కఠిన శిక్షలతోనే నియంత్రణ

31 Jul, 2018 00:55 IST|Sakshi

మానవ అక్రమ రవాణాపై డీజీపీ మహేందర్‌రెడ్డి

బాధితులకు న్యాయం జరిగేలా కృషి చేయాలి

ప్రజ్వల–సీఐడీ ఆధ్వర్యంలో దర్యాప్తు మాన్యువల్‌ ఆవిష్కరణ

సాక్షి, హైదరాబాద్‌: మానవ అక్రమ రవాణాను పోలీస్‌ శాఖతో పాటు అన్ని విభాగాలు సంయుక్తంగా నియంత్రించాలని డీజీపీ మహేందర్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. దారుణమైన నేరంగా మానవ అక్రమ రవాణా ఆందోళన కలిగిస్తోందని, చిన్నారులు జీవితాంతం బానిసలుగా బతకాల్సిన పరిస్థితి తలెత్తుతోందని, ఇలాంటి నేరాలు సహించలేనివని పేర్కొన్నారు. రాష్ట్ర సీఐడీ, ప్రజ్వల స్వచ్ఛంద సంస్థ ఆ«ధ్వర్యంలో రూపొందించిన ‘యాంటీ హ్యూమన్‌ ట్రాఫికింగ్‌–విక్టిమ్‌ సెంట్రిక్‌ ఇన్వెస్టిగేషన్‌ మ్యాన్యువల్‌’ను సునీతాకృష్ణన్, సీఐడీ అదనపు డీజీపీ గోవింద్‌ సింగ్‌తో కలసి సోమవారం రాష్ట్ర పోలీసు ముఖ్య కార్యాలయంలో డీజీపీ ఆవిష్కరించారు.

ట్రాఫికింగ్‌కు పాల్పడుతున్న నేరగాళ్లకు శిక్షపడేలా చేస్తేనే ఈ నేరాలపై నియంత్రణ ఉంటుందన్నారు. వ్యభిచారమే కాకుండా నిర్బంధ కార్మికులుగా వేలాది మంది యువత, చిన్నారులు నలిగిపోతున్నారని, బాధితులకు న్యాయం జరిగేలా కృషి చేయాల్సి ఉందన్నారు. అంతర్జాతీయంగా, జాతీయంగా, రాష్ట్రాల వారీగా వ్యవస్థీకృతంగా ఈ నేరాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేరాల్లో కీలకమైన వారికి శిక్షలు పడేలా చేస్తేనే బాధితులకు న్యాయం చేసినట్లవుతుందని పేర్కొన్నారు. ప్రజ్వల సంస్థ 20 ఏళ్లుగా ఈ నేరాలపై విశేషంగా కృషిచేస్తోందని, వేలాది మంది బాధితులను అక్కున చేర్చుకొని వారికి అన్ని విధాలుగా సాయం చేస్తోందని ప్రశంసించారు.

మానవ అక్రమ రవాణా నియంత్రణకు సుప్రీం కోర్టులో పిల్‌ దాఖలు చేసి, ప్రత్యేక చట్టం వచ్చేలా చేశారని కొనియాడారు. ఇటీవల పార్లమెంట్‌లో కొత్త ట్రాఫికింగ్‌ నియంత్రణ చట్టానికి ఆమోదం లభించిందని పేర్కొన్నారు. బాధితులకు రక్షణ, పునరావాసం కల్పించేలా చట్టంలో ఉందని, దీనిపై ప్రతి రాష్ట్రంలో యాంటీ ట్రాఫికింగ్‌ బ్యూరోలు ఏర్పాటయ్యే అవకాశముందన్నారు. హైదరాబాద్‌ సౌత్‌జోన్‌లో ఇటీవల బాలకార్మిక వ్యవస్థ నుంచి 250 మందిని విముక్తి చేశామని, ఈ కేసులో 14 ఏళ్ల పాటు నిందితులకు శిక్షపడిందని డీజీపీ గుర్తుచేశారు.

ముస్కాన్‌తో సత్ఫలితాలు..
సీఐడీ నేతృత్వంలో 2015 నుంచి కొనసాగుతున్న ఆపరేషన్‌ ముస్కాన్‌ ద్వారా 25,834 మందిని కాపాడినట్లు మహిళా భద్రత విభాగం ఐజీ స్వాతిలక్రా తెలిపారు. వీరిలో 12,483 మందిని తల్లిదండ్రులకు అప్పగించామని, మిగిలిన వారిని రెస్క్యూ హోమ్స్‌కు తరలించినట్లు చెప్పారు. 2014 నుంచి ఇప్పటివరకు మానవ అక్రమ రవాణా కింద 1,397 కేసులు నమోదు కాగా, 1,413 మంది నిందితులను అరెస్ట్‌ చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో శాంతి భద్రతల అదనపు డీజీపీ జితేందర్, ఆర్గనైజేషన్‌ అదనపు డీజీపీ రాజీవ్‌ రతన్‌ పాల్గొన్నారు.


ప్రేమించి మోసం చేశాడు
‘నేను పదోతరగతిలో ఉండగా ఓ వ్యక్తితో ప్రేమలో పడ్డాను. ఈ విషయం మా తల్లిదండ్రులకు తెలిసి నాకు పెళ్లి చేయాలని భావించారు. దానికి నేను ఒప్పుకోలేదు. దీంతో హైదరాబాద్‌కు వచ్చాను. ఇంటి తాళం లేకపోయే సరికి బయటే ఉన్నాను. దీంతో అతడు వచ్చి తన ఇంటికి వెళ్దామని చెప్పి అన్నంలో మత్తుమందు కలిపి లైంగిక దాడికి పాల్పడ్డాడు.

ఆ తర్వాత అతడి స్నేహితులు కూడా దాడిచేసి, వ్యభిచార కూపంలో నన్ను అమ్మేశాడు. పారిపోయేందుకు ప్రయత్నిస్తే తీవ్రంగా గాయపరిచేవారు. సీఐడీ అధికారులు వచ్చి కాపాడారు. నాతో పాటు మరో 25 మందిని కాపాడారు. ఆ తర్వాత ప్రజ్వల హోంకు తరలించారు. ఇప్పుడు డిగ్రీ మొదటి సంవత్సరం చదువుకుంటున్నాను. – బాధితురాలు దివ్య

ప్రేమగా మాట్లాడి అమ్మేసింది
‘నా తల్లిదండ్రులు మద్యానికి బానిసయ్యారు. ఏ రోజూ నన్ను పట్టించుకోలేదు. దీంతో ఇంటి నుంచి పారిపోయేందుకు బస్టాండ్‌కు వచ్చా. అక్కడ ఓ మహిళ నాతో ప్రేమగా మాట్లాడి కూతురిలా చూసుకుంటానని చెప్పి మోసం చేసి వ్యభిచారకూపంలో అమ్మేసింది. దీంతో నా జీవితం ముగిసిపోయిందనుకున్నా. కానీ సీఐడీ అధికారులు వచ్చి కాపాడారు. ప్రజ్వల హోంకు వచ్చాక టైలరింగ్, వెల్డింగ్‌ నేర్చుకున్నాను. నాలాగా మోసపోయిన వారికి కౌన్సెలింగ్‌ ఇస్తున్నాను’. – బాధితురాలు మనీషా, హైదరాబాద్‌


హోంమంత్రి గ్రీన్‌చాలెంజ్‌ స్వీకరించిన డీజీపీ
సాక్షి, హైదరాబాద్‌: హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి సూచించిన గ్రీన్‌ చాలెంజ్‌ను డీజీపీ మహేందర్‌రెడ్డి స్వీకరించారు. ఈమేరకు రాష్ట్ర పోలీస్‌ ముఖ్య కార్యాలయంలో సోమవారం మొక్కలు నాటారు. అదనపు డీజీపీ జితేందర్‌తో కలిసి మొక్కలు నాటి ఖమ్మం, నిజామాబాద్‌ కమిషనర్లకు, జగిత్యాల ఎస్పీకి మహేందర్‌రెడ్డి గ్రీన్‌ చాలెంజ్‌ చేశారు.  

మొక్కనాటిన హీరో మహేశ్‌బాబు
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పిలుపుమేరకు పోలీస్‌ అకాడమీలో సోమవారం హరితహారం నిర్వహించారు. అకాడమీలోనే షూటింగ్‌లో ఉన్న హీరో మహేశ్‌బాబును మొక్క నాటాల్సిందిగా అకాడమీ డైరెక్టర్‌ సంతోష్‌మెహ్రా ఆహ్వానించారు. దీనితో మహేష్‌బాబుతో పాటు శిక్షణలో ఉన్న ట్రైనీ సిబ్బంది ఒక్కొక్కరు 5 మొక్కల చొప్పున నాటారు. ఇలా మొత్తం 3వేల మొక్కలు నాటినట్టు సంతోష్‌మెహ్రా తెలిపారు. కార్యక్రమంలో పోలీస్‌ అకాడమీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు