డెత్తీరియా

11 Aug, 2014 00:34 IST|Sakshi
డెత్తీరియా
  •   డిఫ్తీరియాతో చిన్నారి మృతి
  •   500లకు పైగా కేసులు నమోదు
  •   వ్యాక్సిన్  లోపం వల్లే విజృంభణ
  • గ్రేటర్ వాసులను కంఠసర్పి(డిఫ్తీరియా) కాటేస్తోంది. ఆ వ్యాధి బారిన పడి ఫీవర్ ఆస్పత్రిలో శనివారం ఓ చిన్నారి మృతి చెందింది. ఇప్పటి వరకూ 500లకు పైగా కేసులు నమోదయ్యా యి. ఒక్క ఫీవర్ ఆస్పత్రిలో వందకు పైగా బాధితులు చికిత్స పొందుతున్నారు. గొంతు నొప్పితో బాధపడుతూ ఆస్పత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతుండడంతో నగరవాసులు ఆందోళన చెందుతున్నారు. డీపీటీ వ్యాక్సిన్ తీసుకున్నవారు సైతం ఆస్పత్రుల పాలుకావడం గమనార్హం.     
     
    నగరంలో డిఫ్తీరియా వ్యాధి ప్రబలుతోంది. ఈ వ్యాధి బారిన పడి ఓ చిన్నారి ఈ నెల 6న ఫీవర్ ఆస్పత్రిలో చేరింది. చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది. వందలాది మంది ఆస్పత్రి పాలవుతున్నారు. ఈ వ్యాధి ఎక్కువగా చిన్నారులకు వస్తుంది. ప్రస్తుతం పెద్దవారికి సైతం సోకుతుండటంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు.

    నాలుగేళ్లుగా ఈ వ్యాధి నగరంలో విజృంభిస్తోంది. 2011 సంవత్సరంలో 1036 కేసులు, 2012లో 925, 2013లో 1083 కేసులు న మోదయ్యాయి. ఈ ఏడాది ఇప్పటివరకు దాదాపు 500 కేసులు నమోదయ్యాయి. ప్రైవేటు ఆస్పత్రుల్లో సైతం పెద్ద సంఖ్యలో బాధితులు చికిత్స పొందుతున్నట్టు సమాచారం. నగరంలోని పలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఈఎన్‌టీ డాక్టర్లు లేకపోవడం ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.
     
    వాక్సినేషన్ లోపం వల్లే..
     
    జాతీయ ఇమ్యూనైజేషన్ పోగ్రామ్‌లో భాగంగా చిన్నారులకు వ్యాధి నిరోధక టీకాలను ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేస్తోంది. పోలియో, డిఫ్తీరియా వ్యాధుల నివారణకు ఉపయోగించే వ్యాక్సిన్‌ను నిల్వచేసే విషయంలో సరైన ప్రమాణాలు పాటించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఫలితంగా టీకాలు వేసుకున్న వారు ఆస్పత్రుల పాలవుతున్నారు. నగరంలోని పలు పీహెచ్‌సీల్లో డీపీటీ వ్యాక్సిన్‌ను బుధవారం వేస్తున్నారు. ప్రతి శనివారం ఆరోగ్య కేంద్రాల పరిధిలోని ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు ఆయా బస్తీల్లో పర్యటించి వాక్సినేషన్‌పై అవగాహన కల్పించాల్సి ఉండగా, ఒక్క పోలియో దినోత్సవం రోజు మినహా ఇతర సందర్భాల్లో కన్పించడం లేదు.

    పాత బస్తీలోనే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. వ్యాధి నివారణకు ఉపయోగించే వ్యాక్సిన్‌పై ప్రజలకు అవగాహన కల్పించడంలో అధికారులు విఫలమయ్యారు. 18 నెలలకు ఒక డోసు, ఐదేళ్లకు మరో డోసు చొప్పన డీపీటీ వాక్సిన్ ఇవ్వాలి. దీనిపై అవగాహన లేకపోవడంతో సకాలంలో వ్యాక్సిన్ వేయించలేక పోతున్నారు. ఇప్పటి వరకు న మోదైన కేసులన్నీ ప్రభుత్వ ఆస్పత్రుల్లో గుర్తించినవే. ప్రైవేటు ఆస్పత్రుల్లో కూడా బాధితులు పెద్ద సంఖ్యలో ఉన్నట్టు సమాచారం.
     
    లక్షణాలు గుర్తించండిలా...
     గొంతువాపుతో పాటు ట్రాన్సిల్స్‌పై పింక్ కలర్ ప్యాచ్ ఏర్పడి రక్తస్రావం అవుతుంది
         
     బాధితుడు దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు బ్యాక్టీరియా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది
     
     ముక్కు నుంచి నీరు కారుతుంది. తలనొప్పి వస్తుంది. దగ్గు, జలుబు ఉంటుంది
         
     శ్వాస సరిగా తీసుకోలేక పోవడం, హై టెంపరేచర్‌తో కూడిన జ్వరంతో బాధపడతారు
     
     ఏ మాత్రం అనుమానం వచ్చినా వెంటనే వైద్యులను సంప్రదించాలి
         
     నిర్లక్ష్యం చేస్తేనాడీ వ్యవస్థ, గుండె పని తీరు దెబ్బతిని మరణించే ప్రమాదం ఉంది
     
     -  డాక్టర్ శంకర్, సూపరింటెండెంట్, ఫీవర్ ఆస్పత్రి
     

మరిన్ని వార్తలు