సంక్రాంతిలోపు పసుపు రైతులకు శుభవార్త

15 Dec, 2019 13:00 IST|Sakshi

సాక్షి, నిజామాబాద్‌: సంక్రాంతిలోపు పసుపుకి ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేస్తామని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్‌ అన్నారు. పసుపు బోర్డు కన్నా మంచి పరిష్కారం దిశగా కేంద్ర నిర్ణయం తీసుకుందన్నారు. దీంతో రైతులకు మంచి రోజులు రానున్నాయని సంతోషం వ్యక్తం చేశారు. నిజామాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్‌, ఎంఐఎం పార్టీలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ముస్లిం, మైనారిటీలకు ఓవైసీ అనే అద్దాలు తొడిగి ఓట్లు దండుకుంటున్నారని విమర్శించారు. టీఆర్‌ఎస్‌ వలలో పడ్డ ముస్లింలు ఇకనైనా ఓట్లు వేసే సమయంలో ఆలోచించండని కోరారు. కాగా టీఆర్‌ఎస్‌ పార్టీ హిందువులకు వ్యతిరేకంగా మారిందన్నారు. ఎంఐఎం పార్టీ ముస్లింలకు, హైదరాబాద్‌ నగరానికి చేసిందేమీ లేదని దుయ్యబట్టారు. పౌరసత్వ బిల్లుతో ముస్లింలకు ఎలాంటి నష్టం లేదని స్పష్టం చేశారు.

పసుపు రైతుల గురించి అరవింద్‌ మాట్లాడుతూ.. ‘సుగంధ ద్రవ్యాల లిస్టులో ఉన్న పసుపుకు ప్రచారం లభించలేదు. అందుకే పసుపు రైతులకు మద్దతు ధర లభించలేదు. బోర్డుల వల్ల పంటలకు న్యాయం జరగడం లేదు. త్వరలో కొన్ని బోర్డులు రద్దయ్యే అవకాశం ఉంది. కేంద్రం పసుపు పంటకు బోర్డుతో ఉండే అధికారాలతో పాటు సమన్వయ కమిటీ ఏర్పాటు చేయనుంది. పసుపు రైతుల కోసం ప్రతియేడు రూ.100 నుంచి రూ.200 కోట్లు ఇవ్వనున్నాం. ఇకపై పసుపు విత్తనాలు, ఎరువు, అమ్మకాలు, కొనుగోలు, నాణ్యత, పంట బీమా, మద్దతు ధర అన్నీ ఇక్కడే నిర్ణయిస్తాం. ఇక్కడ పండించే పసుపును విదేశాలకు ఎగుమతి చేసే సామర్థ్యాన్ని నూతన విధానం ద్వారా కల్పిస్తాం. రైతులకు పసుపు విషయంలో అపోహలు వద్దు. పసుపు బోర్డు కన్నా మంచి విధానాన్ని అందిస్తాం. రాష్ట్ర ప్రభుత్వం పసుపుకి మద్దతు ధర ప్రతిపాదనలు పంపితే ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా వుంది. కానీ ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు ఎందుకు పంపటం లేద’ని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

>
మరిన్ని వార్తలు