పుష్కర స్నానాలకు తగ్గిన భక్తులు..

17 Jul, 2015 00:58 IST|Sakshi
పుష్కర స్నానాలకు తగ్గిన భక్తులు..

సగం కన్న తక్కువే..
అమావాస్య..శూన్యతిథే కారణం


ధర్మపురి నుంచి సాక్షి బృందం: పరమ పవిత్రమైన పుష్కర స్నానం..తిథి నక్షత్రం పట్టింపులు చాలా మంది భక్తులకు గురి ఉంటుంది. ఇదిగో..ఇదే సెంటిమెంట్ గురువారం పుష్కర స్నానాలకు వచ్చే భక్తులపై ప్రభావం చూపింది. ఫలితంగా దాదాపు అన్ని పుష్కర క్షేత్రాల్లోనూ గురువారం నాడు పుష్కర స్నానాలు ఆచరించిన భక్తుల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఈ సంఖ్య మొదటి రెండు రోజుల్లో పుష్కర స్నానాలు ఆచరించిన భక్తుల సంఖ్యలో సగం కన్న తక్కువే కావడం గమనార్హం.

పుష్కరస్నానాల్లో తిథుల ప్రాముఖ్యం..
పంచాగం ప్రకారం పుష్కర స్నానాలకు తిథులు కీలకం. గోదావరి పవిత్ర పుష్కర స్నానాలతో పిండ ప్రధానాలకు భక్తులు మంచి రోజులు ఎన్నుకుంటారు. పాడ్యమి నుంచి పున్నమి వరకు పదిహేను తిథులు ఉండగా పుష్కర స్నానాలు, పిండ ప్రధానాలకు, వాయినాలిచ్చుకునేందుకు విదియ, తదియ, పంచమి, సప్తమి, ఏకాదశి,త్రయోదశి, చతుర్ధశి, పున్నమి రోజులు ప్రాశస్త్యం ఉన్నవిగా వేద పండితులు చెబుతారు. అమావాస్య మాత్రం శూన్యతిథి కావడంతో ఆ రోజు పుష్కర స్నానాలు, పిండప్రదానాలకు భక్తులు పెద్దగా ఆసక్తి చూపరు. ఈ క్రమంలోనే గురువారం నాడు పుష్కర పుణ్యక్షేత్రాల్లో భక్తుల సంఖ్య బాగా తగ్గిపోయింది.

కీలక క్షేత్రాల్లో తగ్గిన పుష్కర భక్తులు..
అమావాస్య సెంటిమెంట్ పలితంగా ధర్మపురి, కాళేశ్వరం, బాసర పుష్కర స్నానాలకు వచ్చే భక్తులు సంఖ్య చాలా మేర తగ్గింది. గురువారం భక్తులు వచ్చినప్పటికి పుష్కర ఘాట్ల వద్ద జనసందోహాం పలుచబడింది. ధర్మపురిలో సుమారు లక్ష , కాళేశ్వరంలో 50-80 వేలు, బాసరలో 70 వేల, భద్రాచంలో 1.20 లక్షల మంది భక్తులు పుష్కర స్నానాలు ఆచరించినట్లు సమాచారం. గురువారం తరువాత మళ్లీ పుష్కర క్షేత్రాలకు భక్తులు ఎప్పటిలాగే తరలివస్తారని అధికార యంత్రాంగం అంచనా వేస్తోంది.

అమావాస్య ప్రభావం ఉంది: పాలెపు జయరాం శర్మ, వేదపండితులు, కోరుట్ల.
అమావాస్య..శూన్యతిథి కావడంతో పుష్కర స్నానాలపై భక్తులు పెద్దగా ఆసక్తి చూపరు. గ్రామీణ ప్రాంతాల్లో ఏ శుభకార్యం చేసేందుకు ముందుకు రారు. అందుకే గురువారం నాడు భక్తుల సంఖ్య తగ్గిపోయింది.
 

మరిన్ని వార్తలు