట్లాడారు. తెలంగాణలో ఎక్కడా లేని విధంగా ప్రైవేటు, పాలకవర్గం సభ్యులతో కలిపి ‘కేసీఆర్' కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. నగరంలో ఎంపీ, ఎమ్మెల్యే, మేయర్, డిప్యూటీ మేయర్, కమిషనర్‌తోపాటు డాక్టర్, న్యాయవాది, ప్రెస్, ఎన్జీవోల నుంచి ఒక్కొక్కరిని కమిటీ సభ్యులుగా తీసుకోనున్నట్లు చెప్పారు. ప్రజలు, ప్రైవేటు సంస్థల నుంచి వచ్చే ప్రతి పైసాను కమిషనర్ పేరుపై ఖాతా తీస్తామన్నారు.  
 
నాలుగు విభాగాలుగా నగరం
కరీంనగర్‌ను నాలుగు విభాగాలుగా విభజించి నగరాభివృద్ధికి పార్టీలక తీతంగా కమిటీ పనిచేస్తుందన్నారు. ప్రతి విభాగంలో ఐదుగురు మున్సిపల్ లేబర్లు, ఒక ఫారెస్ట్ ఆఫీసర్ ఉంటారని తెలిపారు. ప్లాంటేషన్‌కు మొదటి ప్రాధాన్యత, రెండో ప్రాధాన్యత శానిటేషన్‌పై దృష్టి పెట్టనున్నట్లు చెప్పారు. వర్షాకాలంలో ఇంటింటికో చెత్తబుట్ట ఇవ్వనున్నట్లు చెప్పారు. చెత్త బయట వేస్తే రూ.30 నుంచి రూ.5 వేల వరకు జరిమానా విధించేలా చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు.  
 
అవినీతి లేని అభివృద్ధి
అవినీతికి తావులేకుండా అభివృద్ధి పనులు చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ఎవరినీ చందాలు అడిగేది లేదని, ఎంతిచ్చినా తీసుకుంటామని పేర్కొన్నారు. రంజాన్ తర్వాత ఆక్రమణలు తొలగించి పార్కింగ్‌లకు ప్రత్యేక స్థలా లు కేటాయిస్తామన్నారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు ప్రత్యేకంగా డీఎస్పీ, మరో సీఐ నగరానికి వస్తున్నట్లు తెలిపారు.  
 
14న పాలకవర్గం ఢిల్లీ టూర్
ఈనెల 14న నగరపాలకవర్గంతో ఢిల్లీ టూర్‌కు వెళ్తున్నట్లు గంగుల తెలిపారు. 15న పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడును కలిసి నగరాభివృద్ధికి నిధులు కేటాయించాలని కోరనున్నట్లు తెలిపారు.  కార్పొరేటర్లు వై.సునీల్‌రావు, నలువాల రవీందర్, కంసాల శ్రీనివాస్, ఆరిఫ్, ఏవీ రమణ, బండారి వేణు, బోనాల శ్రీకాంత్, కర్రె లింగయ్య, గంట కళ్యాణి, నాయకులు చల్ల హరిశంకర్, ఎడ్ల అశోక్, నేతికుంట యాదయ్య, సాదవేని శ్రీనివాస్, ఒంటెల సత్యనారాయణరెడ్డి, దిండిగాల మహేశ్, గూడూరి మురళి తదితరులు పాల్గొన్నారు.  
 
నగరాభివృద్ధికి రూ. లక్ష విరాళం
కరీంనగర్ కార్పొరేషన్ : కరీంనగర్ నగర అభివృద్ధిలో ప్రజలు, ప్రైవేటు సంస్థలు భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఇచ్చిన పిలుపునకు మంచి స్పందని వస్తోంది. పుల్లెల ఆసుపత్రికి చెందిన వైద్యులు పుల్లెల పవన్‌కుమార్ ఆదివారం రూ. లక్ష చెక్కును విరాళంగా అందజేశారు. ఎమ్మెల్యే చేతుల మీదుగా మేయర్‌కు ఇచ్చారు. కమిషనర్ పేరుమీద ఇచ్చిన చెక్కును అకౌంట్‌లో జమచేస్తామని మేయర్ రవీందర్‌సింగ్ తెలిపారు. డెప్యూటీ మేయర్ గుగ్గిళ్లపు రమేశ్, కార్పొరేటర్లు, టీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు