ఎన్నికలు ప్రశాంతంగా జరుపుకోవాలి

6 Nov, 2018 14:44 IST|Sakshi
మాట్లాడుతున్న డీఐజీ ప్రమోద్‌కుమార్, చిత్రంలో ఎస్పీ సింధూశర్మ

     అధికారులు కలిసికట్టుగా కృషి చేయాలి

     కరీంనగర్‌ రేంజ్‌ డీఐజీ ప్రమోద్‌కుమార్‌

జగిత్యాల క్రైం: త్వరలో జరగబోయే ఎన్నికలను శాంతియుతంగా.. స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించేలా కృషి చేయాలని కరీంనగర్‌ రేంజ్‌ డీఐజీ పి.ప్రమోద్‌కుమార్‌ అన్నారు. సోమవారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఎస్పీ సింధూశర్మతో కలిసి అసెంబ్లీ ఎన్నికల నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎన్నికల సందర్భంగా ఎలాంటి ఘటనలూ జరగకుండా ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పటిష్టమైన చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. ఎన్నికల కోసం జిల్లాలో తీసుకున్న ముందస్తు చర్యలపై అధికారులతో చర్చించారు.

జిల్లాలోని సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలు, అత్యంత సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలు ఎన్ని ఉన్నాయని ఆరా తీశారు. గత ఎన్నికల సమయంలో గొడవలకు పాల్పడిన వారిలో ఎంతమందిని బైండోవర్‌ చేశారు..? ప్రతి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఎంత మంది రౌడీషీటర్లు ఉన్నారు..? ఎన్ని పోలింగ్‌ కేంద్రాలున్నాయి..? వాటి స్థితిగతులు ఏమిటీ..? ఏ పోలింగ్‌ కేంద్రం వద్ద ఎంతమంది పోలీసు భద్రత ఏర్పాట్లు అవసరం..?అక్కడ ముందస్తు చర్యలు ఎలా సుకుంటున్నారు..? వంటి అంశాలపై చర్చించారు. గతంలో జరిగిన ఎన్నికల్లో సమస్యాత్మక గ్రామాల గురించి అధికారులు డీఐజీకి వివరించారు. పోలీసు అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ సాంకేతిక నైపుణ్యంతో పనిచేయాలని డీఐజీ సూచించారు.

సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించడంతోపాటు ఎన్నికల సమయంలో గొడవలు సృష్టించే వ్యక్తులను గుర్తించి గత ఎన్నికల్లో నేరాలకు పాల్పడిన నేరస్తుల సమాచారాన్ని సేకరించి వారిపై గట్టి నిఘా పెట్టాలని సూచించారు. పోలీస్‌స్టేషన్ల వారిగా రౌడీషీటర్ల జాబితా రూపొందించుకుని వారి కదలికలపై నిఘా పెట్టాలన్నారు. ప్రతి హెచ్‌ఎస్‌వో తమతమ పరిధిలోని పోలింగ్‌ కేంద్రాలు అన్ని పర్యటిస్తూ స్థానిక ప్రజలతో సమావేశం నిర్వహిస్తూ ఎన్నికలు సజావుగా జరిగేలా చొరవ చూపాలన్నారు. ప్రతి పీహెచ్‌సీవోకి ఒక్కో గ్రామం పేరుతో పలకరించేలా రాజకీయేతర వ్యక్తులతో సంబంధం కలిగి ఉండాలన్నారు.

చెక్‌పోస్ట్‌ల తనిఖీ సమయంలో తప్పనిసరి వీడియో, ఫొటోగ్రఫీ తీసి జాగ్రత్తగా పొందుపర్చాలని సూచించారు. సాక్ష్యాధారాలు నేరానికి పాల్పడేవారికి శిక్ష పడటంలో కీలకమన్నారు. జిల్లాలో అన్ని పోలీస్‌స్టేషన్లలో అధికారులు ప్రజలతో సమన్వయం ఏర్పాటు చేసుకుని ముందుకెళ్లాలన్నారు. ప్రతి పోలింగ్‌ స్టేషన్‌లో ప్రతి గ్రామం ఒక ప్రాతిపాదికన తీసుకుని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా ప్రజలందరూ స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో డీఎస్పీలు వెంకటరమణ, మల్లారెడ్డి, సీతారాములు, ఏఆర్‌ డీఎస్పీ ప్రతాప్, స్పెషల్‌ బ్రాంచ్‌ ఇన్‌స్పెక్టర్‌ రాజశేఖర్‌రాజు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు