ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ప్రవర్తించొద్దు

28 Feb, 2020 03:02 IST|Sakshi

పటాన్‌చెరు ఘటనను తీవ్రంగా పరిగణించిన డీజీపీ

వెయ్యి కార్యాలయాలతో ఒకేసారి వీడియో కాన్ఫరెన్స్‌

సాక్షి, హైదరాబాద్‌: ప్రజల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసేలా పోలీసులు ప్రవర్తించకూడదని డీజీపీ మహేందర్‌రెడ్డి అన్నారు. పటాన్‌చెరులో బుధవారం కానిస్టేబుల్‌ అనుచిత ప్రవర్తన నేపథ్యంలో పోలీస్‌ ఉన్నతాధికారులు, పోలీస్‌ కమిషనర్లు, ట్రైనింగ్‌ కళాశాలలు, పోలీస్‌ బె టాలియన్లు, ఎస్పీలు, ఇతర యూనిట్‌ అధికారులు, ఎస్‌హెచ్‌ఓ, కానిస్టేబుల్, హోంగార్డ్‌ అధికారులతో కలసి ఒకేసారి వేయి కార్యాలయాలతో అనుసంధానిస్తూ సాయంత్రం దాదాపు 3 గంటల పాటు డీజీపీ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్బంగా డీజీపీ మాట్లాడుతూ.. పటాన్‌చెరులో జరిగిన దురదృష్ట సంఘటనS వల్ల మొత్తం పోలీస్‌శాఖ అప్రతిష్ట పాలయ్యే ప్రమాదం ఏర్పడిందన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా.. నైతిక విలువలు, మానవత తదితర అంశాలపై పోలీస్‌ అధికారులు, సిబ్బందికి నిరంతరం పునశ్చరణ నిర్వహించాలని సూచించారు. కాగా, పోలీస్‌ కానిస్టేబుల్‌ నుంచి అడిషనల్‌ డీజీ స్థాయి వరకు అధికారులు తమ అభిప్రాయాలను సమావేశంలో వెల్లడించారు. ఈ అభిప్రాయాలపై చర్చించి తగిన కార్యాచరణ రూపొందించాలని నిర్ణయించారు.

కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న మహేందర్‌రెడ్డి

మరిన్ని వార్తలు