గుజరాత్‌లో డీజీపీల సదస్సు

18 Dec, 2018 02:40 IST|Sakshi

స్టాచ్యూ ఆఫ్‌ యూనిటీ ప్రాంతంలో 20 నుంచి సమావేశాలు

అర్బన్‌ మావోయిజం, టెక్నాలజీ ఆధునీకరణపై ప్రధాని సమీక్ష

హాజరు కానున్న అన్ని రాష్ట్రాల పోలీసు అధికారులు

అంశాలపై ప్రజెంటేషన్‌ ఇవ్వనున్న తెలుగు రాష్ట్రాలు  

సాక్షి, హైదరాబాద్‌: ప్రతీ ఏటా డిసెంబర్‌లో జరిగే ఆలిండియా డీజీపీ/ఐజీపీల సదస్సు ఈ సారి కేంద్ర ప్రభుత్వం వినూత్నంగా నిర్వహించబోతోంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగే ఈ సమావేశం గుజరాత్‌లోని స్టాచ్యూ ఆఫ్‌ యూనిటీ (సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ విగ్రహం) ప్రాంతంలో నిర్వహించనున్నారు. ఈ నెల 20 నుంచి 22 వరకు మూడ్రోజుల పాటు జరిగే ఈ సమావేశంలో దేశవ్యాప్తంగా పోలీస్‌శాఖ, కేంద్ర బలగాల పనితీరు, వాటి అభివృద్ధి, ఆధునీ కరణపై ప్రధాని సమీక్షిస్తారు.

ప్రతీ ఏటా అన్ని రాష్ట్రాల్లో పోలీస్‌శాఖ నిర్వహిస్తున్న ఆధునీకరణ కార్యక్రమాలు, వినూత్న ప్రయోగాలు, అందుకు కేంద్ర ప్రభుత్వం అందించే తోడ్పాటు తదితరాలన్నింటిపై ప్రధాని అన్ని రాష్ట్రాల డీజీపీలతో అధ్యయనం చేస్తారు. దేశంలో అంతర్గత శత్రువులను నియంత్రించేందుకు తీసుకోవాల్సిన వ్యూహా త్మక చర్యలపైనా ఇంటెలిజెన్స్‌ బ్యూరో ఇచ్చే నివేదికలపై చర్చ జరుపుతారు. అదేవిధంగా పోలీస్‌శాఖలో తీసుకురావాల్సిన సాంకేతిక మార్పులు, ప్రజలకు మరింత చేరువయ్యేం దుకు చేపట్టాల్సిన కార్యక్రమాలను బ్యూరో ఆఫ్‌ పోలీస్‌ రిసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ విభాగం ఇచ్చే కార్యాచరణను అన్ని రాష్ట్రాలకు వివరించనున్నారు. 

అర్బన్‌ మావోయిజంపై ప్రజెంటేషన్‌..
దేశంలో అంతర్గత భద్రతకు ముప్పుగా ఉన్న మావోయిస్టు, ఉగ్రవాద సంస్థల కార్యకలా పాలపై సుదీర్ఘంగా ఈ భేటీలో దృష్టి సారించ నున్నారు. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల్లో కార్యకలాపాలు ఏవిధంగా ఉన్నాయి.. వాటి నియంత్రణకు ఇప్పటివరకు ఆయా రాష్ట్రాలు చేపట్టిన చర్యలపై ప్రజెంటేషన్‌ ఇవ్వనున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ పోలీసులు మావోయిస్టులను అంచెలంచెలుగా నియంత్రిస్తూ సక్సెస్‌ అవుతున్నారు. గడిచిన ఐదేళ్లలో తెలంగాణలో చెదురుమదురు ఘటనలు తప్పా పెద్దగా మావోయిస్టు కార్యకలాపాలు సాగడం లేదు.

ఇటు ఏపీలో మాత్రం ఓ ఎమ్మెల్యే, మరో మాజీ ఎమ్మెల్యేను హతమార్చి మావోయిస్టు పార్టీ మరోసారి తన గుర్తింపును చాటింది. అయితే అన్ని రాష్ట్రాల్లో మావోయిస్టు పార్టీ అర్బన్‌ ప్రాంతాల్లో దృష్టి పెట్టినట్టు కేంద్ర నిఘా బృందాలు గుర్తించాయి. ఈ నేపథ్యంలో అర్బన్‌ మావోయిజం నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలు, ముందస్తు జాగ్రత్త అంశాలపై రెండు తెలుగు రాష్ట్రాల పోలీస్‌ అధికారులు ప్రధాని అధ్యక్షతన జరిగే ఈ భేటీలో ప్రజెంటేషన్‌ ఇవ్వనున్నట్టు తెలిసింది. తెలంగాణ నుంచి శాంతి భద్రతల అదనపు డీజీపీ జితేందర్‌తో పాటు మరో సీనియర్‌ ఐజీ, ఏపీ నుంచి డీజీపీతో పాటు ఇంటెలిజెన్స్‌ ఐజీ ఒకరు పాల్గొనబోతున్నట్టు తెలిసింది. 

మరిన్ని వార్తలు