కిరాయిదారులకు సర్వే కష్టాలు

20 Aug, 2014 04:02 IST|Sakshi
  •    వివరాలు ఇవ్వొదంటూ అడ్డుకున్న యజమానులు
  •   పలు చోట్ల ఇళ్లను ఖాళీ చేయించిన వైనం
  • సాక్షి,సిటీబ్యూరో: అద్దె ఇళ్లల్లో ఉండేవారికి కుటుంబ సర్వే చుక్కలు చూపించింది. తమ ఇంటి చిరునామా పైన వివరాలు ఇవ్వరాదంటూ కొందరు ఇంటి యజమానులు అడ్డుకొన్నారు. మరి కొన్ని చోట్ల సర్వే అయిపోయే వరకు ఇళ్లల్లో ఉండొద్దంటూ ఒత్తిడి తెచ్చారు. దీంతో మంగళవారం చేట్టిన సమగ్ర సర్వేలో సొంత ఇళ్లు లేని కుటుంబాలుగా గుర్తింపు పొందాలనుకున్న వాళ్లకు నిరాశే మిగిలింది.

    నగరంలోని రసూల్‌పురా, బేగంపేట్, సికింద్రాబాద్ తదితర ప్రాంతాల్లో ఇలాంటి పరిస్థితులే ఎదురయ్యాయి. బన్సీలాల్‌పేట్ చాచా నెహ్రూనగర్‌లో ఒక ఇంటి యజమాని తన ఇంట్లో కిరాయికి ఉండే నాలుగు కుటుంబాలకు ఇలాగే బయటకు పంపినట్లు సమాచారం. సర్వేలో  తమకు ఎక్కువ ఆస్తి ఉన్నట్లుగా నమోదు కావద్దనే ఉద్దేశంతో కి రాయికి ఉన్నవాళ్లను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. మరి కొన్ని చోట్ల  సర్వే సందర్భంగా ఇంటి నెంబర్, కరెంట్ మీటర్ నెంబర్లు సర్వేలో చెప్పొద్దంటూ అడ్డుకున్నారు.
     
    చందానగర్ రాజీవ్ గృహకల్ప సముదాయంలోని ఇంటి యజమానులు, కిరాయిదారుల మధ్య వాగ్వాదం నెలకొంది. సర్వేలో తాము ఆయా నివాసాల్లో లేమని తేలితే తమ ఇంటిపై హక్కును కోల్పోతామని ఆందోళన చెందారు. ఇంటిని కిరాయికి ఇచ్చిన వారినిపేర్లు చెప్పొద్దని తమ పేర్లే రాయాలని డిమాండ్ చేశారు.
     
    కంటోన్మెంట్ బోర్డు పరిధిలో 2,3 వార్డుల్లో సమగ్ర కుటుంబ సర్వే కార్యక్రమం ఆలస్యంగా ప్రారంభం కాగా, 2వవార్డులో కొంత మంది ఇంటి యజమానులు తమ ఇళ్లల్లో కిరాయికి ఉంటున్న వారి వివరాలు ఇవ్వకుండా అడ్డుకున్నారు. మరికొందరు ఎన్యుమరేటర్లు ఇళ్లలోకి రాకుండా బయటినుంచే పంపించేశారు. కొన్ని బస్తీల్లో అనుబంధ ఎన్యుమరేటర్లు తమకు పది ఇళ్లను మాత్రమే కేటాయించారని.. మరికొందరు స్టిక్కరింగ్ చేయని ఇళ్లను సర్వే చేసేది లేదని తేల్చేశారు. 2వ వార్డు పరిధిలోని కృష్ణనగర్, ఇందిరమ్మ నగర్, అర్జున్ నగర్ బస్తీల్లోని కొందరు ఇంటి యజమానులుతమ ఇళ్లల్లో కిరాయిదారుల వివరాలు ఇవ్వరాదని, తక్షణమే ఇళ్లను ఖాళీ చేయాలని ఆదేశించారు.
     

మరిన్ని వార్తలు