విభిన్నం..సంస్కృతికి దర్పణం

7 Oct, 2019 11:51 IST|Sakshi

నగరంలో వివిధ పద్ధతుల్లో దసరా వేడుకలు  

నవ ధాన్యాలతో కన్నడిగుల నవరాత్రి పూజలు

బెంగాలీలకు ఐదు రోజుల పండగ   

ఉపవాసంతో అగర్వాల్‌ కుటుంబీకుల పూజలు

చార్మినార్‌: భిన్న సంస్కృతులు, విభిన్న ఆచార వ్యవహారాలకు నగరం అద్దం పడుతుంది. రాష్ట్రాలు, ప్రాంతాలు వేరైనా..ఉత్సవాలను మాత్రం కలసికట్టుగా నిర్వహించుకోవడం నిజాం కాలం నుంచి వస్తోంది. నగరంలో దసరా వేడుకలు విభిన్నంగా జరుగుతున్నాయి. నగరంలో స్థిరపడిన ఇతర రాష్ట్రాలకు చెందిన ప్రజలు దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలను తమ ఆచార వ్యవహారాలకు అనుగుణంగా నిర్వహిస్తున్నారు. నగరంలో స్థిరపడిన రాజస్థాన్, గుజరాత్, హర్యానా, హిమాచల్‌ప్రదేశ్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాలకు చెందిన ఉత్తర భారతీయులైన అగర్వాల్‌ కుటుంబీకులు, మరాఠీలు, కర్ణాటక రాష్ట్రానికి చెందిన కన్నడిగులు, పశ్చిమబెంగాల్‌కు చెందిన బెంగాలీలు తమ సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహరాలకు అనుగుణంగా దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు.  

రోజంతా ఉపవాసం
ఉత్తర భారతీయులైన అగర్వాల్‌ కుటుంబీకులు దసరా ఉత్సవాలను రోజంతా ఉపవాసంతో తొమ్మిది రోజుల పాటు కన్నుల పండువగా నిర్వహిస్తారు. తమ వంటిల్లు, పూజ గదుల్లోని గోడకు పటాలను వేసి దుర్గామాత పూజను నిర్వహిస్తారు. తాము గోడకు వేసిన పటం వద్ద గోధుమలు, జొన్న విత్తనాలను మట్టితో ఉన్న ఒక కుండలో వేస్తారు. మొలకెత్తిన విత్తనాల ఆకులను విజయదశమి రోజు తలపాగాలో, చెవులపై ధరిస్తారు. విజయదశమి నాడు 2–8 ఏళ్ల వయసున్న తొమ్మిది మంది బాలికలను ఇంటికి ఆహ్వానించి వారికి భోజన తాంబూలాలతో పాటు ప్రత్యేకంగా దక్షిణ (బహుమతి)ను సమర్పిస్తారు. విజయదశమి రోజు బియ్యం, పెసరపప్పు, పెరుగుతో ‘మూంగ్‌ చావల్‌ కడీ’ అనే ప్రత్యేక వంటకాన్ని సిద్ధం చేసి కుటుంబ సభ్యులతో సహాపంక్తి భోజనం చేస్తారు. దాండియా నృత్యాలు మరో ప్రత్యేకత.

కన్నడిగుల ప్రత్యేకత.....  
దసరా ఉత్సవాలను కన్నడిగులు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. నగరంలోని జియాగూడ, అత్తాపూర్, సికింద్రాబాద్, గుల్జార్‌హౌజ్, మామాజుమ్లా పాటక్, చార్‌కమాన్, కోకర్‌వాడీ, చెలాపురా, ఘాన్సీబజార్, జూలా, కూకట్‌పల్లి, ఎల్బీనగర్‌ తదితర ప్రాంతాల కన్నడిగులు దసరా వేడుకల్లో నిమగ్నమయ్యారు. దుర్గామాత చిత్రపటం వద్ద కొద్దిగా నల్లరేగడి మట్టిని ఏర్పాటు చేసి అందులో నవధాన్యాల విత్తనాలను వేస్తారు. ఇవి మొలకెత్తాక తొమ్మిది రోజుల పాటు వాటికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. నవధాన్యాలు ఎంత ఎత్తుకు పెరిగితే అమ్మవారి కరుణా కటాక్షాలు కూడా అంతే ఎక్కువగా ఉంటాయని కన్నడిగులు భావిస్తారు. అలాగే వీరు దుర్గాష్టమి సందర్భంగా గోధుమ పిండితో అమ్మవారి ఆభరణాలను తయారు చేస్తారు. పాలపిట్టను చూడడంతో కన్నడిగుల ఉత్సవాలు ముగుస్తాయి.

బెంగాలీలు..ఐదు రోజులు  
నగరంలో స్థిరపడ్డ పశ్చిమబెంగాల్‌కు చెందిన బెంగాలీలు దసరా ఉత్సవాలను ఐదు రోజుల పాటు నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ఈ నెల 4వ తేదీన బెంగాలీలు ఉత్సవాలను ప్రారంభించి ప్రతి రోజు పూజలు నిర్వహిస్తున్నారు. బెంగాలీలకు దసరా పెద్ద పండుగ. దుర్గామాతను ప్రతిష్టించిన నాటి నుంచి నాలుగు రోజుల వరకు ప్రత్యేక పూజలు నిర్వహించి ఐదో రోజైన విజయ దశమి నాడు అమ్మవారిని నిమజ్జనం చేస్తారు. 

మరిన్ని వార్తలు