ఇంట్లోనే చదువు! 

24 Mar, 2020 03:45 IST|Sakshi

విద్యార్థులకు అందుబాటులో డిజిటల్, ఆన్‌లైన్‌ పాఠాలు

అధ్యాపకులు వర్క్‌ ఫ్రమ్‌ హోం చేయాలి..

ఉన్నత విద్య విద్యార్థులు నష్టపోకుండా ఎంహెచ్‌ఆర్‌డీ చర్యలు

సాక్షి, హైదరాబాద్‌: కోవిడ్‌ ప్రభావంతో విద్యాసంస్థలను మూసివేసిన కేంద్ర ప్రభుత్వం డిజిటల్‌ పాఠాలు, ఆన్‌లైన్‌ చదువులు అందించేందుకు ఆదేశాలు జారీ చేసింది. అధ్యాపకులంతా వర్క్‌ ఫ్రమ్‌ హోం చేయడంతోపాటు యూనివర్సిటీలు, అనుబంధ కాలేజీలు, పాఠశాలల విద్యార్థులకు అవసరమైన బోధనను ఆన్‌లైన్‌ ద్వారా అందించాలని స్పష్టం చేసింది. ఇందుకోసం కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ (ఎంహెచ్‌ఆర్‌డీ) కార్యదర్శి అమిత్‌ఖరే ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే ఐఐటీ, ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ఐటీ, ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ విద్యనందించే యూనివర్సిటీలు సహా ఇతర విద్యాసంస్థలన్నీ ఆన్‌లైన్‌ బాటపట్టాలని కేంద్రం సూచించింది.

అన్ని విద్యాసంస్థలకు వర్తింపు..
యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్, అఖిల భారత సాంకేతిక విద్యా మండలి, జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి, సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ ఎడ్యుకేషన్, నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ, నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఓపెన్‌  స్కూలింగ్, ఎంహెచ్‌ఆర్‌డీ పరిధిలోని, వాటికి అనుబంధంగా ఉన్న విద్యాసంస్థలు ఈ నెల 31 వరకు వర్క్‌ ఫ్రమ్‌ హోంతోపాటు డిజిటల్, ఆన్‌లైన్‌ పాఠాలు అందించేలా చర్యలు చేపట్టాలని కేంద్రం స్పష్టం చేసింది. అధ్యాపకులు, టీచర్లు ఆన్‌లైన్‌  కంటెంట్, ఆన్‌లైన్‌ టీచింగ్, ఆన్‌లైన్‌ మూల్యాంకనం అభివృద్ధి చేయాలని పేర్కొంది. వచ్చే విద్యా సంవత్సరం, తదుపరి సెమిస్టర్‌ లెస్సన్‌ ప్లాన్స్, బోధన ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని, క్వశ్చన్‌ బ్యాంక్స్‌ రూపొందించాలని తెలిపింది.

ఆన్‌లైన్‌లో వేలల్లో పుస్తకాలు
ఎంహెచ్‌ఆర్‌డీ రూపొందించిన దీక్ష, ఈ–పాఠశాల వంటి ఆన్‌లైన్‌ వ్యవస్థలను విద్యార్థులు ఉపయోగించుకోవాలని కేంద్రం పేర్కొంది. సీబీఎస్‌ఈ, ఎన్‌సీఈఆర్‌టీ 1 నుంచి 12వ తరగతి వరకు రూపొందించిన 80 వేల పుస్తకాలు దీక్ష పోర్టల్‌లోనూ, ఈ–పాఠశాలలో 2 వేలకుపైగా ఆడియో, వీడియో పాఠాలు అందుబాటులో ఉన్నాయి.

వీలుంటే ఇళ్లకు వెళ్లిపోండి
హాస్టళ్లలో ఉండే విద్యార్థులు వీలైనంత వరకు ఇళ్లకు వెళ్లిపోవాలని ఎంహెచ్‌ఆర్‌డీ స్పష్టంచేసింది. యూనివర్సిటీ హాస్టళ్లలో ఉండే విదేశీ విద్యార్థులతోపాటు ఇళ్లకు వెళ్లని విద్యార్థుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. గుంపులుగా ఉండకుండా, హాస్టల్‌ గదుల్లోనే ఉండాలని, హాస్టళ్లలో హై శానిటైజేషన్‌ చర్యలు చేపట్టాలని వెల్లడించింది.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా