‘సైబ్‌ హర్‌’తో సురక్షిత సైబర్‌ ప్రపంచం 

16 Jul, 2020 02:53 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్ ‌: మహిళలు–చిన్నారులు అధికంగా సైబర్‌ నేరాల బారిన పడుతున్న క్రమంలో సురక్షిత సైబర్‌ ప్రపంచంపై అవగాహన కోసం విమెన్‌సేఫ్టీ వింగ్‌ చేపట్టిన ‘సైబ్‌ హర్‌’కార్యక్రమం ఎంతో ప్రయోజనకారిగా ఉంటుందని డీజీపీ మహేందర్‌రెడ్డి అన్నారు. బుధవారం సైబ్‌ హర్‌ కార్యక్రమాన్ని ఆయన ఆన్‌లైన్‌లో ప్రారంభించిన అనంతరం మాట్లాడారు. ఈ విపత్తు సమయంలో డేటా వినియోగం 70 శాతం వరకు పెరిగిందన్నారు. అదే సమయంలో మహిళలు, చిన్నారులపై సైబర్‌ నేరాలు కూడా అధికమయ్యాయన్నారు. సైబర్‌ నేరాల నివారణ, సురక్షిత సైబర్‌ ప్రపంచం పై అవగాహన కోసం చేపట్టిన ఈ కార్యక్రమానికి యూనిసెఫ్‌లాంటితో పాటు జాతీయ సంస్థలు భాగస్వాములుగా నిలవడం గర్వకారణంగా ఉంద ని స్పష్టంచేశారు. ఈ కార్యక్రమానికి మద్దతుగా నిలిచిన సంస్థలు, ఎన్జీవోలు, మీడియాలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రచారం కల్పించిన సినీనటుడు నాని, యాంకర్‌ సుమ, షట్లర్‌ పీవీ సింధులకు కృతజ్ఞతలు తెలిపారు.

నెల రోజులపాటు కార్యక్రమం
ఏడీజీ స్వాతీ లక్రా మాట్లాడు తూ.. నెలరోజుల పాటు నిర్విరామంగా జరిగే ఈ కార్యక్రమంలో క్విజ్, వ్యాసరచన, చర్చలు తదితర వినూత్న కార్యక్రమాలు రూపొందించామన్నారు. కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న అన్ని ప్రభుత్వ విభాగాల కు డీఐజీ సుమతి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం డీజీపీ పోస్టర్‌ ఆవిష్కరించారు.  సుమ, పీవీ సింధు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు