ఇక కదలాల్సిందే..

25 May, 2019 08:48 IST|Sakshi

ఎన్నికల కోడ్‌తో నిలిచిన అభివృద్ధి పనులు  

గత ఎనిమిది నెలలుగా స్తబ్ధత

ఆగిపోయిన పనుల విలువ దాదాపు రూ.5 వేల కోట్లు

ఎన్నికల విధులతో పౌరసేవలకూ ఆటంకం

ఇక ముగియనున్న కోడ్‌..

సాక్షి, సిటీబ్యూరో: లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఎన్నికల కోడ్‌ ముగిసిపోనుంది. జీహెచ్‌ఎంసీలో ఎంతోకాలంగా చతికిల పడ్డ అభివృద్ధి పనులు ఇకనైనా చకచకా ముందుకెళ్తాయా అంటే..అవునని కచ్చితంగా సమాధానం చెప్పలేని పరిస్థితి నెలకొంది. గత సంవత్సరం డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు, ప్రస్తుతం ఫలితాలు వెలువడ్డ లోక్‌సభ ఎన్నికలు..ఈ రెండింటి నడుమ వచ్చిన పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో దాదాపు ఎనిమిది మాసాలుగా జీహెచ్‌ఎంసీలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలతోపాటు ప్రజలకందాల్సిన సేవలు కూడా  అందడం లేదు. అందుకు కారణం అభివృద్ధి పనులకు ఎన్నికల కోడ్‌ ఆటంకం కాగా, జీహెచ్‌ఎంసీలోని సిబ్బందే ఎన్నికల విధుల్లోనూ పాల్గొనడంతో ఆయా విభాగాల్లో సేవలు నిలిచిపోయాయి.

సాధారణంగా అత్యవసర సేవలందించే విభాగాల్లోని అధికారులు, సిబ్బందికి ఎన్నికల విధులుండకూడదు కానీ పారిశుధ్యం వంటి అత్యవసర సేవల విభాగాల్లోని సిబ్బందికి సైతం ఎన్నికల విధులు పడ్డాయి. జీహెచ్‌ఎంసీలోని దిగువస్థాయి సిబ్బంది నుంచి మొదలు పెడితే అడిషనల్, జోనల్‌ కమిషనర్లతోపాటు కమిషనర్‌ వరకు ఎన్నికల విధులు నిర్వహించారు. దీంతో, ఉన్నతాధికారులతో పాటు దిగువస్థాయి సిబ్బంది ఎన్నికల విధుల్లోనే తలమునకలయ్యారు. ఎన్నికల నోటిఫికేషన్ల నుంచి మొదలు పెడితే ఫలితాలు వెలువడేంతవరకు వివిధ రకాల శిక్షణలు, ఎన్నికల నిర్వహణ తదితర పనులతో సరిపోయింది. దీంతో ప్రజలకు అవసరమైన జనన, మరణ ధ్రువీకరణ పత్రాల నుంచి భవన నిర్మాణ అనుమతులు, మ్యుటేషన్లు, రహదారుల నిర్మాణం, చెరువుల పునరుద్ధరణ తదితర పనులెన్నో ఆగిపోయాయి. 

ముందుకు సాగని అభివృద్ధి పనులు...
వీటితోపాటు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల నిర్మాణం మందగించింది. నగరంలో నిర్మించే లక్ష డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు ఎప్పుడో మంజూరైనప్పటికీ, ఎన్నికల కారణంగా నిర్మాణ కార్మికులు తమ సొంతూళ్లకు వెళ్లడం.. ప్రభుత్వం నుంచి తగిన నిధులందకపోవడం తదితర పరిణామాలతో వీటి నిర్మాణం కుంటుపడింది. పూర్తవుతున్న ఇళ్లకు అనుగుణంగా కాంట్రాక్టర్లకు ఎప్పటికప్పుడు బిల్లుల చెల్లింపులు జరగకపోవడం వల్ల కూడా పనులు ముందుకు సాగడం లేవు. పూర్తయిన ఇళ్లకు మౌలిక సదుపాయాల పనులు ఇంకా ప్రారంభానికే నోచుకోలేదు. ఆయా మౌలిక సదుపాయాల కల్పనకు మొత్తం లక్ష ఇళ్లకు వెరసి దాదాపు రూ.616 కోట్లు ఖర్చవుతుందని ఆయా శాఖలు ప్రతిపాదనలు పంపాయి. కానీ..ప్రభుత్వం అందుకు నిధులు మంజూరు చేయకపోవడంతో ఆ ప్రతిపాదనలు కాగితాలకే పరిమితమయ్యాయి. 

