డైరెక్టర్‌ వర్సెస్‌ డాక్టర్స్‌

22 May, 2020 13:23 IST|Sakshi
డైరెక్టర్‌ చాంబర్‌ ఎదుట ఆందోళన చేస్తున్న వైద్యులు, సిబ్బంది

రిమ్స్‌లో ముదురుతున్న విభేదాలు

డైరెక్టర్‌ తీరుకు నిరసనగా సిబ్బంది ఆందోళన

విధులు బాధ్యతగా నిర్వహించాలన్నందుకేనా?

ఆదిలాబాద్‌టౌన్‌: జిల్లా కేంద్రంలోని రాజీవ్‌గాంధీ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (రిమ్స్‌)లో డైరెక్టర్, వైద్యులు, సిబ్బంది మధ్య రోజురోజుకు వివాదాలు తారస్థాయికి చేరుకుంటున్నాయి. రిమ్స్‌ డైరెక్టర్‌ ఇబ్బందులకు గురిచేస్తున్నారని సిబ్బంది, వైద్యులు డైరెక్టర్‌ చాంబర్‌ ఎదుట నిరసనకు దిగారు. గతకొన్ని రోజులుగా చాపకింద నీరులా కొనసాగుతున్న వివాదాలు ముదురుతున్నాయి. అయితే విధుల పట్ల వైద్యులు, సిబ్బందితో డైరెక్టర్‌ కఠినంగా వ్యవహరించడం ఈ వివాదాలకు దారి తీసినట్లు తెలుస్తోంది. కాగా వైద్యులు, సిబ్బంది గురువారం విధులు బహిష్కరించి నిరసనకు దిగారు. కార్మికులు, స్టాఫ్‌నర్సులు, ఫార్మసిస్టులు, డాక్టర్లు, జూనియర్‌ డాక్టర్లు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. దీంతో అత్యవసరంగా చికిత్స అందక రోగులు అవస్థలు పడ్డారు.

ముదురుతున్న విభేదాలు
రిమ్స్‌ డైరెక్టర్‌ బానోత్‌  బలరాం వైద్యులు, సిబ్బందిని తన జాబ్‌ చార్ట్‌ ప్రకారం విధులు నిర్వహించాలని, సమయపాలన పాటించాలని సూచిస్తున్నారు. రిమ్స్‌లో పనిచేస్తున్న కొంతమంది వైద్యులు, సిబ్బందికి ఇది మింగుడు పడటం లేదు. ఉదయం 9గంటలకు విధులకు హాజరై సాయంత్రం 4గంటల వరకు పని చేయాలని ఆదేశించారు. అలాగే బయోమెట్రిక్‌ విధానం ద్వారా హాజరు నమోదు చేయాలని చెప్పడం ఈ నిరసనకు దారి తీసినట్లు సమాచారం. కరోనా నేపథ్యంలో గత రెండు నెలలుగా రిజిస్టర్‌లో సంతకం చేస్తున్న వైద్యులను గురువారం నుంచి బయోమెట్రిక్‌ ద్వారా హాజరు నమోదు చేసుకోవాలని డైరెక్టర్‌ సూచించారు. అయితే కొంతమంది వైద్యులు డైరెక్టర్‌కు వ్యతిరేకంగా సిబ్బందితో కలిసి ఆందోళనకు దిగినట్లు తెలుస్తోంది. రిమ్స్‌లో పనిచేస్తున్న చాలా మంది వైద్యులు ఆదిలాబాద్‌ పట్టణంలో ప్రైవేట్‌   క్లినిక్‌లు నిర్వహిస్తున్నారు. దీంతో రిమ్స్‌లో సమయం కేటాయించలేకపోతున్నారు. మధ్యాహ్నమే ఇంటిముఖం పడుతున్నారు. బయట క్లినిక్‌లో వైద్యం చేస్తూ నిబంధనలను అతిక్రమిస్తున్నారు. ఇలా విధులకు గైర్హాజరవుతున్న వైద్యులు, సిబ్బందికి డైరెక్టర్‌ మెమోలు జారీ చేస్తున్నారు. దీంతో కొంతమంది ఉద్యోగులు, వైద్యులు, సిబ్బంది ఏకమై నిరసన చేపడుతున్నట్లు సమాచారం. కాగా ఇటీవల స్టాఫ్‌నర్సులు కూడా డైరెక్టర్‌ చాంబర్‌ వద్ద నిరసనకు దిగిన విషయం విదితమే. స్టాఫ్‌నర్సులు కూడా బయోమెట్రిక్‌ ద్వారా హాజరు నమోదు చేసుకోవాలని, డైరెక్టర్‌ కార్యాలయంలోని రిజిస్టర్‌లో సంతకాలు చేయాలని పేర్కొనడంతో ఆందోళన చేపట్టారు.

గతంలో కూడా..
రిమ్స్‌లో పనిచేస్తున్న వైద్యులు రెండు గ్రూపులుగా ఉన్న విషయం తెలిసిందే. కొంతమంది డైరెక్టర్‌కు మద్దతుగా ఉంటే మరికొంత మంది వ్యతిరేకంగా నడుచుకుంటున్నట్లు సమాచారం. మహారాష్ట్రకు చెందిన వైద్యులు, ఇక్కడి వైద్యులకు కూడా గొడవలు జరిగాయి. అలాగే గతంలో పనిచేసిన డైరెక్టర్లు కూడా కఠినంగా వ్యవహరించడంతో వైద్యులు, సిబ్బంది ఏకమై ఇలాంటి ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం పరిపాటిగా మారింది. 

వేధింపులకు పాల్పడడంతోనే..
రిమ్స్‌ డైరెక్టర్‌ తమపై మానసికంగా వేధింపులకు పాల్పడుతున్నారని వైద్యులు, సిబ్బంది పేర్కొంటున్నారు. బాధ్యతగా విధులు నిర్వర్తిస్తున్నా మెమోలు జారీ చేస్తున్నారని పలువురు చెబుతున్నారు. కరోనా నేపథ్యంలో విధులు నిర్వహించిన తమకు మాస్కులు, గ్లౌజులు, శానిటైజర్లు అందుబాటులో ఉంచలేదని ఆరోపిస్తున్నారు. ఇతర మెడికల్‌ కళాశాలల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నా రిమ్స్‌లో మాత్రం లేవన్నారు. తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విపత్కర పరిస్థితుల్లోనూ విధులు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఎలాంటి సౌకర్యాలూ కల్పించడం లేదు
కరోనా నేపథ్యంలో కూడా రిమ్స్‌లో వైద్యులు, సిబ్బందికి కనీస సౌకర్యాలు కల్పించడం లేదు. రిమ్స్‌ డైరెక్టర్‌ను పలుసార్లు కలిసి గ్లౌజులు, మాస్కులు అందజేయాలని కోరాం. స్వచ్ఛంద సంస్థలు, ఇతరులు ముందుకొచ్చి అందిస్తున్నారే కాని ఆస్పత్రిలో మాత్రం మాకు మాస్కులు, శానిటైజర్లు ఇవ్వలేదు. ఇతర మెడికల్‌ కళాశాలల్లో పీపీఈ కిట్లు కూడా అందించారు. కరోనా ఉధృతి సమయంలో కూడా ప్రాణాలను సైతం లెక్కచేయకుండా వైద్యసేవలు అందించాం. డైరెక్టర్‌.. వైద్యులు, సిబ్బంది పట్ల వ్యవహరిస్తున్న తీరు సరికాదు.      – ప్రణవ్, జూనియర్‌ డాక్టర్,రిమ్స్, ఆదిలాబాద్‌

బాధ్యతగా విధులు నిర్వహించాలనడంతోనే..
రిమ్స్‌ వైద్యులు, ఉద్యోగులు, సిబ్బంది బాధ్యతగా విధులు నిర్వర్తించాలని చెప్పడంతోనే వారు ఆందోళనకు దిగారు. ఇదివరకే ఒక్కో వైద్యుడికి నాలుగు చొప్పున మాస్కులు ఇచ్చాం. వారు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బయోమెట్రిక్‌ ద్వారా హాజరు నమోదు చేసుకోవాలని సూచించాం. వైద్యులు, ఉద్యోగులు, సిబ్బందిని వేధింపులకు గురిచేయడం లేదు.  – బానోత్‌బలరాం, రిమ్స్‌ డైరెక్టర్, ఆదిలాబాద్‌

>
మరిన్ని వార్తలు