ఎస్సీ వర్గీకరణ కోసం ఢిల్లీలో ధర్నా 

29 Dec, 2018 01:58 IST|Sakshi
మీడియాతో మాట్లాడుతున్న ఎమ్మార్పీఎస్‌ నాయకులు

జగదేవ్‌పూర్‌ (గజ్వేల్‌): కొత్త ఏడాదిలో కొత్త ఉద్యమాలకు ఎమ్మార్పీఎస్‌ శ్రీకారం చుడుతుందని ఎమ్మార్పీఎస్‌ తెలంగాణ జాతీయ అధ్యక్షుడు మేడి పాపయ్య, రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్‌ అన్నారు. వచ్చేనెల 3, 4 తేదీల్లో ఢిల్లీలో జరిగే ఎస్సీ వర్గీకరణ ధర్నాను విజయవంతం చేయాలని కోరారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా తిగుల్‌నర్సాపూర్‌లోని కొండ పోచమ్మ ఆలయాన్ని వీరు సందర్శించారు. అనంతరం రాష్ట్ర కమిటీ సభ్యులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణపై కేంద్ర ప్రభుత్వం చిన్నచూపు చూసిందని, అందుకే మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి మాదిగలు పుట్టగతులు లేకుండా చేశారన్నారు. వచ్చే నెల 3, 4 తేదీలల్లో ఢిల్లీలో  వర్గీకరణ కోసం ధర్నా చేపడుతున్నామని తెలిపారు. వర్గీకరణ విషయాన్ని సీఎం కేసీఆర్‌ ఇటీవల ప్రధాని దృష్టికి తీసుకెళ్లడంపై తెలంగాణ ఎమ్మార్పీఎస్‌ తరఫున  కృతజ్ఞతలు తెలిపారు. 

కొండపోచమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు 
ఎమ్మార్పీఎస్‌ తెలంగాణ అధ్యక్షుడిగా కొత్తగా నియామకం అయిన వంగపల్లి శ్రీనివాస్‌ శుక్రవారం కొండపోచమ్మ ఆలయంలోని అమ్మవారిని దర్శించుకున్నా రు. ఆలయ చైర్మన్‌ ఉపేందర్‌రెడ్డి వారికి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ గుర్రాల శ్రీనివాస్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు పొన్నాల కుమార్, మహిళా అధ్యక్షురాలు మంజుల తదితరులు పాల్గొన్నారు. 

వర్గీకరణ చేయొద్దు: చెన్నయ్య 
హైదరాబాద్‌: ఎస్సీ వర్గీకరణ చెల్లదని సుప్రీంకోర్టు స్పష్టం చేసినా, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎస్సీ వర్గీకరణ బిల్లును భుజాలపై మోసుకెళ్లి ప్రధాని మోదీ  వద్ద పెట్టడం మాలల మనోభావాలను దెబ్బతీయటమేన ని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి.చెన్నయ్య అన్నారు. శుక్రవారం మాల మహానాడు రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ‘వర్గీకరణ వద్దు.. కలిసుంటేనే ముద్దు’అంటూ లోయర్‌ ట్యాంక్‌ బండ్‌లోని డా.బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహం వద్ద మహాధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం డా.బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహం నుంచి చౌరస్తా వరకు రాస్తారోకో చేపట్టారు. ట్రాఫిక్‌ సమస్య తలెత్తడంతో పోలీసులు ఆందోళనకారులను సైఫాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ఈ క్రమంలో పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఈ సందర్భంగా చెన్నయ్య మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ రెండోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి మాలల ఓట్లు అవసరం రాలే దా? అని ప్రశ్నించారు. ఓటు రాజకీయాలు చేసి ప్రభుత్వం వచ్చిన తర్వాత  వర్గీకరణ బిల్లు జపం చేయడం సరైంది కాదన్నారు. ఇలాంటి నిర్ణయాలను మానుకోకపోతే ప్రగతి భవనాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తం గా ఆందోళనలను ఉధృతం చేసి, మాలల సత్తా చాటుతామన్నారు. కార్యక్రమంలో మాలమహానాడు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గైని గంగారాం, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జంగం శ్రీనివాస్, మహిళా అధ్యక్షురాలు కనదాల తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు