రేషన్‌ దుకాణాల్లో  డిజిటల్‌ సేవలు 

26 Jul, 2019 07:55 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ప్రజలకు మరింత ఉపయోగకరంగా మారనున్న చౌకధరల దుకాణాలు 

ఇంటి పన్ను, విద్యుత్‌æ బిల్లుల చెల్లింపునకు అవకాశం 

సెప్టెంబర్‌లో జిల్లా వ్యాప్తంగా డీలర్లకు శిక్షణ 

జిల్లా అధికారులకు అందిన ఉత్తర్వులు 

దురాజ్‌పల్లి (సూర్యాపేట) : బియ్యం, కిరోసిన్, సరుకుల పంపిణీకి పరిమితమైన రేషన్‌  దుకాణాల్లో మరిన్ని సేవలు అందుబాటులోకి రానున్నాయి. ప్రజల అవసరాలను తీర్చే ఈ–సేవ కేంద్రాలుగా రేషన్‌ దుకాణాలు అవతరించనున్నాయి. నిత్యావసర సరుకులతోపాటు సాంకేతిక సేవలను అందించేందుకు డీలర్లను, డిజిటల్‌æ లావాదేవీలను వినియోగదారులకు అలవాటు చేసేందుకు ప్రభుత్వం నూతన ఒరవడికి శ్రీకారం చుట్టింది. టీ–వ్యాలెట్‌æ ద్వారా ఈ సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు తగిన చర్యలు తీసుకుంటోంది. ఈ మేరకు పౌర సరఫరాల అధికారులకు ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు అందాయి. 

సేవల కేంద్రంగా.. 
రేషన్‌  దుకాణం ఇక సేవల కేంద్రంగా మారబోతుంది. కేవలం రేషన్‌ బియ్యమే కాకుండా ప్రజల అవసరాలు తీర్చే ఈ–సేవ కేంద్రాలుగా మారబోతున్నాయి. జిల్లాలో 609 రేషన్‌ దుకాణాల పరిధిలో 3,15,443 కుటుంబాలకు తెల్ల రేషన్‌  కార్డులు ఉన్నాయి. వీరికి  ఈ–పాస్‌ విధానం ద్వారా సరుకులు పంపిణీ చేస్తున్నారు. నూతన విధానం అమల్లోకి వచ్చాక ప్రభుత్వానికి రూ.లక్షల విలువైన బియ్యం మిగులుతోంది. ప్రతినెలా ఒకటో తేదీ నుంచి 15వ తేదీ వరకు సరుకుల పంపిణీ జరుగుతోంది. ఆ తర్వాత డీలర్లకు ఎలాంటి పనిలేక ఉపాధి లేకుండా పోతోంది. ఈ నేపథ్యంలోనే కమీషన్‌కు బదులుగా తమకు నెల వేతనం ఇచ్చి ఇతర సదుపాయాలతో అదనపు ఆదాయ మార్గాన్ని చూపాలని డీలర్లు ఆందోళన చేస్తూ వచ్చారు. ప్రజా పంపిణీ వ్యవస్థలో కీలకంగా వ్యవహరిస్తున్న డీలర్ల సాదకబాధకాలు గుర్తించిన ప్రభుత్వం, రేషన్‌ దుకాణాల్లో మరిన్ని సేవలు అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది.

ఇప్పటి వరకు చిన్న మొత్తం ఆర్థిక లావాదేవీల కోసం బ్యాంకులను, మీ–సేవ కేంద్రాలకు వెళ్లాల్సి వచ్చేది. ఇకపై రేషన్‌ దుకాణానికి వెళితే చాలు, ఈ విధానం ద్వారా మొబైల్‌ రీచార్చ్, నగదు బదిలీ, విద్యుత్‌ బిల్లులు, ఇంటి పన్నులు, బస్సు టికెట్‌, సర్వీస్‌ చార్జీల చెల్లింపు సేవలు పొందవచ్చు. తద్వారా డీలర్లకు  అదనపు ఆదాయంతో పాటు వినియోగదారులకుఆయా సేవలు మరింత చేరవయ్యే అవకాశం ఉంది. ఇప్పకే  ఈ–పాస్‌ యంత్రాల్లో కార్డుదారుల ఆధార్‌ సంఖ్యను అనుసంధానించడంతో జిల్లాలో  3,15,443  కుటుంబాలకు రేషన్‌ దుకాణాల్లో ఈ–సేవ కేంద్రాల మాదిరిగా సేవలు అందనున్నాయి.

 శిక్షణకు ప్రణాళిక సిద్ధం 
సాంకేతిక పరిజ్ఞానం రోజురోజుకూ పెరిగి పోతుండటంతో అందుకు అనుగుణంగా అవకాశాలను అందిపుచ్చుకొని డీలర్లకు ఉపాధి కల్పించాలని ప్రభుత్వం ఆలోచన చేసింది. ఇందులో భాగంగా ఈ–పాస్‌ విధానానికి టీ–వ్యాలెట్‌ను అనుసంధానం చేయనున్నారు. జిల్లాలో 23 మండలాలు ఉండగా, ఈ పాస్‌ విధానంలో సరుకులు పంపిణీ చేస్తున్న డీలర్లు 609 మంది ఉన్నారు. వీరందరికీ టీ–వ్యాలెట్‌ ద్వారా కార్డుదారులకు ఎలాంటి సేవలు అందించవచ్చు. ఆ సేవలను ఎలా అందించాలి, అందుకు ఏం చేయాలన్న దానిపై శిక్షణ ఇచ్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. అక్టోబర్‌ 15 నుంచి జిల్లాలోని రేషన్‌  డీలర్లకు శిక్షణ ఇవ్వడానికి పౌర సరఫరాల శాఖ షెడ్యూల్‌ను రూపొందించింది. దీంతోపాటు టీ–వ్యాలెట్‌ పరికరాలు అందిస్తారు. శిక్షణ పూర్తయ్యాక వ్యాలెట్‌ సేవలు అందుబాటులోకి రావచ్చని అధికారవర్గాలు చెబుతున్నాయి. టీ– వ్యాలెట్‌ అమలులోకి వస్తే రేషన్‌ దుకాణాలు 30 రోజులు తెరిచి ఉండనున్నాయి.    

మరిన్ని వార్తలు