నగరం మేనిపై పొగ - మంచు ముసుగు

6 Dec, 2017 02:54 IST|Sakshi

ఇటు వణికిస్తున్న చలి.. అటు కమ్మేసిన కాలుష్యం

భాగ్యనగరంలో విభిన్న వాతావరణం

సాధారణం కంటే రెండు డిగ్రీలు తక్కువగా గరిష్ట ఉష్ణోగ్రతలు

పెరుగుతున్న శీతల గాలులు.. ఆవరించిన మేఘాలు

వాతావరణంలో కలసిపోకుండా కమ్ముకున్న కాలుష్యం.. పీసీబీ, సర్కారు నిర్లక్ష్యం

‘క్లీన్‌ ఎయిర్‌ అథారిటీ’ ఏర్పాటుపై మౌనం

జాగ్రత్తలు తీసుకోవాలి: వైద్యులు

సాక్షి, హైదరాబాద్‌ : అటు సాధారణం కంటే తగ్గిన గరిష్ట ఉష్ణోగ్రతలు.. ఇటు శీతల గాలుల ఉధృతి.. మరోవైపు కమ్ముకుంటున్న మేఘాలు.. వీటన్నింటి కారణంగా ఎక్కడికక్కడే ఆవరిస్తున్న కాలుష్యం.. ఊపిరాడని పరిస్థితి.. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో నెలకొన్న విభిన్నమైన వాతావరణ పరిస్థితి ఇది. చలికాలం కావడం, మేఘాలు ఆవరిస్తుండటంతో.. వాహనాలు, ఫ్యాక్టరీల నుంచి వెలువడుతున్న పొగ వాతావరణంలో కలసిపోకుండా ఎక్కడిక్కడే కమ్ముకుంటోంది. దీనికి దుమ్ము, ధూళి కూడా తోడవుతోంది. శ్వాసకోశ సమస్యలున్నవారు తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారు. అసలు హైదరాబాద్‌ నగరంలో కాలుష్యాన్ని తగ్గించే అంశంపై కాలుష్య నియంత్రణ మండలిగానీ, ప్రభుత్వం గానీ దృష్టి సారించకపోవడంతో ఏటేటా పరిస్థితి మరింత అధ్వానంగా మారుతోంది. అటు పర్యావరణాన్ని తీవ్రంగా దెబ్బతీస్తున్న వారికి జైలుశిక్ష, జరిమానాలు విధించాలన్న నిర్ణయం కూడా కాగితాలకే పరిమితమవుతోంది.

తేమ పెరిగిపోవడంతో..
గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో ఈ సీజన్‌లో సాధారణంగా గరిష్ట ఉష్ణోగ్రతలు 30 డిగ్రీల మేర నమోదవుతాయి. కానీ మంగళవారం గరిష్టంగా 28.5 డిగ్రీలు, కనిష్టంగా 18.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు బంగాళాఖాతంలో తుపాను ప్రభావంతో మేఘాలు ఆవరించి ఉన్నాయి. తేమతో కూడిన శీతల గాలులు ఉధృతంగా వీస్తున్నాయి. గాలిలో తేమ 48 శాతంగా నమోదైంది. దీంతో వాహనాలు, పరిశ్రమల నుంచి వెలువడుతున్న కాలుష్యం, సూక్ష్మ, స్థూల ధూళి కణాలు.. వాతావరణంలో కలసిపోకుండా గాలిలోనే ఆవరించి ఉంటున్నాయి. దీంతో సరిగా శ్వాస తీసుకోలేని ఇబ్బందికర పరిస్థితి నెలకొంటోంది. ముఖ్యంగా పారిశ్రామిక ప్రాంతాలు, వాహనాల రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది.  

ఏటా పెరిగిపోతున్న వాహనాలు
గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో వాహనాల సంఖ్య ఏటేటా పెరిగిపోతూనే ఉంది. ప్రస్తుతం నగరంలో అన్ని రకాల వాహనాలు కలిపి 50 లక్షల వరకు ఉంటాయని అంచనా. ఇందులో సుమారు 15 లక్షల వరకు చెల్లిన వాహనాలు ఉన్నాయి. వీటి నుంచి వెలువడుతున్న పొగలో ప్రమాదకర వాయువులు ఎక్కువగా ఉంటున్నాయి. అటు పరిశ్రమలు కూడా పరిమితికి మించి కాలుష్యాన్ని వెదజల్లుతున్నాయి. దీనివల్ల నగరంలో ఆస్తమా, బ్రాంకైటిస్, న్యూమోనియా తదితర శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది.  

‘క్లీన్‌ ఎయిర్‌ అథారిటీ’ఎక్కడ?
జపాన్‌ రాజధాని టోక్యోలో కాలుష్యాన్ని కట్టడి చేసేందుకు ‘క్లీన్‌ ఎయిర్‌ అథారిటీ’ని ఏర్పాటు చేశారు. దాని కఠిన నిబంధనలు, మార్గదర్శకాల కారణంగా ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న టోక్యో నగరంలో కాలుష్యం స్థాయిలు నియంత్రణలో ఉండడం గమనార్హం. ఆ తరహాలోనే గ్రేటర్‌ హైదరాబాద్‌లోనూ ‘క్లీన్‌ ఎయిర్‌ అథారిటీ’ఏర్పాటుచేసి, విస్తృత అధికారాలు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం టోక్యోలో అథారిటీ విధివిధానాలపై అధ్యయనం చేసేందుకు రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి, రవాణా, పరిశ్రమలు, జీహెచ్‌ఎంసీ, పోలీసు విభాగాలకు చెందిన అధికారుల బృందం ఆ నగరంలో పర్యటించి వచ్చింది. ఇది గడిచి ఆరునెలలైనా.. ఇక్కడ కనీస కార్యాచరణ కూడా మొదలుకాకపోవడం గమనార్హం.

టోక్యోలో ఇలా..
విశ్వనగరంగా భాసిల్లుతున్న టోక్యో నగరంతో పాటు దాని సమీపంలోని 22 పట్టణాల్లో వాయు, జల, నేల కాలుష్యాన్ని జపాన్‌ ప్రభుత్వం గణనీయంగా కట్టడి చేసింది. రవాణా, స్థానిక సంస్థలు, పరిశ్రమలు, కాలుష్య నియంత్రణ మండలిల భాగస్వామ్యంతో ‘క్లీన్‌ ఎయిర్‌ అథారిటీ’ని ఏర్పాటు చేసింది. ఘన వ్యర్థాలు, ప్లాస్టిక్, ఈ–వేస్ట్, జీవ వ్యర్థాలను ఆధునిక సాంకేతిక విధానాల ద్వారా శుద్ధిచేసి పర్యావరణానికి హాని కలగకుండా చర్యలు తీసుకుంటోంది. బహిరంగ ప్రదేశాల్లో వ్యర్థాల డంపింగ్, తగలబెట్టడం వంటి చర్యలకు స్వస్తి పలికింది. ఉద్గారాలను అధిక మొత్తంలో వెదజల్లుతున్న పరిశ్రమలను కట్టడి చేసింది. కాలం చెల్లిన వాహనాలను రోడ్డెక్కకుండా నియంత్రించింది. కాలుష్యానికి పాల్పడినవారికి జైలుశిక్ష, భారీగా జరిమానాలు విధిస్తోంది.

మరో వారం ఇదే పరిస్థితి
హైదరాబాద్‌ నగరంలో వాతావరణ పరిస్థితులు, కాలుష్యం తీవ్రత మరో వారం పాటు ఇదే స్థాయిలో ఉండే అవకాశాలున్నట్లు పీసీబీ అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో ఇళ్ల నుంచి బయటికి వెళ్లేవారు మాస్కులు ధరించడం మేలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నవారు, హృద్రోగులు, వృద్ధులు, చిన్నారులు కాలుష్యం నుంచి, చలి తీవ్రత నుంచి రక్షణ పొందేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు