పరుగు ప్రాణాలు తీస్తోంది

22 Feb, 2019 00:34 IST|Sakshi

సరైన ఫిట్‌నెస్‌ లేకుండానే బరిలోకి కొందరు.. అకస్మాత్తుగా కుప్పకూలుతున్న అభ్యర్థులు

‘హైపర్‌ ట్రాపిక్‌ కార్డియోమయోపతి’కారణం.. అనారోగ్య సమస్యలు గుర్తించలేకపోవడమే సమస్య

పెరుగుతున్న ఎండ.. మరింత జాగ్రత్త అవసరమంటున్న వైద్యులు

►కరీంనగర్‌లో పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ పరీక్షల్లో పాల్గొన్న మమత (21) అనే యువతి 100 మీటర్ల పరుగు అనంతరం గుండె ఆగి మరణించింది.
►రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో రన్నింగ్‌ చేస్తున్న ఏకాంబరం (23) కూడా ఇదే తరహాలో గుండెపోటుతో ప్రాణాలు విడిచాడు.

పరుగుతో  శరీరంలో  ఏం జరుగుతుంది?
మనం పరుగు తీసినపుడు శరీరంలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. బీపీ, శ్వాస రేటు, గుండె కొట్టుకునే వేగం పెరుగుతాయి. శరీరంలోని అవసరమైన భాగాలకు రక్తసరఫరా ఒక్కసారిగా పెరుగుతుంది. కండరాలకు రక్తం సరఫరా అయ్యే వేగం రెట్టింపవుతుంది. అవసరమైన కండర కణాలకు ఆక్సిజన్‌ సరఫరా అధికమవుతుంది. శరీరంలో ఉద్రేకతను పెంచే అడ్రినలిన్‌ హార్మోన్‌ విడుదలవుతుంది. సాధారణంగా విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో గుండె నిమిషానికి 5 లీటర్ల రక్తం సరఫరా చేస్తుంది. వ్యాయామం లేదా పరుగు తీస్తున్నప్పుడు ఇది మూడింతలు పెరుగుతుంది. అంటే నిమిషానికి 15 లీటర్ల రక్తాన్ని శుద్ధి చేయాల్సి ఉంటుంది. అంటే తీవ్రమైన ఒత్తిడిలో ఉంటుంది. రోజూ వ్యాయామం చేసే వారిలో, క్రీడాకారుల్లో గుండెకు ఈ ఒత్తిడిని తట్టుకునే శక్తి ఉంటుంది. కానీ అంతర్గత అనారోగ్య సమస్యలు, సరైన ప్రాక్టీస్, ఫిట్‌నెస్‌ లేకుండా పరిగెత్తే వారి గుండెపై ఈ క్రమంలో తీవ్ర ఒత్తిడి పడుతుంది. ఫలితంగా 100 మీటర్ల దూరం పరిగెత్తినా గుండెలు ఆగిపోతున్నాయి.

హైపర్‌ ట్రాపిక్‌ కార్డియోమయోపతి అంటే?
గుండెపై ఒత్తిడి పెరిగి మరణానికి దారి తీయడాన్నే హైపర్‌ ట్రాపిక్‌ అబ్‌స్ట్రక్టివ్‌ కార్డియోమయోపతి అంటారు. విపరీతమైన వ్యాయామం, అకస్మాత్తుగా తీసే పరుగు వల్ల గుండె కండరాలు మందం అవుతాయి. గుండెకు రక్తం సరఫరా చేసే రక్తనాళాలు కూడా ఆకస్మికంగా దళసరిగా మారుతాయి. ఫలి తంగా గుండె నుంచి ప్రవహించే రక్త సరఫరాలో అంతరాయం కలుగుతుంది. దీంతో గుండెపోటు వచ్చి మరణానికి దారి తీస్తుంది. ఈ విషయం అమెరికాలోని టెక్సాస్‌లోని బయలార్‌ యూనివర్సిటీ వైద్యుల పరిశోధనలో వెల్లడైంది. అయితే రోజువారీ వ్యాయామం చేసేవారిలోనూ ఇవే రకమైన మార్పు లు చోటుచేసుకున్నా.. రోజూ అలవాటుగా చేసే వారి గుండెకు ఒత్తిడిని తట్టుకునే సామర్థ్యం పెరుగు తుంది. ఉన్నఫళంగా గుండెపై భారం పెరిగే పనులు చేయడం హైపర్‌ ట్రాపిక్‌ కార్డియోమయోపతికి దారి తీస్తుంది. 30 ఏళ్లలోపు ఇలాంటి మరణాలు చోటుచేసుకోవడం చాలా అరుదు. 50,000 మందిలో ఒకరికే ఇలా జరుగుతుంది. అందులోనూ పురుషు లకే వచ్చే అవకాశాలు అధికం.

ఎండతో తస్మాత్‌ జాగ్రత్త
రాష్ట్రంలో ఆకస్మికంగా పెరిగిన ఎండలు కూడా అభ్యర్థులకు ఆరోగ్య సమస్యలు తెచ్చిపెట్టొచ్చు. డీహైడ్రేషన్‌ సమస్యలు తలెత్తొచ్చని, దీని ద్వారా కూడా ప్రాణాపాయం లేకపోలేదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అందుకే అభ్యర్థులు ఆరోగ్యంపై నిత్యం అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

ఇవి పరీక్షించుకుంటే మేలు
► కుటుంబంలో ముందుతరాల వారు ఎవరైనా గుండెపోటుతో మరణిం చారా? లేదా ధ్రువీకరించుకోవాలి.
►ఇంతకుముందు ఛాతీలో నొప్పి, హైబీపీ వంటి లక్షణాలు కనిపిస్తే పరీక్షలు చేయించుకోవాలి.
► 12–ఎల్‌ఈఏడీ ఈసీజీ చేయించుకోవడం చాలా ఉత్తమం. దీనివల్ల గుండెలోని లోపాలు బయటపడతాయి.
►ఎక్సర్‌సైజ్‌ చేస్తూ ఈసీజీ తీయడం ఇంకా ఉత్తమం. దీనిలో పై అన్ని పరీక్షల్లోనూ బయటపడని లోపాలు గుర్తించవచ్చు.
►బాడీ బిల్డింగ్‌ కోసం స్టెరాయిడ్స్‌ వాడేవారికి గుండెనొప్పి వచ్చే అవకాశాలు ఎక్కువే.

ఇతర కారణాలూ ఉంటాయి..
చాలామంది అభ్యర్థులకు పోలీస్‌ పరుగుకు ముందు వారి బీపీ వంటి సాధారణ పరీక్షలు చేస్తారు. అందులో అంతా బాగానే ఉంటుంది. కానీ వారిలో కొందరి గుండెలోని లోపాలు, హైబీపీ, విపరీతమైన యాంగ్జయిటీ కారణంగా గుండెపై విపరీతమైన ఒత్తిడి పెరిగి గుండెపోటుకు దారితీస్తుందని వైద్యులు చెబుతున్నారు. అందుకే, పోలీసు అధికారులు ఎన్నిరకాల వైద్యసేవలు అందుబాటులో ఉంచినా.. వారి ప్రాణాలు కాపాడలేకపోతున్నారు. 
– డాక్టర్‌ శ్రీనివాస్, సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్, ప్రభుత్వాసుపత్రి, హుజూరాబాద్‌  
– సాక్షి, హైదరాబాద్‌

మరిన్ని వార్తలు