పర్వతాన్ని అధిరోహించిన దివ్యాంగుడు

4 Nov, 2019 10:58 IST|Sakshi

సాక్షి, చౌటుప్పల్‌ :  చౌటుప్పల్‌ మండలం పీపల్‌పహాడ్‌ గ్రామానికి చెందిన చిదుగుళ్ల శేఖర్‌గౌడ్‌ తన స్వగ్రామంలో ఉన్న పాఠశాలలో ప్రాథమిక విద్యాభ్యాసం చేశాడు.  ఉన్నత విద్యాభ్యాసం కొయ్యలగూడెం గ్రామంలోని ఓ ప్రైవేట్‌ పాఠశాలలో సాగింది. అక్కడి నుంచి ఇంటర్‌ చదివేందుకు అప్పటి జిల్లా కేంద్రమైన నల్లగొండకు వెళ్లాడు. ప్రభుత్వ కళాశాలలో చేరి ఓ గది అద్దెకు తీసుకొని చదువుంటూ ఉండే వాడు. తాను అద్దెకు ఉన్న ఇంటిపై ప్రమాదవశాత్తు జరిగిన విద్యుదాఘాతానికి గురై శేఖర్‌ తీవ్రగాయాల పాలయ్యాడు.

వైద్యులు కుడి చేయి, ఎడమ కాలును తొలగించారు. అసలే నిరుపేద కుటుంబం ఆపై చేతికి అందిన కుమారుడి అవిటితనంతో కుటుంబం మరింత చితికింది. కొన్ని నెలల పాటు ఇంటి వద్దే ఉంటూ కుటుంబ బాధలు గుర్తించి స్వయం ఉపాధి పొందాలనుకున్నాడు. అందులో భాగంగా సెల్‌ఫోన్‌ షాప్‌ పెట్టుకోగా నష్టం చవిచూసింది. ఇదంతా తొమ్మిదేళ్ల క్రితం జరిగింది. తర్వాత కొంతమంది  మిత్రుల సాయంతో కృత్రిమ అవయవాలు అమర్చుకోగలిగాడు. 

రన్నింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్, బ్యాడ్మింటన్‌లలో అద్భుతాలు.. 
తనకు కాలు, చెయ్యి లేకున్నా ఎన్నో అద్భుతాలకు కేంద్ర బిందువుగా మారాడు శేఖర్‌గౌడ్‌. కొంతమంది స్ఫూర్తితో ముందుగా నడకపై దృష్టి సారించాడు. క్రమక్రమంగా రన్నింగ్‌ చేయడం ప్రారంభించి విజయవంతమయ్యాడు. తనలాంటి ఎందరో దివ్యాంగులకు, విద్యార్థులకు శిక్షణ సైతం అందించాడు. కొంతకాలం తర్వాత సైక్లింగ్, స్విమ్మింగ్, బ్యాడ్మింటన్‌లపై దృష్టిపెట్టాడు. కొద్ది కాలానికే వీటిలోనూ సక్సెస్‌ అయ్యాడు. హైదరాబాద్‌లో నిర్వహించిన ఎన్నో రకాల పోటీల్లో పాల్గొని బహుమతులు పొందాడు. 

మౌంట్‌ఎల్‌బ్రూస్‌ పర్వతాన్ని అధిరోహించిన తొలి భారతీయ దివ్యాంగుడు.. 
ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తాను అనుకున్న లక్ష్యాన్ని చేరుకునేందుకు శేఖర్‌ నిరంతరం శ్రమించేవాడు. గత ఆగస్టులో యూరప్‌లోనే అత్యంత ఎత్తైన పర్వత శిఖరాన్ని అధిరోహించేందుకు కొంత మంది సభ్యులతో కలిసి బయలుదేరాడు. ఆ బృందంలో ఇతనొక్కడే దివ్యాంగుడు. 5642మీటర్ల ఎత్తైన మౌంట్‌ఎల్‌బ్రూస్‌ పర్వతాన్ని కేవలం 17గంటల్లోనే అధిరోహించి అద్భుతం సృష్టించాడు. అక్కడే భారతదేశ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి తన లక్ష్యాన్ని నెరవేర్చుకున్నాడు. ఈ ఘనత సాధించిన తొలి తెలంగాణ వ్యక్తి ఇతనే. తొలి భారతీయ దివ్యాంగుడు సైతం ఇతనే కావడం గర్వించదగ్గ విషయం.

తాజాగా కిలిమంజారో పర్వత అధిరోహణ..
అందరిలా కాకుండా తనకంటూ ఓ ప్రత్యేకత ఉండాలని నిరంతరం భావించే శేఖర్‌ అందుకోసం నిరంతరం పరితపిస్తుంటాడు. తాజాగా దక్షిణాఫ్రికా దేశంలోని 5895 మీటర్ల ఎత్తైన కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించాడు. గత నెల 22న మధ్యప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన తన సహచరురాలు భావనతో(దివ్యాంగురాలు కాదు) కలిసి నడక ప్రారంభించాడు. అదే నెల 27న పర్వతాన్ని అధిరోహించి తన ఘనతను చాటా డు. ఈ మేరకు అధికా రికంగా ధ్రువీకరణ పత్రాన్ని పొందాడు. ఈ పర్వతాన్ని అధి రోహించిన తొలి భారతీయ దివ్యాం గుడిగా సరికొత్త చరిత్రను సృష్టించాడు. 

ఆర్థిక సహకారం లేక నానా అవస్థలు.. 
ఎన్నో రకాల సాహసాలు చేస్తూ శభాష్‌ అనిపించుకుంటున్న శేఖర్‌కు ఆర్థికపరమైన సహకారం లేకపోవడంతో నానా అవస్థలు పడుతున్నాడు. జీవనం కోసం ఆస్పత్రిలో పని చేయగా వచ్చే రూ. 13వేలతో పూటగడవడమే కష్టమయ్యే పరిస్థితుల్లో ఉన్నాడు. ఒక్కో సాహసయాత్రకు రూ. 2లక్షల నుంచి 3లక్షల వరకు ఖర్చవుతుండడంతో ఇబ్బందులు పడుతున్నాడు. దేశానికి, తెలంగాణ రాష్ట్రానికి కీర్తిప్రతిష్టలు తీసుకువస్తున్న శేఖర్‌కు ప్రభుత్వాలు, దాతలు ముందుకు వచ్చి ఆర్థిక చేయూతను అందించాల్సి ఉంది. 

ఎత్తైన పర్వతాల అధిరోహణ.. 
ప్రపంచంలోని ఏడు ఖండాల్లో ఉన్న అత్యంత ఎత్తైన పర్వతాలు అధిరోహించడమే లక్ష్యంగా శేఖర్‌ ముందుకు సాగుతున్నా డు. ఈ ఏడాది ఆగస్టులో యూరప్‌లోని మౌంట్‌ఎ ల్‌బ్రూస్‌ను, గత నెల దీపావళిన దక్షిణాఫ్రికాలోని కిలి మంజారో పర్వతాన్ని అధిరోహించాడు. సౌత్‌ అమెరికా అర్జెంటీనాలోని 6962 మీటర్ల ఎత్తైన మౌంట్‌ఎకాన్‌కాగా, నార్త్‌అమెరికాలోని అల్‌హక్కాలోని 6194మీటర్ల ఎత్తులో ని మౌంట్‌బెనాలి, అంటార్కిటికా దేశంలో 4892మీటర్ల ఎత్తులోని మౌంట్‌విన్సన్‌మాసిఫ్, ఆస్ట్రేలియాలోని 2282 మీటర్ల ఎత్తులోని మౌంట్‌కాస్‌కిస్కోలతో పాటు నేపాల్‌లో ఉన్న ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మౌంట్‌ ఎవరెస్ట్‌ (8848మీటర్లు)ను  అధిరోహించాలని శేఖర్‌ లక్ష్యంగా పెట్టుకున్నాడు.

పని చేస్తూనే.. 
పేద కుటుంబం కావడంతో శేఖర్‌కు ఆర్థిక ఇబ్బందులు అధికంగా ఉండేవి. సొంత ఊరిని విడిచి హైదరాబాద్‌కు వెళ్లిన శేఖర్‌కు ఖర్చులకు డబ్బులు లేక ఇబ్బందులు ఎదురయ్యేవి. మూడు పూటలు తిండి కూడా తినలేని పరిస్థితి. ఈ బాధలను అధిగమించేందుకు ప్రైవేట్‌గా ఏదైనా ఉద్యో గం చేయాలనుకున్నాడు.  ప్రణవ్‌ ఆస్పత్రిలో ఓ ఉద్యోగంలో చేరాడు. నెల రోజులపాటు పని చేస్తే వచ్చే రూ.. 13వేలతో జీవనం సాగిస్తున్నాడు.

ఎవరెస్ట్‌ శిఖరాన్ని అధిరోహించడమే లక్ష్యం 
ప్రమాదంలో కాలు, చెయ్యి కోల్పోయా. అయినా కుంగిపోలేదు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్నా. గత ఆగస్టులో యూరప్‌లోని అత్యంత ఎత్తైన మౌంట్‌ఎల్‌బ్రూస్‌ పర్వతాన్ని అధిరోహిం చా. గత నెల దీపావళిన దక్షిణాఫ్రికాలోని కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించాను. ఎవరెస్ట్‌ శిఖరాన్ని అధిరోహించాలన్నదే నా జీవిత లక్ష్యం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు దాతలు నాకు తోడ్పాటునందించాలి. 
– చిదుగుళ్ల శేఖర్‌గౌడ్‌ 

మరిన్ని వార్తలు