టెండర్లలో రూ.3500 కోట్ల పనులు..
ఎస్సార్‌డీపీ(వ్యూహాత్మక రహదారుల పథకం)లో భాగంగా చేపట్టిన వివిధ ప్రాజెక్టులు వేల కోట్ల విలువైనవి టెండర్ల దశలో ఆగిపోయాయి.  దాదాపు రూ. 25వేల కోట్లతో ప్రణాళికలు రూపొందించిన ఎస్సార్‌డీపీ పనుల్లో దాదాపు వెయ్యికోట్ల మేర పనులు  జరిగాయి.  టెండర్లు పూర్తికావాల్సిన పనులు, టెండర్లు పిలవాల్సినవి దాదాపు రూ. 3500 కోట్ల పనులున్నాయి. ఇవి కాక పరిపాలనపర అనుమతుల కోసం ఎదురు చూస్తున్నవి మరో రూ.1500 కోట్ల మేర ఉన్నాయి. వెరసి దాదాపు రూ.5000 కోట్ల పనులు ఎన్నికల కోడ్‌ కారణంగా నిలిచిపోయాయి.

కోడ్‌ ముగిసింది సరే..నిధులేవీ..?
ఇప్పటి వరకు ఎన్నికల కోడ్‌ అంటూ ఆయా పనులను నిలిపివేశారు. ఇప్పుడైనా చకచకా ముందుకెళ్తాయా అంటే..అవుననే పరిస్థితి లేదు. డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల పనులకు సంబంధించి రాష్ట్రప్రభుత్వం నుంచే నిధులు  రావాల్సి ఉంది. విడతల వారీగా చెల్లింపులు జరుగుతున్నప్పటికీ ఎప్పటికీ దాదాపు రూ. 400  కోట్లు పెండింగ్‌లోనే ఉంటుండటంతో పనులు చురుగ్గా సాగడం లేవు. ఇక  ఎస్పార్‌డీపీ పనుల కోసం  బాండ్ల ద్వారా సేకరించడమో, బ్యాంకు రుణాలు తీసుకోవడమో చేయాల్సి ఉంది. గత ఏప్రిల్‌ నుంచే బాండ్ల ద్వారా నిధులు సేకరించాలనుకుంటున్నప్పటికీ, బాండ్ల మార్కెట్‌ పరిస్థితి బాగులేకపోవడంతో తక్కువ వడ్డీకి ముందుకు వచ్చే వారుండరనే అంచనాతో వెనుకడుగు వేస్తున్నారు. పరిస్థితి మెరుగయ్యాక బాండ్లకు వెళ్లాలనుకున్నారు. కేంద్ర ఎన్నికల ఫలితాలు కూడా వెలువడటంతో ఇప్పుడిక  బాండ్ల çమార్కెట్‌ ³పరిస్థితిని పరిశీలించి వచ్చే వారం నుంచి దీనికి సంబంధించిన కసరత్తు చేపట్టాలని భావిస్తున్నారు. ఎంత లేదన్నా మునిసిపల్‌ బాండ్ల ద్వారా నిధుల సేకరణకు మరో నెల రోజులు పడుతుంది. బాండ్లు కాకపోయినా, బ్యాంకు రుణాల ద్వారా సేకరించాలనుకున్నా వీలైనంత తక్కువ వడ్డీకి రుణం పొందేందుకు అవసరమైన ప్రక్రియలు పూర్తిచేసి, రుణం పొందేందుకు సైతం నెలరోజులు పడుతుంది. జీహెచ్‌ఎంసీ ఖజానాలో అభివృద్ధి పనులకు ఖర్చు చేసేన్ని నిధులు లేవు.  ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు ఎన్నికల కోడ్‌ అంటూ నెట్టుకొచ్చినప్పటికీ, ఇప్పుడైనా వెంటనే పనులు స్పీడందుకునే పరిస్థితి కనిపించడం లేదు.  

నిలిచిపోయిన పనులు..
శిల్పా లేఔట్‌– గచ్చిబౌలి ఫ్లై ఓవర్‌ : రూ. 330 కోట్లు
రేతిబౌలి, నానల్‌నగర్‌ జంక్షన్ల వద్ద ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్‌: రూ. 175 కోట్లు
ఆరాంఘర్‌–జూపార్క్‌ ఫ్లై ఓవర్‌:రూ. 326 కోట్లు  
చాంద్రాయణగుట్ట ఫ్లై ఓవర్‌ :రూ. 30 కోట్లు  
ఇందిరా>పార్కు– వీఎస్టీ స్టీల్‌బ్రిడ్జి  : రూ. 426 కోట్లు
నల్లగొండ క్రాస్‌రోడ్‌ –ఒవైసీ జంక్షన్‌ ఫ్లై ఓవర్‌: రూ. 526 కోట్లు  
కైత్లాపూర్‌ వద్ద ఆర్‌ఓబీ : రూ. 83 కోట్లు  
ఉప్పల్‌ ఎలివేటెడ్‌ కారిడార్‌కు కొనసాగింపు, గ్రేడ్‌సెపరేటర్లు: రూ. 300 కోట్లు
చాంద్రాయణగుట్ట ఫ్లై ఓవర్‌ పొడిగింపు పనులు

మరిన్ని వార్తలు