తాగునీటి కోసం ధర్నా

27 Jul, 2018 08:43 IST|Sakshi
తాగునీటి సమస్య పరిష్కరించాలని కోరుతూ ఖాళీ బిందెలతో రోడ్డెక్కిన మహిళలు

రోడ్డెక్కిన రేగడిమైలారం గ్రామస్తులు

అంతర్రాష్ట్ర రహదారిపై గంటపాటు రాస్తారోకో

పోలీసులతో వాగ్వాదం అధికారుల హామీతో ఆందోళన విరమణ

కొడంగల్‌ రూరల్‌ వికారాబాద్‌ : ‘వారం రోజులుగా తాగునీటి కోసం అల్లాడుతున్నాం. కొన్నాళ్లు బోరు సమస్య, మరికొన్నాళ్లు విద్యుత్‌ సమస్యతో నీటి కటకట ఏర్పడింది. ఎంతకీ అధికారులు స్పందించకపోవడంతో ధర్నాకు దిగాం.. ఓపిక నశించి రోడ్డెక్కాం’.. అంటూ బొంరాస్‌పేట మండలంలోని రేగడిమైలారం గ్రామస్తులు ఆవేదన వ్యక్తంచేశారు.

తాగునీటి ఇబ్బందులను తీర్చాలని కోరుతూ గురువారం బీజాపూర్‌– హైదరాబాద్‌ అంతర్రాష్ట్ర హైవేపై ఖాళీ బిందెలతో రాస్తారోకో చేపట్టారు. రేగడిమైలారం పటేల్‌చెర్వు వద్ద ఉన్న తాగునీటి బోరుకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయి వారమైంది. ఇప్పటి వరకు అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోలేదు.

దీంతో మండిపోయిన మహిళలు ఖాళీ బిందెలతో ధర్నా చేపట్టారు. రోడ్డుపై బైఠాయించి నినదించారు. వీరి నిరసనతో వాహనాల రాకపోకలు స్తంభించి ట్రాఫిక్‌ అంతరాయం ఏర్పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మహిళలను సముదాయించారు. ట్రాఫిక్‌ ఎస్‌ఐ మల్లారెడ్డి ట్రాన్స్‌కో ఏఈతో ఫోన్‌లో మాట్లాడారు. విద్యుత్‌ సమస్య తీరుస్తా మని ఏఈ సాంబయ్య హామీ ఇవ్వడంతో ఆందో ళన విరమించారు. 

ట్రాన్స్‌కో ఏఈ సందర్శన 

తాగునీటి సమస్యకు విద్యుత్‌ సమస్య అంతరా యం ఏర్పడిన విషయంపై ట్రాన్స్‌కో ఏఈ సాం బయ్య పరిశీలించారు. ఎస్‌ఐ మల్లారెడ్డితో మాట్లా డి విద్యుత్‌ సమస్య నెలకొన్న కాలనీలో విద్యుత్‌ తీగలను సరి చేయించారు. కానీ ట్రాన్స్‌ ఫార్మర్‌ చెడిపోవడంతో సమస్య మళ్లీ మొదటికి వచ్చింది. ట్రాన్స్‌ఫార్మర్‌ను మరమ్మతు చేయించి విద్యుత్‌ సమస్య తీరుస్తామని ఏఈ హామీ ఇచ్చారు.

స్నానాలకూ తిప్పలే 

తాగునీటి కోసం నేను నిత్యం నడవలేకపోతున్నా. రోడ్డు దాటి అవస్థలు పడుతుంటే ప్రజాప్రతినిధులు చూసి కూడా స్పందించడం లేదు. వృద్ధులు, చిన్నారులు నిత్యం అవస్థలు పడుతూ నీళ్లు తెచ్చుకుంటున్నాం. స్నానాలకు కూడా తిప్పలే ఉంది. తాగునీటి ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం చూపాలి. 

– ఆంజనేయులు, దివ్యాంగుడు, ఎస్సీకాలనీ

వంటకు నీళ్ల కరువు 

తాగడానికి నీళ్లు లేక వానకాలంలోనూ ఇబ్బంది పడుతున్నాం. ఒక దిక్కు నీళ్ల కోసం, మరో దిక్కు రోడ్డు పనులు జరుగుతున్నాయి. బిందెడు నీళ్ల కోసం దూరంలో ఉన్న బోరు నుంచి తెచ్చుకుంటున్నాం. ఇట్లా ఎన్నిరోజులు అవస్థలు పడాలే. వంట చేసుకునేందుకు చెంబెడు నీళ్లు లేని పరిస్థితి. 

– సులోచన, బండమీది కాలనీ

సమస్య పరిష్కరించాలి

గ్రామంలో మిషన్‌ భగీరథ, రోడ్డు విస్తరణ పను లు ముమ్మరంగా సాగుతున్నాయి. దీంతో రోడ్డు కు ఇరువైపులా రాకపోకలు పెరిగి తాగునీటి పైపులైన్‌లు తెగాయి. తాగునీటి సమస్య ఏర్ప డింది. తాగునీటి బోర్లకు విద్యుత్‌ సరఫరా లైన్లు వేరేగా ఏర్పాటుచేసి సమస్య పరిష్కరించాలి. 

– మొగులయ్య, రేగడిమైలారం  

మరిన్ని వార్తలు