జిల్లా కార్యాలయాల చిరునామా ఏది?

8 Jun, 2018 01:44 IST|Sakshi

ఓటర్ల జాబితా, ఇతర వివరాలు ఇవ్వలేని పరిస్థితి

పంచాయతీ ఎన్నికల అధికారుల అవస్థలు

సాక్షి, హైదరాబాద్‌: గ్రామపంచాయతీ ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో ప్రభుత్వ యంత్రాంగంతోపాటు, ప్రజలు, రాజకీయ పార్టీల భాగస్వామ్యం ఉంటుంది. ఓటర్ల జాబితా, వార్డుల విభజన, పోలిం గ్‌ కేంద్రాల ఏర్పాటు, రిజర్వేషన్ల ఖరారు, పోలింగ్‌ నిర్వహణలో రాజకీయ పార్టీల పాత్ర తప్పనిసరి. ఎన్నికల నిర్వహణ అధికారులు ప్రతిదశలోనూ రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహిస్తారు.

ముసాయిదా జాబితాలను అందజేసి అభ్యంతరాలను, సూచనలను స్వీకరిస్తారు. తుది జాబితాలను అధికారులు మళ్లీ రాజకీయ పార్టీలకు అందజేస్తారు. ఎన్నికల ప్రక్రియలో ఇదంతా కచ్చితంగా జరగాల్సిన ప్రక్రియ. ఇక్కడే అధికారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రాజకీయ పార్టీలకు వివరాలు ఇచ్చే విషయంలో అధికారులు ఆందోళన చెందుతున్నారు. గ్రామపంచాయతీ ఎన్నికల వివరాలన్నీ గ్రామ, మండల, జిల్లాల వారీగా రూపొందిస్తారు. రాజకీయ పార్టీల జిల్లాల కార్యాలయాలలో వీటిని అందజేస్తారు.

అయితే అధికార టీఆర్‌ఎస్‌కు జిల్లాల్లో కార్యాలయాలు లేకపోవడంతో వివరాలు ఎక్కడ ఇవ్వాలో అధికారులకు తెలి యడంలేదు. టీఆర్‌ఎస్‌కు మిగిలిన పార్టీల తరహాలో జిల్లా కమిటీలు లేవు. రెండేళ్ల క్రితమే వీటిని రద్దు చేశారు. రెండేళ్ల క్రితం కేవలం అధ్యక్షుడు మాత్రమే ఉండేవారు. జిల్లా పార్టీ కార్యాలయాలు ఉండేవి. జిల్లాల పునర్విభజన నేపథ్యంలో ఉమ్మడి జిల్లాల కార్యాలయాలను ఎక్కువ జిల్లాల్లో తీసివేశారు.

దీంతో ఓటర్ల జాబితా, ఇతర వివరాలను ఎక్కడ, ఎవరికి అందజేయాలో అధికారులకు తెలియడంలేదు. అడ్రస్‌ కోసం అధికార పార్టీ ముఖ్యనేతలను, ఉమ్మడి జిల్లాల మాజీ అధ్యక్షులను సంప్రదిస్తున్నారు. వివరాలు ఎక్కడ ఇవ్వాలనే విషయంలో వారి నుంచి కూడా స్పష్టత లేక, అధికార పార్టీ నేతలకు సైతం పూర్తి వివరాలు అందడం లేదు.  ఈ వ్యవహారం పంచాయతీరాజ్‌ శాఖ అధికారులకు చాలా ఇబ్బందికరంగా మారింది.

మరిన్ని వార్తలు