వినూత్న బోధన

2 Mar, 2018 11:16 IST|Sakshi
సెల్‌ఫోన్‌ ద్వారా పాఠాలు నేర్చుకుంటున్న విద్యార్థులు

ఆన్‌లైన్‌ ద్వారా విద్యార్థులకు పాఠాలు

ఓ ఉపాధ్యాయుడి వినూత్న ప్రయోగం

ఒక్కరే టీచర్‌ ఐదు తరగతులకు బోధన

యూట్యూబ్‌లో తెలుగు, ఆంగ్ల వర్ణమాల, గుణితాలు, పద్యాలు డౌన్‌లోడ్‌

ఆనందంగా పాఠాలు వింటున్న చిన్నారులు

ఆదర్శంగా నిలుస్తున్న ఉపాధ్యాయుడు

అల్లాదుర్గం(మెదక్‌):  గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలలో ప్రాథమిక విద్య గాడి తప్పుతుంటే,  ఈ ఉపాధ్యాయుడు ప్రాణం పోస్తున్నాడు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతతో ప్రాథమిక విద్య అస్తవ్యస్తంగా మారుతోంది.  ఆ పాఠశాలలో ఉన్న ఒకే ఉపాధ్యాయుడు ఐదు తరగతులకు బోధించడం ఇబ్బందిగా మారుతుంది. ఐతే ఆయనకు వినూత్నమైన ఆలోచన తట్టింది. సేల్‌ఫోన్‌ సహాయంతో ఐదు తరగతులకు పాఠాలు బోధిస్తున్నాడు.

ఆయన ఒక తరగతిలో బోధిస్తూ , మిగితా వాటిలో ఫోన్‌ ద్వారా యూట్యూబ్‌లోని వీడియోలను డౌన్‌లోడ్‌ చేసి దానికి సౌండ్‌ బాక్స్‌లను అనుసంధానం చేసి పలు తరగతుల్లో ఉంచడం ద్వారా విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నాడు.  యూట్యూబ్‌ నుంచి తెలుగు వర్ణమాల, గుణితాలు, పద్యాలు, ఆంగ్ల వర్ణమాల నంబర్లను డౌన్‌లోడ్‌ చేసుకుని వాటి ద్వారా చార్ట్‌లను తయారు చేసి విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో పాఠాలు బోధిస్తున్నాడు.
 
బ్లూటూత్‌ ద్వారా కనెక్షన్‌..
అల్లాదుర్గం మండలం గడిపెద్దాపూర్‌ తండా (మాణిక్యరాజ్‌తండా) ప్రాథమిక పాఠశాలలో ప్రైవేట్‌ పాఠశాలకు దీటుగా విద్యబోధన జరుగుతోంది.ఆన్‌లైన్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకుని సెల్‌ఫోన్‌కు చిన్న సౌండ్‌ బాక్స్‌ ఏర్పాటు చేసి విద్యార్థులకు తరగతులు బోధిస్తున్నాడు. ఒక్క ఉపాధ్యాయుడు ఐదు తరగతులు బోధించడం గగనంగా మారింది.దీంతో పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడు చిట్టిబాబుకు ఈ  ఐడియా వచ్చింది. ఫోన్‌కు బ్లూటూత్‌ ద్వారా చిన్న చిన్న సౌండ్‌ బాక్స్‌ ఏర్పాటు చేశారు. అఆలు రాస్తు చెబుతుంటే అందులో విద్యార్థులు వింటూ నేర్చుకుంటున్నారు. విద్యార్థులు చక్కగా వింటూ పలకడం, రాయడం చేస్తుండటంతో ఉపాధ్యాయుడి వినూత్న ప్రయోగం విజయవంతమైంది. 


ఉపాధ్యాయుడి రూపొందించిన వివిధ రకాల చార్ట్‌లు


పాఠశాల గోడలపై అతికించిన చార్ట్‌లు

సులువుగా నేర్చుకుంటున్నారు..
రాష్ట్రంలోనే ఈ విధంగా విద్యబోధన చేయడం ఏ ప్రభుత్వ పాఠశాలలో కనిపించదు. కూడికలు, తీసివేతలు, గుణితాలు,  సంయుక్త అక్షరాలు, వివిధ రకాల చాట్‌లు 500 వరకు ఆయన తయారు చేశాడు. విద్యార్థులకు చార్ట్‌లు ఇచ్చి కూడికలు, తీసివేతలు, గుణితాలు చేయాలని చేప్తూ విద్యార్థులకు బోధిస్తున్నాడు. అలాగే రైమ్స్‌  పద్యాలు విద్యార్థులు సులువుగా నేర్చుకుంటున్నారు. బొమ్మల కథలు విద్యార్థులను ఆకట్టుకుంటున్నాయి. ఇంగ్లిష్‌ పదాలు, కాకుర్తాలు ఫోన్‌లో వింటూ నేర్చుకుంటున్నారు. 

ఇబ్బందిగా ఉండేది..


ఐదు తరగతులకు ఒక్కడినే బోధించాంలంటే చాలా ఇబ్బందిగా ఉండేది. ఈ ఐడియా ద్వారా విద్యబోధన సులువు అయ్యింది. ఫోన్‌లో అక్షరాలు రాయడం, పలకడంతో విద్యార్థులు శ్రద్ధగా వింటూ నేర్చుకుంటున్నారు. 3 , 4 తరగతుల విద్యార్థుల కోసం చార్ట్‌లు తయారు చేసి , విద్యార్థుల ముందు పెట్టడంతో వారే వాటిని చూసుకుని గణితం, తెలుగు, సైన్స్‌ పాఠాలు నేర్చుకుంటున్నారు. ఇలా ప్రతి పాఠశాలకు ప్రభుత్వం ల్యాప్‌ట్యాప్, ట్యాబ్‌ పంపిణీ చేస్తే ఇలాంటి బోధనతో విద్యార్థులు సులువుగా నేర్చుకుంటారు.
   – చిట్టిబాబు, ఉపాధ్యాయుడు, గడిపెద్దాపూర్‌తండా

మరిన్ని వార్తలు