దరి చేరని ‘ధరణి’

16 Mar, 2019 12:34 IST|Sakshi
తహసీల్దార్‌ కార్యాలయం

సాక్షి, జూలపల్లి: మండలాల్లో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రకటనలకే పరిమితమైంది. భూముల క్రమబద్ధీకరణతో పాటు భూముల క్రయవిక్రయాలను సులభతరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తహసీల్దార్‌ కార్యాలయాల్లోనే రిజిస్ట్రేషన్‌ చేయడానికి సంకల్పించింది. ఈ విషయాన్ని ప్రకటించి జిల్లాలోని కొన్ని మండలాల్లో ప్రయోగాత్మకంగా రిజిస్ట్రేషన్‌ సేవలు ప్రారంభించి పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావడం లేదు. సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాలతో సంబంధం లేకుండా మండలాల్లోనే భూముల కొనుగోళ్లకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు చేసే ప్రకియ ఇంకా ప్రారంభం కాలేదు. ధరణి వెబ్‌సైట్‌ ద్వారా భూములకు సంబంధించిన పూర్తి వివరాలను నమోదు చేయాల్సి ఉండగా ఆ ప్రక్రియ ఇంకా బాలరిష్టాలు దాటడం లేదు. ధరణి ప్రారంభమై ప్రభుత్వ అనుమతి వస్తే మం డలంలోనే రిజిస్ట్రేషన్లు చేసుకునే వీలుకలిగే రైతులకు దూర, సమయ, వ్యయ భారం తగ్గుతుంది.


అధికారులకు శిక్షణ
ధరణి సేవలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అన్ని మండల కేంద్రాల్లోని తహసీల్దార్‌ కార్యాలయాల్లో ఏర్పాటు చేశారు. సంబంధిత అధికారులకు శిక్షణ ఇచ్చారు. పట్టణ ప్రజలకు పరిమితమైన రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలు మండల కేంద్రాల్లో సైతం అందుబాటులోకి తీసుకుని రావడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్‌ సేవలు ప్రారంభం కాలేదు. నెలలు గడుస్తున్నా భూ రిజిస్ట్రేషన్‌ సేవలు అందుబాటులోకి రాలేదు. గతంలో ఆన్‌లైన్‌లో నమోదు కాని భూ వివరాలను భూరికార్డుల ప్రక్షాళన ఆనంతరం ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. రిజిస్ట్రేషన్‌ విధానానికి ధరణి వెబ్‌సైట్‌ను రూపొందించారు. సబ్‌ రిజిస్ట్రార్‌ల ప్రకియపై ఇప్పటికే తహసీల్దార్‌తో పాటు కంప్యూటర్‌ ఆపరేటర్లకు శిక్షణ ఇచ్చారు. తహసీల్దార్‌ సబ్‌ రిజిస్ట్రార్‌గా వ్యవహరించేందుకు వారికి ధరణి వెబ్‌సైట్‌పై అవగాహన కల్పించారు. మండలకేంద్రాల్లో వెబ్‌సైట్‌ ఓపెన్‌ కాకపోవడంతో జిల్లా కేంద్రానికి వెళ్లి పనులు చేసిన సంఘటనలు ఉన్నాయి. నమోదు ప్రకియ పూర్తి కాక రిజిస్ట్రేషన్, రైతుబంధు, రైతుబీమా తదితర పనుల్లో జాప్యంపై రైతులు ఇబ్బందులు పడుతున్నారు.


ధరణితో రైతులకు ఉపయోగం
మండల కేంద్రంలోనే రిజిస్ట్రేషన్లు చేయడంతో రైతులకు ఎంతో మేలు కలుగుతుంది. దళారుల ప్రమేయం ఉండదు. అలాగే తప్పుడు రిజిస్ట్రేషన్‌లకు అవకాశం ఉండదు. భూ వివరాల కోసం తహసీల్దార్‌ కార్యాలయం చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. మండల ప్రజల భూ వివరాలకు సంబంధించి తహసీల్దార్‌ కార్యాలయంలోనే రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు. దీంతో నకిలి రిజిస్ట్రేషన్లకు చెక్‌ పెట్టవచ్చు. సరళమైన దస్తావేజులతో రిజిస్ట్రేషన్‌ చేసుకునే వీలుంటుంది. తహసీల్దార్‌ కార్యాలయంలోనే భూ రికార్డుల ప్రకియలో వివరాలు అన్‌లైన్‌లో నమోదు చేస్తారు.


మండల పరిస్థితి ఇది
మండలంలోని 7 రెవెన్యూ గ్రామాల్లో మొత్తం 11594 ఖాతాలుండగా 8136 ఖాతాలు పూర్తి చేయబడి పాస్‌ పుస్తకాలు అందుకున్నారు. ఇంకా 3458 మంది రైతులు వివిధ కారణాలతో తమ భూములు ఆన్‌లైన్‌లో నమోదు కాలేదు. మండలంలో అబ్బాపూర్‌ గ్రామంలో 625, జూలపల్లిలో 1137, కాచాపూర్లో 1040, కుమ్మరికుంటలో 957, పెద్దాపూర్‌లో 1379, తేలుకుంట 1363,వడ్కాపూర్‌లో 1635 ఖాతాలు డిజిటల్‌ సైన్‌ చేయడం జరిగింది. 

ఆన్‌లైన్‌ ప్రక్రియ కొనసాగుతుంది
భూములు ఆన్‌లైన్‌ ప్రక్రి య కొనసాగుతోంది. దశాబ్దాలుగా భూముల రికార్డులు అస్తవ్యస్తంగా ఉండగా భూ ప్రక్షాళన తర్వాత కొలిక్కి వచ్చా యి. సాంకేతిక కారణాలతో జాప్యం జరుగుతోంది. మండలంలో రిజిస్ట్రేషన్‌ పనులకు సంబం ధించి ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తే వెంటనే సేవలు ప్రారంభించే అవకాశాలున్నాయి. ఈ విధానంతో రైతులకు ప్రయోజనం కలుగుతుంది. ప్రభుత్వం నూతనంగా ఇంటిగ్రెటేడ్‌ ల్యాండ్‌ రెవె న్యూ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ (ఐఎల్‌ఆర్‌ఎమ్‌ఎస్‌)ను తీసుకుని రావడం జరిగింది.
– రమేశ్, తహసీల్దార్, జూలపల్లి 

మరిన్ని వార్తలు