అంగన్‌వాడీలకు డిజిటల్‌ టెక్నాలజీ

21 Nov, 2017 02:03 IST|Sakshi

ఆగాఖాన్‌ ట్రస్ట్‌తో కలసి తెలంగాణలో అమలు

‘సాక్షి’తో సీడీఎఫ్‌ఐ ఈడీ కృష్ణన్‌ ధర్మరాజన్‌  

సాక్షి, హైదరాబాద్‌: గ్రామీణ భారతానికి కీలకమైన అంగన్‌వాడీల కోసం ప్రత్యేకంగా డిజిటల్‌ అప్లికేషన్లు అభివృద్ధి చేసి అందిస్తున్నామని సెంటర్‌ ఫర్‌ డిజిటల్‌ ఫైనాన్షియల్‌ ఇన్‌క్లూషన్‌ (సీడీఎఫ్‌ఐ) సంస్థ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ కృష్ణన్‌ ధర్మరాజన్‌ అంటున్నారు.

కొన్నేళ్ల క్రితం స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన మాజీ ఐఆర్‌ఎస్‌ అధికారి కృష్ణన్‌ ధర్మరాజన్‌ సేవలు సమాజంలోని అన్ని వర్గాల వారికి అందాలన్న లక్ష్యంతో సీడీఎఫ్‌ఐని స్థాపించారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలో చేపట్టిన కార్యక్రమాల అమలు తీరును పరిశీలించేందుకు ఇటీవల హైదరాబాద్‌ వచ్చిన ఆయనతో ‘సాక్షి’ముచ్చటించింది. బెట్స్‌ పేరుతో అభివృద్ధి చేసిన డిజిటల్‌ అప్లికేషన్‌తో అంగన్‌వాడీలకు జరిగే ప్రయోజనం, దేశంలోని ఇతర ప్రాంతాల్లో సీడీఎఫ్‌ఐ చేపట్టిన కార్యక్రమాల గురించి వివరించారు.  

బెనిఫిట్‌ ఎన్‌టైటిల్‌మెంట్‌ ట్రాకింగ్‌ సిస్టమ్‌ (బెట్స్‌) గురించి వివరిస్తారా?
గ్రామాల్లో అంగన్‌వాడీలు ఇప్పటికీ ప్రతిరోజూ కనీసం 12 రిజిస్టర్లు నిర్వహించాల్సి ఉంటుంది. రాతకోతల పనులన్నింటినీ డిజిటల్‌ రూపంలోకి మార్చేయడానికి బెట్స్‌ను సీడీఎఫ్‌ఐ రూపొందించింది. ఆగాఖాన్‌ ట్రస్ట్‌ సహకారంతో మహబూబ్‌నగర్‌ జిల్లాలోని 45 అంగన్‌వాడీ కేంద్రాల్లో బెట్స్‌ను అమలు చేస్తున్నాం.

వేలిముద్రతోపాటు ఆధార్‌ సంఖ్యతో పనిచేసే ఈ అప్లికేషన్‌తో వారికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతున్నాయి. ఆధార్‌ లేదన్న కారణంతో ఏ గర్భిణి, బాలింత, పిల్లలకు పౌష్టికాహారాన్ని నిరాకరించలేదు. అంగన్‌వాడీల వద్ద ఉండే పౌష్టికాహారంపై ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు సమాచారం అందుతూ ఉంటుంది. అంగన్‌వాడీల్లో బాలల హాజరును కేవలం ఒక్క ఫొటో తీసుకోవడం ద్వారా నమోదు చేయవచ్చు. అంగన్‌వాడీలు ఎంతమంది విధులకు హాజరవుతున్నారు? ఎలాంటి పను లు చేస్తున్నారన్న అంశాలపై అధికారులు పర్యవేక్షించేందుకూ వీలు కల్పిస్తుందీ అప్లికేషన్‌.  

పైలట్‌ ప్రాజెక్టు ఎంత కాలం కొనసాగుతుంది?
వచ్చే నెల 30 వరకు కొనసాగుతుంది. బెట్స్‌ పనితీరుపై ఇప్పటివరకూ మంచి ఫీడ్‌బ్యాకే వచ్చింది. డిసెంబర్‌ నుంచి తెలంగాణలోని 1,800 అంగన్‌వాడీల్లో బెట్స్‌ ద్వారా సేవలందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం.  

తమిళనాడులో బెట్స్‌ తరహాలోనే ఇంకో పైలట్‌ ప్రాజెక్టు మీరు అమలు చేస్తున్నారు. దాని గురించి చెబుతారా?
దాని పేరు ‘కంచి’. ఇది ఫార్మర్‌ ప్రొడ్యూసర్‌ ఆర్గనైజేషన్‌ (ఎఫ్‌పీవో)తో కలసి పనిచేస్తోంది. పాల ఉత్పత్తిదారులు, కంపెనీలను అనుసంధానించడం ద్వారా వారికి ఏరోజుకారోజు చెల్లింపులు జరిగేలా చూడటం ఈ అప్లికేషన్‌ తాలూకూ ప్రయోజనం. ఈ లావాదేవీల ఆధారంగా రైతులకు పరపతి కల్పించి, బ్యాంకుల ద్వారా రుణాలు అందేలా చూసేందుకూ ఇందులో ఏర్పాట్లు ఉన్నాయి. ఎఫ్‌పీవోల లావాదేవీలన్నింటినీ డిజిటల్‌ రూపంలోకి తీసుకొచ్చేందుకు ఇది ఉపయోగపడుతుంది. ప్రభుత్వ పథకాలను వివరించేందుకు సంకల్ప్‌ అనే డిజిటల్‌ సొల్యూషన్‌ ఉపకరిస్తుంది. గ్రామీణ ప్రాంత ప్రజల్లో డిజిటల్‌ ఆర్థిక లావాదేవీలపై అవగాహన పెంచేందుకు ‘సంవాద్‌’అప్లికేషన్‌ను అభివృద్ధి చేశాం. 

మరిన్ని వార్తలు