సాగునీటి ప్రాజెక్టుల డీపీఆర్‌లు ఇవ్వండి

31 May, 2020 08:27 IST|Sakshi

అనుమతి లేని ప్రాజెక్టుల పనులు చేయొద్దు 

ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలకు కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డులు ఆదేశం

సాక్షి, హైదరాబాద్‌: గోదావరి, కృష్ణా నదులపై ఆయా నదీ యాజమాన్య బోర్డుల టెక్నికల్‌ అనుమతి, అపెక్స్‌ కౌన్సిల్‌ ఆమోదం లేకుండా చేపట్టిన అన్ని ప్రాజెక్టుల డీపీఆర్‌ (డిటెల్డ్‌ ప్రాజెక్టు రిపోర్టు)లు సమర్పించాలని ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలను కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డులు ఆదేశించాయి. పూర్తి అనుమతులు వచ్చే వరకు ఆయా ప్రాజెక్టుల పనులు చేయొద్దని స్పష్టం చేశాయి. కృష్ణా బోర్డు సభ్యుడు హరికేశ్‌ మీనా ఆంధ్రప్రదేశ్‌ జలవనరుల ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి, గోదావరి బోర్డు సభ్యుడు పీఎస్‌ కుటియాల్‌ తెలంగాణ ఇరిగేషన్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీకి శనివారం లేఖ రాశారు. ఏపీ పునర్విభజన చట్టంలోని నిబంధనలను అతిక్రమించి రెండు రాష్ట్రాలు చేపట్టిన ప్రాజెక్టుల డీపీఆర్‌లు వెంటనే బోర్డులకు సమర్పించాలని ఆదేశించారు. 

ఎంపీ సంజయ్‌ లేఖకు స్పందన 
ఏపీ ప్రభుత్వం తలపెట్టిన పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ విస్తరణ, సంగమేశ్వరం లిఫ్ట్‌ ప్రాజెక్టులపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకా వత్‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన కేంద్రమంత్రి ఏపీ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు విస్తరణ, సంగమేశ్వరం లిఫ్ట్‌ ప్రాజెక్టులపై వెంట నే సమావేశం నిర్వహించాలని కృష్ణాబోర్డును ఆదేశించారు. ఆ ప్రాజెక్టుల డీపీఆర్‌లు సమర్పించాలని ఏపీని ఆదేశించాలని సూచించారు.

ఏపీ, తెలంగాణ మధ్య జలవివాదాల పరిష్కారానికి అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని కేంద్ర జలవనరుల శాఖను ఆదేశించా రు. కేంద్రమంత్రి ఆదేశాలతో జలవనరుల శాఖ కృష్ణాబోర్డు అధికారులకు లేఖ రాసింది. అపెక్స్‌ కౌన్సిల్, సీడబ్ల్యూసీ, బోర్డు అనుమతి లేని ప్రాజెక్టుల విషయంలో ఏపీ ముం దుకు వెళ్లకుండా నిలువరించాలని ఆదేశించింది. జూన్‌ 4న నిర్వహించే కృష్ణా బోర్డు సమావేశంలో ఆయా ప్రాజెక్టుల డీపీఆర్‌లు సమర్పించేలా ఏపీ అధికారులను పట్టుబట్టా లని సూచించారు.

గోదావరి బోర్డుకు ఏపీ ఫిర్యాదు 
గోదావరి నదిపై తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కాళేశ్వరం, సీతారామ, తుపాకులగూడెం, దేవాదుల ఫేజ్‌–3, మిషన్‌ భగీరథ, చనకా – కొరటా సహా పలు ప్రాజెక్టులపై ఏపీ ప్రభుత్వం గోదావరి బోర్డుకు ఫిర్యాదు చేసింది. ఈ ప్రాజెక్టుల డీపీఆర్‌లు బోర్డుకు సమర్పించాలని, అపెక్స్‌ కౌన్సిల్‌ అనుమతి లేకుండా చేస్తున్న ఈ ప్రాజెక్టుల పనులను నిలుపుదల చేయాలని బోర్డు తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది. చదవండి: గొర్రెల పెంపకంలో మనదే అగ్రస్థానం

మరిన్ని వార్తలు