డయాబెటిక్‌ విద్యార్థులు పండ్లు తెచ్చుకోవచ్చు 

2 Jan, 2019 01:35 IST|Sakshi

ఈ నెల 8 నుంచి జేఈఈ మెయిన్‌ పరీక్షలు 

నిబంధనలను విడుదల చేసిన ఎన్‌టీఏ  

సాక్షి, హైదరాబాద్‌: దేశంలోని ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ఐటీ, ఐఐటీ, జీఎఫ్‌టీఐలలో ప్రవేశాల కోసం ఈ నెల 8 నుంచి 12 వరకు నిర్వహించనున్న జేఈఈ మెయిన్‌ ప్రవేశ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు పాటించాల్సిన ముఖ్యమైన నిబంధనలను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ప్రకటించింది. పరీక్ష హాల్లోకి విద్యార్థులు నిర్ణీత సమయంలో చేరుకోవాలని సూచించింది. వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకున్న హాల్‌టికెట్‌లో పేర్నొన్న నిబంధనలు అన్నింటినీ విద్యార్థులు పాటించాలని పేర్కొంది. ఆన్‌లైన్‌ పరీక్షలు ఉన్న ఆయా తేదీల్లో ప్రతి రోజూ ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు మొదటి షిఫ్ట్‌ పరీక్ష, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 వరకు రెండో షిఫ్ట్‌ పరీక్షలను నిర్వహించనున్నట్లు పేర్కొంది. విద్యార్థులను రెండు గం టల ముందు నుంచే పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తామని, విద్యార్థులు గంట ముందుగానే పరీక్ష కేంద్రాల్లోకి వెళ్లాల్సిందేనని స్పష్టం చేసింది. విద్యార్థులు ఉదయం పరీక్షకు 8:30 లోపు, మధ్యాహ్నం పరీక్షకు 1:30 లోపు పరీక్ష కేంద్రంలోకి వెళ్లాలని, ఆ తరువాత అనుమతించేది లేదని వెల్లడించింది. ఉదయం పరీక్షకు 8:45 నుంచి 9 గంటల వరకు, మధ్యాహ్నం పరీక్షకు 1:45 నుంచి 2 గంటల వరకు మాత్రమే విద్యా ర్థులను పరీక్ష హాలులోకి అనుమతిస్తారంది

హాల్‌టికెట్, ఫొటో, ఐడీ ప్రూఫ్‌.. 
విద్యార్థులు హాల్‌టికెట్‌తోపాటు పాస్‌పోర్టు సైజు ఫొటో, ఐడీ ప్రూఫ్‌ వెంట తెచ్చుకోవాలని ఎన్‌టీఏ పేర్కొంది. పరీక్ష హాల్లోనే విద్యార్థులకు పెన్సిల్, పెన్ను, రఫ్‌ వర్క్‌ పేపరు అందిస్తారని, వాటిని తీసుకురావాల్సిన అవసరం లేదని వెల్లడించింది. ముఖ్యంగా డయాబెటిక్‌ విద్యార్థులు షుగర్‌ ట్యాబ్లెట్లు, అరటి పండ్లు, యాపిల్, ఆరెంజ్, ట్రాన్స్‌ ఫరెంట్‌ వాటర్‌ బాటిల్‌ వెంట తెచ్చుకోవచ్చని వివరించింది.   

మరిన్ని వార్తలు