ఉట్నూర్‌ ఘటనపై సీఎంకు డీజీపీ నివేదిక

17 Dec, 2017 03:42 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూర్, హస్నాపూర్‌లలో ఆదివాసీలు, లంబాడీల మధ్య జరిగిన ఘర్షణకు కారణాలు, తదనంతర పరిణామాలపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావుకు డీజీపీ మహేందర్‌రెడ్డి నివేదిక సమర్పించినట్లు తెలిసింది. శనివారం తన చాంబర్‌లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన డీజీపీ... దాడుల ఘటనకు కారకులైన, ఆస్తుల ధ్వంసానికి పాల్పడిన వ్యక్తులపై కేసుల నమోదు తదితర అంశాల గురించి అదనపు డీజీపీ అంజనీకుమార్, ఇంటెలిజెన్స్‌ ఐజీ నవీన్‌చంద్‌లతో చర్చించారు. అలాగే నార్త్‌ జోన్‌ ఐజీ నాగిరెడ్డి, ప్రత్యేక పర్యవేక్షకులుగా వెళ్లిన చౌహాన్, అనిల్‌కుమార్, కరీంనగర్‌ రేంజ్‌ డీఐజీ, ఆదిలాబాద్‌ ఎస్పీ శ్రీనివాసులతో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.

కొందరు గుర్తుతెలియని వ్యక్తులు కొమురం భీం విగ్రహానికి చెప్పులదండ వేయడమే ఘర్షణకు ప్రధాన కారణమని జిల్లా ఎస్పీతోపాటు ఉన్నతాధికారులు డీజీపీ దృష్టికి తీసుకొచ్చినట్లు తెలిసింది. అర్ధరాత్రి వరకు కొనసాగిన ఉద్రిక్త పరిస్థితులు, వాటి నియంత్రణకు తీసుకున్న చర్యలను ఐజీ నాగిరెడ్డి డీజీపీకి వివరించినట్లు సమాచారం. సోషల్‌ మీడియా ద్వారా ఘటనకు సంబంధించిన దుష్ప్రచారం ఎక్కువగా జరిగినట్లు ఇంటెలిజెన్స్‌ వర్గాలు గుర్తించాయి. ఉట్నూర్‌లో మొదలైన ఉద్రిక్త పరిస్థితులు ఇతర జిల్లాలకు పాకకుండా ఉండేందుకు ఇంటర్నెట్‌ సేవలను నియంత్రించినట్లు నిఘా వర్గాలు తెలిపాయి. ఘటన జరిగిన ప్రాంతంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో 23 పికెట్లు, 16 చెక్‌పోస్టులు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. ఈ మొత్తం ఘటనకు సంబంధించి ఓ నివేదికను సీఎం కేసీఆర్‌కు డీజీపీ మహేందర్‌రెడ్డి అందించినట్లు తెలియవచ్చింది.  
 

మరిన్ని వార్తలు