ట్రాన్స్‌ఫార్మర్ల కష్టాలు

10 Jul, 2015 23:55 IST|Sakshi
ట్రాన్స్‌ఫార్మర్ల కష్టాలు

♦ లో ఓల్టేజీతో మొరాయిస్తున్న ట్రాన్స్‌ఫార్మర్లు
♦ సకాలంలో అందక సాగునీటి మళ్లింపునకు కష్టం
♦ కొత్త ట్రాన్స్‌ఫార్మర్ల కోసం 4,500దరఖాస్తులు
♦ మంజూరు వెయ్యి మాత్రమే
 
 పాలమూరు : వాతావరణ ప్రతికూల పరిస్థితులు.. ఖరీఫ్ పంటల సాగుకోసం సిద్ధపడిన రైతన్నలను ఓవైపు అయోమయానికి గురి చేస్తుండగా.. మరోవైపు ట్రాన్స్‌ఫార్మర్ల రిపేరు బేజార్ చేస్తోంది. ఈ పరిస్థితుల్లో విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం ఫలితంగా రైతన్నల మెడకు ఉచ్చు బిగుస్తోంది. కొత్త ట్రాన్స్‌ఫార్మర్ల కేటాయింపు, కాలిపోయిన వాటికి మరమ్మతులు చేపట్టడంలో తీవ్రజాప్యం జరుగుతుండటంతో అన్నదాతలకు కొత్త కష్టాలు వచ్చి పడుతున్నాయి. ట్రాన్స్‌ఫార్మర్ల రిపేరు కోసం అన్నదాతలు నానా తంటాలు పడాల్సి వస్తోంది. వ్యవసాయ సీజన్ ప్రారంభమైనా ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటులో నిర్లక్ష్యం వహిస్తుండటంతో రైతాంగం దిక్కుతోచని స్థితిలో ఉంది.

జిల్లాలో మొత్తం 6.5లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లున్నాయి. వీటిద్వారా దాదాపు 15లక్షల ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉంది. విద్యుత్ సరఫరాలో అత్యంత కీలకపాత్ర ట్రాన్స్‌ఫార్మర్‌దే. వీటి ఏర్పాటులో విద్యుత్‌శాఖ తీరు తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. కొత్త ట్రాన్స్‌ఫార్మర్ కావాలని రైతు డీడీ తీసిన దగ్గరి నుంచి పొలంలో ఏర్పాటు చేసేందుకు సంవత్సరాలు పడుతోంది. గత ప్రభుత్వాల హయాంలో ఎలా ఉన్నా.. తెలంగాణ ప్రభుత్వంలో కూడా రైతుల ట్రాన్స్‌ఫార్మర్ కష్టాలు కడతేర డం లేదు. ఒక్కో ట్రాన్స్‌ఫార్మర్‌పై ఓవర్‌లోడ్ పడి ట్రిప్ అవుతున్నాయని రైతులు చెబుతున్నారు.

మరోవైపు ట్రాన్స్‌ఫార్మర్లతో పాటు లోఓల్టేజీ కారణంగా వ్యవసాయ మోటార్లు కాలిపోతుండటంతో అన్నదాతల అగచాట్లు వర్ణనాతీతం. కాలిపోయిన వాటికి మరమ్మతు చేసే విషయంలో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. వాస్తవానికి మరమ్మతుకు వచ్చిన ట్రాన్స్‌ఫార్మర్  సమస్యను 48గంటల్లో పరిష్కరించాల్సి ఉన్నా.. అది జరగడం లేదు. జిల్లావ్యాప్తంగా ప్రస్తుతం 4,500ట్రాన్స్‌ఫార్మర్లు అవసరం ఉండగా.. అందులో వెయ్యి ట్రాన్స్‌ఫార్మర్లకు మాత్రమే వర్క్ ఆర్డర్లు ఇచ్చినట్లు సమాచారం. కొత్తవాటిని సకాలంలో ఏర్పాటు చేయాలని, తరుచూ ట్రాన్స్‌ఫార్మర్లు చెడిపోవడానికి గల కారణాలను తెలుసుకుని విద్యుత్‌శాఖ అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.  
 
 వైర్లు కలిసి కాలిపోయింది
 కొడంగల్ సబ్‌స్టేషన్ పరిధిలో ట్రాన్స్‌ఫార్మర్ మరమ్మతు కేంద్రం ఉంది. కొడంగల్, కోస్గి, దౌల్తాబాద్, మద్దూరు, బొంరాస్‌పేట మండలాల్లో చెడిపోయిన ట్రాన్స్‌ఫార్మర్లను ఇక్కడ బాగు చేస్తారు. మాకు సంబంధించిన ట్రాన్స్‌ఫార్మర్ వైర్లు కలిసి కాలిపోయింది. మరమ్మతు కోసం కొడంగల్‌కు తీసుకొచ్చాం. లో ఓల్టేజీ సమస్య, కరెంటు సరఫరాలో హెచ్చు తగ్గుల వల్ల ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోతున్నాయి.
 - శ్రీనివాస్‌రెడ్డి, వడిచర్ల(బొంరాస్‌పేట)

మరిన్ని వార్తలు