కారత్‌ X ఏచూరి!

20 Apr, 2018 01:10 IST|Sakshi

రాజకీయ తీర్మానం అంశంలో సీపీఎంలో భేదాభిప్రాయాలు

కాంగ్రెస్‌తో రాజకీయ సంబంధాలు వద్దంటూ కారత్‌ ప్రతిపాదన

దీనితో విభేదిస్తూ.. మైనార్టీ తీర్మానం పెట్టిన సీతారాం ఏచూరి

తీర్మానం ఆమోదం కోసం ఓటింగ్‌కు పట్టుపట్టాలన్న యోచన

మెజార్టీ ప్రతినిధుల మద్దతు కారత్‌కే!

ప్రతిపాదన వీగిపోతే ప్రధాన కార్యదర్శి పదవికి ఏచూరి గుడ్‌బై?

అదే జరిగితే ‘మాణిక్‌’కు పార్టీ పగ్గాలు.. లేదా ‘బృందా’కు చాన్స్‌!

సీపీఎం శ్రేణుల్లో విస్తృతంగా చర్చలు

సాక్షి, హైదరాబాద్‌ : రాజకీయ విధానాల విషయంగా సీపీఎంలో జరుగుతున్న పరిణామాలు, కీలక నేతల మధ్య విభేదాలు సంచలనానికి దారితీసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. హైదరాబాద్‌ వేదికగా జరుగుతున్న పార్టీ 22వ జాతీయ మహాసభల్లో ఆమోదించాల్సిన రాజకీయ తీర్మానం విషయంలో పార్టీ అగ్రనేతలు సీతారాం ఏచూరి, ప్రకాశ్‌ కారత్‌ల మధ్య భేదాభిప్రాయాలు తారస్థాయికి చేరాయని సమాచారం. కాంగ్రెస్‌తో సీపీఎం రాజకీయ సంబంధాల అంశంలో రాజకీయ తీర్మానంపై ఓటింగ్‌ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఓటింగ్‌లో తన ప్రతిపాదన వీగిపోతే ఏచూరి సీపీఎం ప్రధాన కార్యదర్శి పదవిని వదులుకుంటారన్న ప్రచారం నేపథ్యంలో ఉత్కంఠ నెలకొంది. 

ఏమిటీ విభేదాలు? 
రాజకీయంగా అనుసరించాల్సిన వ్యూహాలు, విధానాలను ఖరారు చేసుకునేందుకు సీపీఎం మూడేళ్లకోసారి జరిగే జాతీయ మహాసభల్లో రాజకీయ తీర్మానం చేసుకుంటుంది. ఆ తీర్మానంపై రెండు రోజుల పాటు చర్చలు జరిపి, అవసరమైన సవరణలు చేసుకుని ఆమోదించుకుంటుంది. అయితే తాజాగా 22వ జాతీయ మహాసభల్లో ప్రవేశపెట్టిన రాజకీయ ముసాయిదా తీర్మానం పార్టీ అగ్రనేతల మధ్య విభేదాలకు దారితీసింది. బీజేపీని గద్దె దించడమే లక్ష్యంగా ముందుకెళ్లాలని, అదే సందర్భంలో కాంగ్రెస్‌తోనూ ఎలాంటి రాజకీయ సంబంధాలు పెట్టుకోవద్దని సీపీఎం మాజీ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్‌ కారత్‌ బుధవారం ఓ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అంతకుముందు ఈ తీర్మానంపై కేంద్ర కమిటీలో కూడా చర్చించారు. కానీ కాంగ్రెస్‌తో రాజకీయ సంబంధాలు వద్దన్న అంశంపై పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి విభేదిస్తున్నారు. కాంగ్రెస్‌తో ఎన్నికల పొత్తు ఉండాలని తాను కోరుకోవడం లేదని.. కానీ బీజేపీని గద్దె దించే క్రమంలో వామపక్ష, ప్రజాస్వామిక శక్తుల కలయిక అవసరమని పేర్కొంటున్నారు. అలాంటప్పుడు కాంగ్రెస్‌తో రాజకీయ సంబంధాలు అవసరమైతే కొనసాగించాల్సి వస్తుందని అభిప్రాయపడుతున్నారు. ఈ మేరకు తీర్మానంలోని కాంగ్రెస్‌తో రాజకీయ సంబంధాలు వద్దనే వాక్యానికి సవరణలు చేయాలని పట్టుపడుతున్నారు. ఈ అంశంపై కేంద్ర కమిటీలో చర్చ జరిగినప్పుడు కూడా ఆయన ఈ విషయాన్ని ప్రస్తావించారు. దీంతో కారత్‌ ఆలోచన ప్రకారం కేంద్ర కమిటీ ఆమోదించిన ముసాయిదా తీర్మానాన్ని మహాసభలో పెట్టాలని.. దాంతోపాటు మైనార్టీ అభిప్రాయం కింద ఏచూరి ప్రతిపాదనను కూడా ప్రవేశపెట్టి ప్రతినిధుల అభిప్రాయాలు తీసుకుని, తుది తీర్మానాన్ని ఆమోదించాలని నిర్ణయించారు. ఇలా తొలిసారిగా మహాసభల్లో రాజకీయ తీర్మానాన్ని విభేదిస్తూ.. మైనార్టీ అభిప్రాయాన్ని కూడా చర్చించాలంటూ తీర్మానం పెట్టడంపై పార్టీ వర్గాల్లో చర్చకు దారితీసింది. 

మెజార్టీ మద్దతు కారత్‌కే.. 
మహాసభల్లో రాజకీయ ముసాయిదా తీర్మానంతో పాటు ఏచూరి ప్రవేశపెట్టిన మైనార్టీ అభిప్రాయంపైనా గురువారం వాడివేడి చర్చ జరిగింది. 12 రాష్ట్రాలకు చెందిన 13 మంది ప్రతినిధులు తమ అభిప్రాయాలు చెప్పారు. మెజార్టీ సభ్యులు కారత్‌ ప్రతిపాదన ప్రకారం కాంగ్రెస్‌తో ఎలాంటి సంబంధాలు పెట్టుకోవద్దని సూచించినట్టు సమాచారం. ఆంధ్రప్రదేశ్‌ నుంచి మాట్లాడిన ప్రతినిధి కూడా కారత్‌ ప్రతిపాదననే బలపర్చినట్టు తెలుస్తోంది. శుక్రవారం మధ్యాహ్నం వరకు మరికొందరు ప్రతినిధులు రాజకీయ తీర్మానంపై తమ రాష్ట్రాల అభిప్రాయాలను తెలియజేసి సవరణలు సూచించనున్నారు. మొత్తంగా కారత్‌ ప్రవేశపెట్టిన తీర్మానానికే మద్దతు లభించే అవకాశాలు కనిపిస్తున్నట్టు చెబుతున్నారు. 

వీగిపోతే.. తప్పుకొంటారా? 
రాజకీయ తీర్మానంపై ఓటింగ్‌లో తన ప్రతిపాదన వీగిపోతే.. ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తప్పుకోవాలనే ఆలోచనలో ఏచూరి ఉన్నట్టు సీపీఎం వర్గాల్లో చర్చ జరుగుతోంది. రెండు నెలల క్రితం రాజకీయ ముసాయిదా తీర్మానం రూపొందించినప్పుడు కూడా కేంద్ర కమిటీలో ఓటింగ్‌ జరగ్గా.. ఏచూరి ప్రతిపాదన వీగిపోయింది. అప్పుడే ఆయన ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తప్పుకొనేందుకు సిద్ధపడ్డారని.. కానీ మహాసభల వరకు కొనసాగాలని, మహాసభల్లో కొత్త కమిటీని ఎన్నుకునే సమయంలో ఆలోచిద్దామని చెప్పడంతో ఆ యోచన విరమించుకున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో తన ప్రతిపాదనకు ప్రతినిధుల మద్దతు కూడా లభించకపోతే.. ప్రధాన కార్యదర్శి పదవిలో తాను కొనసాగడం నైతికం కాదనే అభిప్రాయంతో ఏచూరి ఉన్నారని, ప్రతిపాదన వీగిపోతే తప్పుకొంటారనే చర్చ జరుగుతోంది. అయితే ఏచూరి ప్రతిపాదన వీగిపోయినా.. తిరిగి ఆయననే ప్రధాన కార్యదర్శిగా కొనసాగాలని ప్రతిపాదించే యోచనలోనే పార్టీ పొలిట్‌బ్యూరో ఉన్నట్టు సమాచారం. అయినా పదవిలో కొనసాగడానికి ఏచూరి విముఖత చూపితే మార్పు అనివార్యం కానుంది. అదే జరిగితే త్రిపుర మాజీ ముఖ్యమంత్రి మాణిక్‌ సర్కార్‌కు పార్టీ పగ్గాలు దక్కుతాయని అంటున్నారు. మరో సీనియర్‌ నేత బృందా కారత్‌ పేరు కూడా పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది.  

ఓటింగ్‌ జరుగుతుందా?
తాను ప్రతిపాదించిన సవరణను కచ్చితంగా పరిగణనలోకి తీసుకోవాలని, లేదంటే ఓటింగ్‌ నిర్వహించాలని కోరే అవకాశం మహాసభకు హాజరైన ప్రతి సభ్యుడికీ ఉంటుంది. ఈ నేపథ్యంలో తాను ప్రవేశపెట్టిన మైనార్టీ అభిప్రాయంపై సీతారాం ఏచూరి కూడా ఓటింగ్‌కు పట్టుపట్టే అవకాశాలున్నాయి. అయితే పార్టీ మహాసభల్లో ఇప్పటివరకూ రహస్య ఓటింగ్‌ జరగలేదు. ఈసారి కూడా చేతులు ఎత్తే విధానం ద్వారానే ఓటింగ్‌ జరగనుంది. ఇదే జరిగితే కారత్‌ ప్రతిపాదించిన తీర్మానానికే ఆమోదం లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు అంచనా వేస్తున్నారు.

మరిన్ని వార్తలు