శ్రీరామనవమికి హెలికాప్టర్‌ సర్వీసులు!

13 Mar, 2020 09:18 IST|Sakshi

ఇతర రాష్ట్రాల నుంచీ భక్తులు  తరలివచ్చే అవకాశం 

విహంగ వీక్షణంతో పర్యాటక శాఖకూ ఆదాయం 

మంత్రి, కలెక్టర్‌ చొరవ  తీసుకోవాలంటున్న జిల్లా వాసులు 

సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి దివ్యక్షేత్రానికి జాతీయ స్థాయిలో మంచి ప్రఖ్యాతి ఉంది. భద్రాచలంలో శ్రీరామనవమి సందర్భంగా నిర్వహించే సీతారామచంద్రస్వామి కల్యాణానికి, మరుసటి రోజు జరిగే శ్రీరామ పట్టాభిషేకానికి ఎంతో ప్రాశస్త్యం ఉంది. అలాగే వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వారా దర్శనం, దానికి ముందురోజు నిర్వహించే తెప్పోత్సవం కార్యక్రమాలకు సైతం భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు. శ్రీరామనవవిుకి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున వస్తుంటారు. గోదావరిపై వంతెన లేని కాలంలో కూడా భారీగానే వచ్చేవారు.

మరోవైపు రాష్ట్రంలోని పలు ప్రాంతాలతో పాటు ఏపీలోని తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు గోటి తలంబ్రాలతో వందల కిలోమీటర్ల మేర కాలినడకన వస్తున్నారు. అయితే సీతారామ కల్యాణానికి ఇతర దేశాలు, రాష్ట్రాల్లో ఉంటున్న తెలుగు వారు సైతం ప్రతి సంవత్సరం వస్తుంటారు. భద్రాద్రి జిల్లా కేంద్రమైన కొత్తగూడెం వరకు రైలు సౌకర్యం ఉంది. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో భద్రాచలం చేరుకోవాల్సి ఉంటుంది. కల్యాణ మహోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి వందల సంఖ్యలో ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. అయితే శ్రీ సీతారామచంద్రస్వామి కల్యాణానికి మరింత ప్రాచుర్యం, ప్రాధాన్యత కల్పించేలా హైదరాబాద్, విజయవాడ నుంచి హెలికాప్టర్‌ సౌకర్యం కల్పించాలని భక్తులు కోరుతున్నారు.

భక్తుల సంఖ్య పెరిగే అవకాశం..
పర్యాటక శాఖ ద్వారా మూడు రోజుల పాటు హెలికాప్టర్లు నడిపితే ప్రముఖ వ్యక్తులు కల్యాణానికి వచ్చేందుకు మరింత ఆసక్తి చూపిస్తారని ఈ ప్రాంత వాసులు అంటున్నారు. ములుగు జిల్లా మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరకు  హైదరాబాద్‌ నుంచి పర్యాటక శాఖ ఆధ్వర్యంలో హెలికాప్టర్‌ సర్వీసులు నడిపారు. విదేశీయులతో పాటు వివిధ రాష్ట్రాలకు చెందినవారు, తెలంగాణ భక్తులు ఈ సేవలను ఉపయోగించుకున్నారు. గత శివరాత్రి పర్వదినం సందర్భంగా సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయానికి సైతం హైదరాబాద్‌ నుంచి మూడు రోజుల పాటు హెలికాప్టర్‌ సర్వీసులు నడిపారు. ఈ రెండు చోట్లా జౌత్సాహిక భక్తుల కోసం విహంగ వీక్షణం అవకాశాన్ని సైతం పర్యాటక శాఖ కల్పించింది. శ్రీరామనవమి, తెల్లవారి పట్టాభిషేకం సందర్భంగా భద్రాచలానికి కూడా హైదరాబాద్, విజయవాడ నుంచి హెలికాప్టర్‌ సర్వీసులు ఏర్పాటు చేయాలని, విహంగ వీక్షణం అవకాశాలు కల్పించాలని భక్తులు కోరుతున్నారు.

తద్వారా పర్యాటక శాఖకు ఆదాయం సమకూరడంతో పాటు భద్రాద్రికి మరింత ప్రాధాన్యత లభిస్తుందని ఈ ప్రాంత వాసులు అంటున్నారు. భద్రాచలానికి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న దుమ్ముగూడెం మండలంలోని పర్ణశాల ఆలయానికి సైతం హెలికాప్టర్‌ సర్వీసులు ఏర్పాటు చేస్తే ఇతర ప్రాంతాలు, రాష్ట్రాలకు చెందిన భక్తులు సందర్శిస్తారని చెబుతున్నారు. భద్రాచలం, పర్ణశాల ఆలయాలు రెండూ గోదావరి ఒడ్డునే ఉన్నాయి. ఇప్పటికే భద్రాచలం సీతారామచంద్రస్వామి కల్యాణ తలంబ్రాలను ఖండాంతరాలు దాటి అనేక దేశాలకు భక్తులు నిష్టతో తీసుకెళుతున్నారు. ఇలాంటి ప్రాశస్త్యం ఉన్న భద్రాచలం ఉత్సవాలకు హెలికాప్టర్‌ సర్వీసులను ఏర్పాటు చేయాలని, ఈ విషయమై మంత్రి అజయ్‌కుమార్, జిల్లా కలెక్టర్‌ ఎంవీ రెడ్డి చొరవ తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.  

మరిన్ని వార్తలు