అత్తర్‌ పరిమళాల గుబాళింపు

17 May, 2019 07:48 IST|Sakshi
పత్తర్‌గట్టీలోని సయ్యిదీ అండ్‌ సన్స్‌ షాపులో అత్తర్‌ కొనుగోలు చేస్తున్న ముస్లింలు

 వెదజల్లే పరిమళాలకు మరోపేరు   

రంజాన్‌ మాసంలో వినియోగం ఎక్కువ

ముస్లింలు తప్పనిసరిగా వాడటం ఆనవాయితీ   

సిటీలో 250 రకాల అత్తర్‌లు అందుబాటులో       

ధరలు రూ.50 నుంచి రూ.5 వేల వరకు  

అత్తర్‌.. ఈ పేరు వినగానే పరిమళాలగుబాళింపు నాసికా పుటాలను తాకుతుంది. మనసు ఆనంద తీరాలకు చేరుతుంది. అపూర్వ పారవశ్యానికి గురిచేస్తుంది. పవిత్ర రంజాన్‌ మాసంలో ఉపవాస దీక్షలను పురస్కరించుకుని ముస్లింలు అత్తర్‌ను విరివిగా వినియోగిస్తారు. నెల రోజులపాటు నిత్యం ఒక్కో రకం అత్తర్‌ను వాడుతూ తమ ప్రత్యేకతను చాటుతారు. ఖరీదు ఎంతయినా అత్తర్‌ వినియోగాన్ని మాత్రం వీడరు. మహ్మద్‌ ప్రవక్త కూడా అత్తర్‌ను ఎక్కువగా వాడేవారని, తన సహచరులను దీనిని వాడాలని సూచించేవారని ఇస్లాం మత గురువులు చెబుతుంటారు. ప్రవక్త సంప్రదాయాన్ని అనుసరించే ముస్లింలు ఎన్ని డబ్బులు వెచ్చించి అయినా దీనిని కొనుగోలు చేస్తుంటారు. ముస్లింలు రంజాన్‌ నెలలో అత్తర్‌ వేసుకోకుండా బయటికి రారంటే అతిశయోక్తి కాదు. చిన్నా పెద్దా అనే తారతమ్యం లేకుండా  ప్రతి ఒక్కరూ అత్తర్‌ వాడటం ఆనవాయితీగా మారింది.

ఇదీ ప్రత్యేకత..
అత్తర్‌ను ఎక్కువ కాలం నిల్వ ఉంచితే దాని సువాసన బాగా పెరుగుతుంది. ఎంత పాత అత్తర్‌ అయితే దాని ధర కూడా అంత ఎక్కువ పలుకుతుంది. నకిలీ అత్తర్‌ అయితే దాని వాసన తగ్గుతుంది. అత్తర్‌ను చర్మంతో తయారైన బుడ్డీలు, గాజు బుడ్డీల్లో భద్రపరుస్తారు.  

అవగాహన అవసరం..  
అన్ని రకాల అత్తర్‌ను అన్ని సమయాల్లో వాడితే ఆరోగ్యానికి హానికరం. అవగాహన లేకుండా, సమయం కాని సమయంలో వాడితే దీని వాసనతో అనర్థాలు కలిగే ప్రమాదముంది. వేసవి కాలంలో అత్తర్‌లో ఖసస్, ఇత్రేగుల్, గులాబ్, జామిన్‌ వల్ల చల్లదనం కలుగుతుంది. చలికాలం, వర్షాకాలంలో శరీరానికి వేడి కలిగించే షమామా, అంబర్, హీరా, జాఫ్రాన్, ఊదుల్‌ దహర్‌ వాడాలని పత్తర్‌గట్టీలోని సయ్యిదీ అండ్‌ సన్స్‌ అత్తర్‌ దుకాణా యజమాని సయ్యద్‌ జహీరుద్దీన్‌ ఖాద్రీ జఫర్‌ సూచించారు.    

విదేశీ రకాలకు డిమాండ్‌   
సౌదీ అరేబియాలో తయారయ్యే అత్తర్‌కు నగర ప్రజలు ఎక్కువగా పసంద్‌ చేస్తారు. ఇందులో ప్రత్యేకంగా ఉద్‌ షమ్సు, ఉద్‌ మక్కితో పాటు ఇటీవల ఫ్రాన్స్‌లో తయారవుతున్న అత్తర్‌కు నగరానికి దిగుమతులు పెరిగాయి. 8 ఎంఎల్‌ అత్తర్‌ బాటిళ్లను నగరవాసులు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు.  

తయారీ విధానం..
గులాబీ రేకులు, మల్లె, మొగలి పూలతో పాటు గంధం రకరకాల సువాస ఇచ్చే చెట్ల చెక్కలు ఎండిన తర్వాత డేకిసాలలో వేస్తారు. దాన్ని భూమిలో పాతి మరగబెడతారు. డేకిసాపై చిన్న మార్గం ద్వారా ఆవిరి బయటకు వచ్చేలా రంధ్రం చేస్తారు. ఆ ఆవిరే అత్తర్‌గా తయారు అవుతుంది.

ఇవీ రకాలు  
మజ్ముమా, జన్నతుల్‌ ఫిర్దోష్, షమామా, నాయాబ్, ఫిజా, జమ్‌జమ్, బఫుర్, ఉదర్, షాజహన్, తమన్నా, బకూర్‌తో పాటు దాదాపు 250 రకాల అత్తర్లు అందుబాటులో ఉన్నాయి. అసలైన అత్తర్‌ ఒక్కసారి వాడితే దుస్తులు ఉతికినా దాని వాసన పోదు. అదే సాధారణ అత్తర్‌ అయితే సువాసన ఒక్కసారే ఉంటుంది. 

ధరలు ఇలా..  
చౌకగా లభ్యమయ్యే అత్తర్‌ ఒక మిల్లీ లీటర్‌ రూ.50 పలుకుతోంది. అరబ్బు దేశాల్లో ఎక్కువగా ఇష్టపడే దహనల్‌æ ఊద్‌ అత్తర్‌ 10 మి.లీ రూ.3వేల నుంచి రూ.10 వేల ధర ఉంది. ఇతర అత్తర్‌ల ధరలు 10 మి.లీ ధర రూ.1000 నుంచి రూ.5 వేల వరకు పలుకుతున్నాయి.  

మరిన్ని వార్తలు