అక్కర లేకున్నా వైద్యపరీక్షలు

13 Mar, 2015 00:10 IST|Sakshi

డయాగ్నస్టిక్ సెంటర్లలో నిలువుదోపిడీ
     ఇష్టారాజ్యంగా ఫీజుల వసూళ్లు
     నిశ్చేష్టులై చూస్తున్న వైద్య ఆరోగ్యశాఖ అధికారులు
 
 నల్లగొండ టౌన్ : జిల్లాలో సుస్తి చేసిందని వ్యక్తి అస్పత్రికి వచ్చాడంటే ల్యాబ్ నిర్వాహకులకు పండగే పండుగ.. అవసరం లేకున్నా సదరు డాక్టర్ రక్త, మూత్ర, ధైరాయిడ్, ఈసీజీ, షుగర్, స్కానింగ్ ఇతర పరీక్షలకు రెఫర్ చేయడం.. తప్పని సరి పరిస్థితులలో డాక్టర్ సూచించిన విధంగా పరీక్షలను నిర్వహించుకుని జేబులు ఖాళీ చేసుకోవడం రోగులకు పరిపాటిగా మారింది. వచ్చిన జబ్బుకు డాక్టర్ రాసే మందుల ఖర్చుకు మూడింతలు, నాలుగింతలు వైద్య పరీక్షలకు వెచ్చించాల్సి వస్తుంది. ఆస్పత్రికి వచ్చే వారి నుంచి పరీక్షల పేరుతో నిలువుదోపిడి చేస్తూ ల్యాబ్‌ల నిర్వాహకులు లక్షలాది రూపాయలను ఇష్టారాజ్యంగా వసూళ్లు చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
 
 అనుమతులు లేకుండానే...
 జిల్లాలోని ప్రధాన పట్టణాలైన నల్లగొండ, మిర్యాలగూడ, సూర్యాపేట, భువనగిరి, దేవరకొండ, హుజూర్‌నగర్, కోదాడ , చౌటుప్పల్, నకిరేకల్‌తో పాటు మండల కేంద్రాల్లో ఎలాంటి అనుమతులు లేకుండా పెద్ద ఎత్తున డయాగ్నస్టిక్ సెంటర్లు వెలిశాయి. నర్సింగ్‌హోమ్‌లతో పాటు ఇతర క్లినిక్‌లకు అనుబంధంగా ఇబ్బడి ముబ్బడిగా వందలాది ల్యాబ్‌లను ఏర్పాటు చేసి అమాయక ప్రజలను జలగల్లా పీల్చిపిప్పి చేస్తున్నారు. జిల్లాలో అధికారికంగా నర్సింగ్‌హోమ్‌లలో 215 డయాగ్నస్టిక్ సెంటర్లు ఉండగా, ఇతర ల్యాబ్‌లు 70 కలిపి మొత్తం 285కి మాత్రమే అనుమతులు ఉన్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ వద్ద రికార్డులు ఉన్నాయి.
 
 అయితే వీటికి అదనంగా అనుమతులు లేకుండా మరో 50 వరకు చిన్నాచితక ల్యాబ్‌లు పనిచేస్తున్నాయి. జిల్లాలో ఎక్కడైనా ప్రైవేటు ఆసుపత్రి లేదా ల్యాబ్‌ను ఏర్పాటు చేయాలంటే కచ్చితంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అనుమతి తీసుకోవాలి. ఆస్పత్రి లేదా ల్యాబ్‌ను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ప్రతినిధులు తొలుత తాత్కాలిక ధ్రవీకరణ పత్రం జారీ చేస్తారు. అనంతరం పదిరోజుల్లో ఆస్పత్రిని పరిశీలించి అర్హులైన వైద్యులు, మౌలిక వసతులు, అత్యవసర వైద్య పరికరాలు, వ్యర్థపదార్థాల నిర్మూలన వ్యవస్థ, పారిశుద్ధ్య నిర్వహణ వంటివన్నీ సక్రమంగా ఉంటే శాశ్వత నమోదు పత్రం జారీ చేస్తారు. కానీ జిల్లాలో ఎక్కడా ప్రభుత్వ నిబంధనలు పాటించిన ల్యాబ్‌లు ఉన్నట్లు కనబడడం లేదని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  
 
 కనబడని ఫీజుల పట్టికలు...
 ప్రైవేట్ మెడికల్ కేర్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ రిజిస్ట్రేషన్ అండ్ రెగ్యులరైజేషన్ యాక్టు ప్రకారం ప్రతీ ప్రైవేటు ల్యాబ్ లోనూ వారు అందించే సేవలు, వాటికి వసూళ్లు చేస్తున్న ఫీజులను తెలిపే బోర్డులను తెలుగు, ఇంగ్లీష్‌లలో ఏర్పాటు చేయాలి. కానీ జిల్లాలో ఎక్కడ కూడా ల్యాబ్‌లలో ఈ విధమైన బోర్డులు కనిపించవు.
 
 కొరవడిన నిఘా
 జిల్లాలోని ప్రయివేటు ల్యాబ్‌లపై ఆయా ప్రాంతాలలోని సీనియర్ పబ్లిక్‌హెల్త్ ఆఫీసర్‌ల నిఘా కొరవడింది. ఎస్‌పీహెచ్‌ఓలు ప్రతి నెల వారి పరిధిలోని ల్యాబ్‌లను తనిఖీ చేయడంతో పాటు లింగనిర్ధారణ పరీక్షల వివరాలు, ఇతర పరీక్షల వివరాలు, డెంగ్యూ, స్వైన్‌ఫ్లూ వంటి పరీక్షల వివరాలను సేకరించి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారికి నివేదించాలి. నిబంధనలకు వ్యతిరేకంగా పరీక్షలను నిర్వహిస్తే ల్యాబ్ అనుమతిని రద్దు చేయాలి. కానీ కాసులకు కక్కుర్తి పడిన సంబంధిత శాఖ అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. దీనిని అసరాగా తీసుకున్న ల్యాబ్‌ల నిర్వాహకులు ఆడిందే ఆట.పాడిందే పాటగా వ్యవహరిస్తూ ప్రజలను నిలువుదోపిడి చేస్తున్నారు.

 నిబంధనలకు విరుద్దంగా వ్యహరిస్తే చర్యలు
 జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే ప్రయివేటు ల్యాబ్‌లపై చర్యలు తీసుకుంటాం. అనుమతులు లేని వాటిని సీజ్ చేస్తాం. ల్యాబ్‌లలో అనుమతి పత్రంతో పాటు ఫీజుల వివరాలను తెలిపే బోర్డులను ఏర్పాటుచేయాలి. జిల్లా వ్యాప్తంగా రెండు మూడు రోజులలో అన్ని ప్రైవేట్ ల్యాబ్‌లను పరిశీలించడానికి ప్రత్యేక బృందాలను పంపిస్తాం.
 - డాక్టర్ పి.ఆమోస్, డీఎంహెచ్‌ఓ
 

మరిన్ని వార్తలు