‘కమాండ్‌ కంట్రోల్‌’తో భద్రత భేష్‌

3 Aug, 2019 01:44 IST|Sakshi

సైబరాబాద్‌లో పనులను పరిశీలించిన డీజీపీ మహేందర్‌రెడ్డి 

సాక్షి, హైదరాబాద్‌: నేర పరిశోధనకు అత్యంత కీలకంగా మారిన సీసీటీవీ కెమెరాల పర్యవేక్షణలో అధునాతన కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ త్వరలో అందుబాటులోకి రాబోతుందని రాష్ట్ర డీజీపీ మహేందర్‌ రెడ్డి అన్నారు. గచ్చిబౌలిలోని సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌లో చేపట్టిన అధునాతన కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ పనులను పోలీసు కమిషనర్‌ వీసీ సజ్జనార్‌తో కలసి శుక్రవారం పర్యవేక్షించారు. త్వరితగతిన పనులు పూర్తిచేయాలని ఎల్‌ అండ్‌ టీ సిబ్బందిని కోరారు. ప్రస్తుత కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ల ద్వారా హైదరాబాద్‌లో వెయ్యి, సైబరాబాద్‌లో 500 కెమెరాల్ని మాత్రమే పర్యవేక్షించే సదుపాయముందని, అయితే కొత్త కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ద్వారా రెండు వేల కెమెరాల్ని ఏకకాలంలో వీక్షించవచ్చన్నారు.

దేశంలోనే ప్రతిష్టాత్మకంగా బంజారాహిల్స్‌లో నిర్మితమవుతున్న జంట పోలీస్‌టవర్లలో ఏర్పాటు కాబోయే కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు సమాంతరంగా దీన్ని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. వీటితోపాటు కమ్యూనిటీ పోలీసింగ్, ‘నేను సైతం’ప్రాజెక్టుల కింద కాలనీల్లో ఏర్పాటు చేస్తున్న లక్షలాది కెమెరాల్నీ ఈ కేంద్రంలో పర్యవేక్షించే వీలు కలుగుతుందన్నారు. 3 కమిషనరేట్లలో ఎల్‌ అండ్‌ టీ సంస్థ 10,000 అధునాతన కెమెరాల్ని ఏర్పాటు చేస్తోందని తెలిపారు. వేగంగా వెళ్లే వాహనాల నంబర్‌ ప్లేట్లను గుర్తించే ఆటోమేటిక్‌ కెమెరాల్ని ఇక్కడ అందుబాటులోకి తెస్తున్నారు. కాలనీల్లో ఏర్పాటు చేస్తున్న కెమెరాల్ని ఇక్కడి నుంచే పర్యవేక్షిస్తారు.

ట్రాఫిక్‌ రద్దీ నియంత్రణ కోసం ఇంటిగ్రేటెడ్‌ ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ ప్రాజెక్టులో భాగంగా మూడు కమిషనరేట్లలో కెమెరాల్ని అమర్చనున్నారు. ఈ కేంద్రంలో దాదాపు 10 లక్షల కెమెరాలకు సంబంధించిన దృశ్యాల్ని నెలపాటు నిక్షిప్తం చేసే భారీ సర్వర్లను ఇప్పటికే ఏర్పాటు చేశారు. ఏదైనా ఘటన జరిగినప్పుడు ఉన్నతాధికారులు అత్యవసరంగా సమావేశమై సీసీ కెమెరాల దృశ్యాలను వీక్షించేందుకు వీలుగా ఆధునిక హంగులతో వార్‌రూంను ఏర్పాటు చేశారు.    

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా