ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన లారీ..

24 Jun, 2019 11:19 IST|Sakshi

సాక్షి, భద్రాచలం(ఖమ్మం) : ఆర్టీసీ ఇన్‌గేట్‌ సమీపంలో బస్‌ను లారీ ఢీకొట్టిన సంఘటన ఆదివారం ఉదయం చోటు చేసుకొంది. భద్రాచలం డిపోకు చెందిన టీఎస్‌ 28జెడ్‌ 0058 నంబరు గల ఆర్టీసీ డీలక్స్‌ బస్‌ విజయవాడ నుంచి భద్రాచలం బస్టాండ్‌లోకి వస్తున్నది. బస్‌  ఇన్‌ గేట్‌లోకి ప్రవేశించే సమయంలో బస్‌ వెనకభాగాన్ని వెనుక నుంచి లారీ బలంగా ఢీకొన్నది. ఇదే సమయంలో అంబేడ్కర్‌ సెంటర్‌ నుంచి బ్రిడ్జిరోడ్డు వైపు రెండు లారీలు ఒకదాని వెనక మరొకటి వేగంగా వస్తున్నాయి. ఇదేక్రమంలో బస్టాండ్‌లోకి  బస్‌ ప్రవేశిస్తుండటంతో లారీ డ్రైవర్‌ ఒక్కసారిగా సడన్‌ బ్రేక్‌ వేశాడు.

దీంతో ఆ లారీ వెనుకనే వస్తున్న లారీ డ్రైవర్‌ కూడా సడన్‌ బ్రేక్‌ వేశాడు. ఆ సమయంలో వర్షం కురుస్తున్నందున సడన్‌ బ్రేక్‌ వేయడంతో లారీలు ఒకదానినొకటి ఢీకొన్నాయి. దీంతో ముందు లారీ ఆర్టీసీ బస్‌ను ఢీ కొట్టింది. ఆ సమయంలో ఆర్టీసీ బస్‌లో ప్రయాణికులెవరూ లేక పోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. 0042 లారీ డ్రైవర్‌కు మాత్రమే స్వల్ప గాయాలు అయ్యాయి. ఆర్టీసీ అధికారులు అక్కడకు చేరుకొని బస్‌కు రూ.10 వేల ఆస్తినష్టం జరిగినట్లు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

ఆటో బోల్తా..10 మందికి గాయాలు
అశ్వారావుపేటరూరల్‌: అదుపుతప్పి ఆటో బోల్తా పడి పది మందికి గాయాలైన సంఘటన ఆదివారం  మండలంలో జరిగింది. ఖమ్మం జిల్లా వీఎం బంజరకు చెందిన భక్తులు అశ్వారావుపేట మండలంలోని గోగులపుడి అటవీ ప్రాంతంలోగల శ్రీ గుబ్బల మంగమ్మ తల్లి ఆలయానికి వెళ్లి మొక్కులు చెల్లించుకొని తిరిగి ఆటోలో వస్తున్నారు. ఈ క్రమంలో మండలంలోని పాత కన్నాయిగూడెం–కొత్త కన్నాయిగూడెం గ్రామాల మధ్యలో గల మూల మలుపు వద్ద ఆటో అదుపుతప్పి బోల్తా పడిపోయింది. దాంతో ఆటోలో ప్రయాణిస్తున్న వీఎం బంజర మండలం ఉప్పలచలక గ్రామానికి చెందిన లింగపోగు వెంకటేశ్వరరావుతో పాటు, అదే ప్రాంతానికి చెందిన చిల్లముంత రామకృష్ణ, చిల్లముంత వెంకటేశ్వరరావు, చిల్లముంత జమలయ్య, జొన్నలగడ్డ రవితోపాటు, ఆటో డ్రైవర్‌ కొత్తపల్లి శ్రీనుకు తీవ్ర గాయాలయ్యాయి.

వీరితోపాటు మరో నలుగురికి స్వల్ప గాయాలు కాగా 108 వాహనంలో స్థానిక ప్రభుత్వ సామాజిక ఆస్పత్రికి తరలించగా వైద్యులు చికిత్స నిర్వహించారు. వీరిలో లింగపోగు వెంకటేశ్వరరావుకు ఎడమ చేతికి తీవ్ర గాయాలు కాగా, చిల్లముంత రామకృష్ణ తలకు బలమైన గాయం అయింది. మెరుగైన చికిత్స కోసం ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. సమా చారం అందుకున్న స్థానిక పోలీసులు వివరాలు సేకరించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

కూసుమంచిలో ట్రాలీ ఆటో బోల్తా..
కూసుమంచి: లోక్యాతండా సమీపంలో కూలీలతో వెళుతున్న ట్రాలీ ఆటో బోల్తా పడిన ఘటన ఆదివారం జరిగింది. వివరాల్లోకి వెళితే..  ముదిగొండ మండల మాధాపురం గ్రామానికి చెందిన కూలీలు పనుల నిమిత్తం కూసుమంచి వస్తున్న క్రమంలో ట్రాలీ ఆటో బోల్తా పడింది. ప్రమాదంలో ముగ్గురు కూలీలకు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగ్రాతులను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై తమకు ఎటువంటి సమాచారం అందలేదని పోలీసులు తెలిపారు.

మరిన్ని వార్తలు