అధికారి మారగానే వ్యవస్థ మారొద్దు

15 Nov, 2017 02:18 IST|Sakshi

ఐపీఎస్‌ అధికారులతో డీజీపీ మహేందర్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: ఒక ఎస్పీ, ఒక కమిషనర్‌ పనిచేసినంత కాలం వ్యవస్థ ఒకరకంగా, ఆ అధికారి మారిపోగానే మరో రకంగా పని చేయకూడదని.. ఎప్పుడూ ఒకేలా ఉండాలని  డీజీపీ మహేందర్‌రెడ్డి అధికారులకు సూచించారు. ఎవరైనా అధికారులు తమదైన ముద్ర వేసేలా పనిచేసినా.. తర్వాత వచ్చే అధికారి మంచి చెడులను బేరీజు వేసుకుంటూ, వ్యవస్థను మరింత బలోపేతం చేసేలా విధులు నిర్వర్తించాలని చెప్పారు.

నూతన డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో.. మంగళ వారం రాష్ట్ర పోలీసు శాఖలో ప్రస్తుత పరిస్థితులు, చేపట్టాల్సిన కార్య క్రమాలు తదితర అంశాలపై కమిషనర్లు, ఎస్పీలు, ఇతర విభాగాల్లో ఉన్న ఐపీఎస్‌ అధికారులతో మహేందర్‌రెడ్డి సమావేశం నిర్వహించారు. పోలీస్‌ ముఖ్య కార్యాలయం లో సుదీర్ఘంగా జరిగిన ఈ భేటీలో.. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లలో అమలవుతున్న కార్యక్రమాలు, చేపట్టిన చర్యలను ఎస్పీలు, కమిషనర్ల దృష్టికి తీసుకెళ్లారు. ఇక నుంచి జిల్లాలు, నూతన కమిషనరేట్ల పరిధిలోనూ ఇలాంటి మార్పులు తీసుకురావాలని సూచించారు. 

టెక్నాలజీ వినియోగాన్ని పెంచు కుంటూ, సిబ్బందికి అత్యాధునిక శిక్షణ ఇచ్చి నేరాల నియంత్రణకు కృషి చేయాలని డీజీపీ సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే ఎంఓపీఎఫ్‌ (మాడ్రనైజేషన్‌ ఆఫ్‌ పోలీస్‌ ఫోర్స్‌) నిధులను సమర్థవంతంగా ఉపయో గించుకోవాలన్నారు. నూతన జిల్లాల్లో నెలకొన్న సమస్యలు, సిబ్బంది బదలా యింపు, కేటాయింపులు, భవన నిర్మాణాలు, ఇతర సౌకర్యాలు తదితర అంశాలపై ఈ సందర్భంగా ఆరా తీశారు.

అవినీతిని సహించేది లేదు
ప్రభుత్వం పోలీసు శాఖకు అన్ని విధాలుగా నిధులు విడుదల చేస్తోందని.. సిబ్బంది, అధికారులు అవినీతికి ఆస్కారం కల్పిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని డీజీపీ స్పష్టం చేశారు. సమాజ హితం కోసం పోలీసు శాఖ చేసే ప్రతిపనిలో యువత, ప్రజలను భాగస్వామ్యం చేయాలని డీజీపీ అధికారులకు సూచించారు. ప్రతి అధికారి కానిస్టేబుళ్లు చేసే పనిని గుర్తించి తోడ్పాటు అందించాలన్నారు.

మరిన్ని వార్తలు