14 నుంచి డిజిటల్ తరగతులు

29 Oct, 2016 00:37 IST|Sakshi
14 నుంచి డిజిటల్ తరగతులు

అధికారులతో సమీక్షలో కడియం
 

సాక్షి, హైదరాబాద్: బాలల దినోత్సవమైన నవంబరు 14న రాష్ట్రంలోని 1,500 ఉన్నత పాఠశాలల్లో డిజిటల్ తరగతులను ప్రారంభించనున్నట్లు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వెల్లడించారు. సాంఘిక సంక్షేమ, గిరిజన, బీసీ సంక్షేమ, విద్యాశాఖ గురుకులాలు, కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాలు, జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలల్లో వీటిని ప్రారంభిస్తామని తెలిపారు. తర్వాత ఇతర పాఠశాలలకు దశల వారీగా విస్తరిస్తామన్నారు. అలాగే అన్ని ఉన్నత పాఠశాలల్లో కంప్యూటర్ ల్యాబ్‌ల ఏర్పాటుకు ప్రభుత్వం ఆలోచనలు చేస్తోందన్నారు.

ఈ పాఠశాలల్లో డిజిటల్ తరగతుల ఏర్పాటుకు చేపట్టాల్సిన చర్యలపై సంబంధిత అధికారులతో కడియం శ్రీహరి శుక్రవారం సమీక్ష జరిపారు. ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నేతృత్వంలో విద్యార్థులకు డిజిటల్ లిటరసీ అందించేందుకు చర్య లు చేపడుతున్నామని, ఇందులో రాష్ట్రాన్ని మొదటి స్థానంలో నిలబెట్టేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. ఈ పాఠశాలల జాబితాను జిల్లాల వారీగా రూపొందించాలని చెప్పారు. వాటిలో మౌలిక వసతులు, ఇతర పరికరాలు, చేపట్టాల్సిన మరమ్మతులు అవసరమైన వాటిని గుర్తించాలన్నారు. సంబంధిత స్కూళ్లలో టీచర్లకు అవసరమైన శిక్షణను నవంబరు 10లోగా పూర్తి చేయాలన్నారు. 6 నుంచి 9వ తరగతి వరకు హిందీ మినహా మిగతా 5 సబ్జెక్టుల్లో ఎస్‌సీఈఆర్‌టీ రూపొందించిన పాఠ్యాంశాల ద్వారా డిజిటల్ బోధనను అందిస్తామన్నారు.

ఎంపిక చేసిన పాఠశాలలకు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్, మన టీవీ ద్వారా ఈ తరగతులపై శిక్షణ ఇవ్వాలని,  షెడ్యూలు రూపొం దించుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య, గిరిజన, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి సోమేష్ కుమార్, సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి బెనహర్ మహేష్ దత్ ఎక్కా, ఐటీ శాఖ కార్యదర్శి జయేష్ రంజన్, మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శి ఓమర్ జలీల్, విద్యాశాఖ డెరైక్టర్ కిషన్, గురుకుల పాఠశాలల డెరైక్టర్ శేషుకుమారి, మైనారిటీ గురుకులాల డెరైక్టర్ షఫీఉల్లా, మన టీవీ సీఈవో శైలేష్‌రెడ్డి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు