జనజీవన స్రవంతిలోకి రండి : డీజీపీ

13 Feb, 2019 16:49 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : నిర్మల్‌ జిల్లాకు చెందిన మావోయిస్టు అగ్రనేత సట్వాజి అలియాస్‌ సుధాకర్‌, అతని భార్య వైదుగుల అరుణ అలియాస్‌ నీలిమ తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు డీజీపీ మహేందర్‌ రెడ్డి తెలిపారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ... 1983 నుంచి 1985 వరకు సుధాకర్‌ ఆదిలాబాద్‌లో కొరియర్‌గా పనిచేసినట్లు తెలిపారు. అనంతరం డీసీఎస్‌ కనకం సుదర్శన్‌ సహకారంతో మావోయిస్టుల్లో చేరినట్లు పేర్కొన్నారు.

‘బెంగళూరు కేంద్రంగా సుధాకర్‌ ఆయుధాలు సరఫరా చేసేవాడు. ఈ క్రమంలో ఒకసారి జైలుకు వెళ్లాడు. అక్కడే సుధాకర్‌కు వరవరరావు పరిచయం అయ్యారు. 1990 నుంచి సుధాకర్‌ అఙ్ఞాతంలోకి వెళ్లి 1992-94 మధ్య మావోయిస్టు దళ సభ్యుడిగా పనిచేశాడు. అప్పటి నుంచి అంచెలంచెలుగా ఎదిగి అనేక పదవుల్లో పనిచేశాడు. 2003 నుంచి 2013 వరకు స్టేట్ మిలటరీ కమిషన్ సభ్యుడిగా... 2014 నుంచి 2019 వరకు కేంద్ర కమిటీ సభ్యుడిగా... మిలటరీ కమిషన్ సభ్యుడిగా బిహార్, జార్ఖండ్ కేంద్రంగా పనిచేశాడు’ అని సుధాకర్‌కు సంబంధించిన విషయాలు డీజీపీ వెల్లడించారు. (చదవండి : కొరియర్‌ నుంచి కేంద్ర కమిటీ దాకా)

బాల్య వివాహం కారణంగా విరక్తితో..
సుధాకర్‌ భార్య అరుణ(43) వరంగల్ జిల్లాకు దుగ్గొండి చెందిన వారని డీజీపీ మహేందర్‌ రెడ్డి తెలిపారు. బాల్య వివాహం కారణంగా విరక్తి చెందిన ఆమె.. దళ సభ్యుల పాటలకు ఆకర్షితురాలై దళంలో చేరినట్లు పేర్కొన్నారు. ‘మావోయిస్టులైన అనేక మంది మహిళలు ఆత్మహత్య చేసుకున్నారు. అక్కడి వేధింపుల కారణంగానే తాను పార్టీని వీడుతున్నట్లు ఆమె చెప్పారు. సట్వాజీ మీద పేరు మీద రూ. 25 లక్షల రివార్డు ఉంది. అతడి భార్య పేరు మీద రూ. 10 లక్షల రివార్డు ఉంది. వారిద్దరి పేరుతో ఉన్న ఈ రివార్డును వారికి అందజేస్తాము’ అని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా లొంగిపోయిన మావోయిస్టులకు తెలంగాణ ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని..  కాబట్టి మావోయిస్టులు అందరూ జనజీవన స్రవంతిలో కలిసి ప్రశాంత జీవనం గడపాలని డీజీపీ పిలుపునిచ్చారు. (చదండి : లొంగుబాటలో)

కాగా నిర్మల్‌లోని సారంగాపూర్‌ మండలానికి చెందిన సుధాకర్‌ ఇంటర్‌లోనే రాడికల్‌ స్టూడెంట్స్‌ నాయకుల ప్రభావంతో మావోయిస్టు కొరియర్‌గా చేరారు. పలు హింసాత్మక ఘటనల్లో కీలక పాత్ర పోషించి కీలక నేతగా ఎదిగారు. 2013 నుంచి మావోయిస్టు కేంద్ర పొలిట్‌బ్యూరో సభ్యుడిగా కొనసాగుతూ, సెంట్రల్‌ మిలటరీ సభ్యుడిగా, బిహార్‌- జార్ఖండ్‌ స్పెషల్‌ ఏరియా కమిటీ ఇన్‌చార్జిగా వ్యవహరించిన సుధాకర్‌పై కోటి రూపాయల రివార్డు(జార్ఖండ్‌ ప్రభుత్వం ప్రకటించింది) కూడా ఉంది. దళంలోనే పరిచయమైన నీలిమ అలియాస్‌ మాధవిని ఆయన పెళ్లిచేసుకున్నారు. కాగా తన తమ్ముడు నారాయణ రాంచీలో పోలీసులకు పట్టుబడటం, నిర్మల్‌ జిల్లా పోలీసులు తన తల్లి ద్వారా ఒత్తిడి పెంచడం, మావోయిస్టు పార్టీలో అంతర్గత సంక్షోభం కారణంగా భార్యతో సహా ఆయన పోలీసులకు లొంగిపోయినట్లు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు