ధరణి సర్వర్‌ డౌన్‌..

8 Jun, 2018 01:55 IST|Sakshi

పాస్‌పుస్తకాల తప్పుల సవరణకు ఆటంకాలు

సర్వర్‌ పనిచేయక ఆలస్యం

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని భూముల సమగ్ర వివరాల కోసం రూపొందించిన ‘ధరణి’వెబ్‌సైట్‌ బాలారిష్టాలు ఎదుర్కొంటోంది. ఈ వెబ్‌సైట్‌ బుధవారం సాయంత్రం నుంచి మొరాయిస్తోందని, పాస్‌పుస్తకాల్లో తప్పుల సవరణకు సహకరించడం లేదని రెవెన్యూ వర్గాలంటున్నాయి.

ఇప్పటికే పాస్‌పుస్తకాల సవరణ విషయంలో జాప్యం జరుగుతుండగా, అధికారికంగా రూపొందించిన వెబ్‌సైట్‌ సర్వర్‌ డౌన్‌ కావడం రెవెన్యూ వర్గాలకు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది. అయితే, రాష్ట్రవ్యాప్తంగా ధరణి వెబ్‌సైట్‌ అందుబాటులోకి వచ్చిన అన్ని మండలాల్లో ఒకేసారి తప్పుల సవరణకు ఉపక్రమించడంతో సర్వర్‌ డౌన్‌ అయిందని, దీన్ని వెంటనే పునరుద్ధరిస్తామని ఉన్నతాధికారులు చెబుతున్నారు.  

నత్తనడకన తప్పుల సవరణ
ధరణి వెబ్‌సైట్‌ ద్వారా పాస్‌పుస్తకాల్లో తప్పుల సవరణల కార్యక్రమం నత్తనడకన నడుస్తోంది. వాస్తవానికి, గతనెల 28 నుంచి ఈనెల 3వ తేదీలోపు ఈ తప్పుల సవరణ కార్యక్రమం పూర్తి కావాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. అందులో భాగంగా తొలుత ఆధార్‌ నంబర్ల మార్పులు, డబుల్‌ ఖాతాల మార్పులకు సంబంధించిన ఆప్షన్లను ఇచ్చారు. కానీ ఎక్కువ మొత్తంలో నమోదయిన విస్తీర్ణంలో తేడాలు, సర్వే నంబర్లు, పేర్లలో తప్పుల గురించిన ఆప్షన్లు ఇవ్వలేదు.

అయితే, సర్వే నంబర్లు, పేర్లలో మార్పులకు సంబంధించిన ఆప్షన్లను గురువారం నుంచి అందుబాటులోకి తెచ్చారు. కానీ, సర్వర్‌ డౌన్‌ కావడంతో ఆ పని కూడా ముందుకు సాగడం లేదు. దీనికి తోడు మరో 10 రకాల తప్పులకు సంబంధించిన ఆప్షన్లను ఇంకా ఇవ్వాల్సి ఉంది. ఈ ఆప్షన్ల ద్వారా పాస్‌పుస్తకాల్లో తప్పులను సవరించాల్సి ఉంది. కానీ, దశలవారీగా ఇస్తున్న ఈ ఆప్షన్లు క్షేత్రస్థాయి రెవెన్యూ యంత్రాంగానికి తలనొప్పిగా మారాయి.

అసలే అన్ని ఆప్షన్లు అందుబాటులోకి రాక తిప్పలు పడుతున్న రెవెన్యూ యంత్రాంగానికి ఈ సర్వర్‌ డౌన్‌ సమస్య మరిన్ని ఇబ్బందులను తెచ్చి పెడుతుండటం గమనార్హం. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి అన్ని రకాల తప్పులకు సంబంధించిన ఆప్షన్లను ఇచ్చి, సర్వర్‌ సమస్యలు లేకుండా చూస్తేనే ఇంకో రెండు నెలల్లో అయినా తప్పులు లేని పాస్‌పుస్తకాలు రాష్ట్ర రైతాంగానికి అందే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మరిన్ని వార్తలు