హస్తానికి అసమ్మతి

14 Nov, 2018 14:15 IST|Sakshi

టికెట్ల కేటాయింపుపై కాంగ్రెస్‌ ఆశావహుల అసంతృప్తి

మంచిర్యాల సీటును వేలం వేశారన్న అరవింద్‌రెడ్డి

బీజేపీ లేదా బీఎస్పీ నుంచి పోటీ చేస్తానని వెల్లడి

ఆదిలాబాద్‌లో అసంతృప్తితో సీఆర్‌ఆర్‌

రేవంత్‌రెడ్డి వర్గానికి ఉమ్మడి జిల్లాలో మొండిచెయ్యి

బోథ్‌లో సోయంకు ఉత్తమ్‌ చెక్‌

ఖానాపూర్‌లో నిలిచిన రాథోడ్‌ టికెట్‌

కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థుల ఎంపికతో ఊహించినట్టుగానే కొత్త చిక్కులు మొదలయ్యాయి. టికెట్టు ఆశించి భంగపడ్డ నేతలు తిరుగుబాటు బావుటా ఎగరేశారు. రెబల్స్‌గా గానీ ఇతర పార్టీల నుంచి అభ్యర్థులుగా
గాని బరిలో నిలిచేందుకు సన్నద్ధమవుతున్నారు. 

సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్‌: 
కాంగ్రెస్‌ పార్టీ సోమవారం రాత్రి ప్రకటించిన 65 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాలో ఉమ్మడి ఆదిలాబాద్‌కు చెందిన ఏడుగురికి స్థానం లభించింది. కాంగ్రెస్‌ స్క్రీనింగ్‌ కమిటీ ఢిల్లీలో ఈనెల 6 నుంచి 8వ తేదీ వరకు ఆశావహులతో మాట్లాడిన అనంతరం కేంద్ర ఎన్నికల కమిటీ ఆమోదం తెలిపిన జాబితాలోని పేర్ల నుంచే తొలి జాబితాలో ఏడుగురిని ప్రకటించారు. ఖానాపూర్‌ సీటును ఇటీవల టీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లో చేరిన రాథోడ్‌ రమేష్‌కు ఖరారు చేసినప్పటికీ, టికెట్టు ఆశిస్తున్న హరినాయక్‌ వర్గం గాంధీభవన్‌ వద్ద రెండు రోజుల పాటు నిర్వహించిన ధర్నాలతో నిలిచిపోయినట్లు సమాచారం. బోథ్‌లో ఆదివాసీ, లంబాడా వర్గాల సమీకరణల నేపథ్యంలో సోయం బాపూరావుకు టికెట్టు ఇవ్వాలని స్క్రీనింగ్‌ కమిటీ సూచించినప్పటికీ, డీసీసీ అధ్యక్షుడు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఒత్తిడితో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అడ్డుపడడంతో నిలిచిపోయింది. ఇక్కడ మహేశ్వర్‌రెడ్డి అనిల్‌ జాదవ్‌కు సీటివ్వాలని అధిష్టానాన్ని కోరుతున్నారు. దీంతో ఈ రెండు సీట్లపై పునరాలోచనలో పడ్డ అధిష్టానం రాజకీయ సమీకరణాలను బేరీజు వేసుకొని తుది జాబితాలో అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. 

మంచిర్యాలలో రెబల్‌గా అరవింద్‌రెడ్డి
మంచిర్యాల నియోజకవర్గం సీటు కోసం మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావుతో పోటీపడ్డ మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవింద్‌రెడ్డికి నిరాశే ఎదురైంది. ప్రేమ్‌సాగర్‌రావు పేరును ఈనెల 8వ తేదీనే ఖరారు చేసినప్పటికీ, అరవింద్‌రెడ్డి ఢిల్లీలోనే ఉండి తనవంతు ప్రయత్నాలు కొనసాగించారు. అయితే కేంద్ర ఎన్నికల కమిటీ ఆమోదం పొందిన ప్రేమ్‌సాగర్‌రావు పేరును మార్చలేదు. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన ఆయన పార్టీ అధిష్టానం నిర్ణయాన్ని తప్పుపట్టారు. కాంగ్రెస్‌ పార్టీ మంచిర్యాల అసెంబ్లీ సీటును వేలం వేసిందని ఢిల్లీలో ఆరోపించారు. తాను బీజేపీ తరుపున గానీ, బీఎస్పీ నుంచి గానీ పోటీలో నిలువనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు గురువారం ఆయన తొలుత ఇండిపెండెంట్‌గా నామినేషన్‌ దాఖలు చేసే అవకాశం ఉంది. 
ఆదిలాబాద్‌లో రామచంద్రారెడ్డి వర్గం అసంతృప్తి

మంత్రిగా, ఎమ్మెల్యేగా ఆదిలాబాద్‌లో కాంగ్రెస్‌కు పెద్ద దిక్కుగా ఉన్న మాజీ మంత్రి సి.రామచంద్రారెడ్డికి సీటు రాలేదు. దీంతో ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇక్కడ మహిళా నాయకురాలు గండ్రత్‌ సుజాతకు టికెట్టు లభించడాన్ని సీఆర్‌ఆర్‌ వర్గం వ్యతిరేకిస్తోంది. ఢిల్లీలో టికెట్టు కోసం చివరివరకు ప్రయత్నాలు చేసిన రామచంద్రారెడ్డి మంగళవారం వరకు ఆదిలాబాద్‌ రాలేదు. బుధవారం ఆయన వచ్చిన తరువాత తదుపరి కార్యాచరణ రూపొందించాలనే ఆలోచనతో ఉన్నట్లు సమాచారం. కాగా రామచంద్రారెడ్డి కాంగ్రెస్‌ రెబల్‌గా పోటీ చేసే అవకాశాలున్నాయని సమాచారం.
 
రేవంత్‌రెడ్డి బ్యాచ్‌కు రిక్తహస్తం
తెలుగుదేశం పార్టీ నుంచి రేవంత్‌రెడ్డితో పాటు కాంగ్రెస్‌లో చేరిన నేతలకు మొండిచెయ్యి ఎదురైంది. చెన్నూరు సీటును ఆశించిన మాజీ మంత్రి బోడ జనార్దన్‌ టికెట్టు కోసం పోటీపడ్డప్పటికీ, ఏఐసీసీ స్థాయిలో లాబీయింగ్‌ చేసిన బోర్లకుంట వెంకటేష్‌ నేత ఎత్తుల ముందు నిలబడలేకపోయారు. రేవంత్‌రెడ్డి తన గ్రూపులో జనార్దన్‌ కోసం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. గ్రూప్‌–1 అధికారిగా పలు శాఖల్లో సేవలు అందించి రాజీనామా చేసి కాంగ్రెస్‌ పార్టీలో చేరిన వెంకటేష్‌ నేతకే టికెట్టు వరించింది. బోడ జనార్దన్‌కు వీలైతే వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో పెద్దపల్లి లోక్‌సభ నుంచి అవకాశం కల్పిస్తామని అధిష్టానం నుంచి హామీ లభించినట్లు సమాచారం.

  •   సిర్పూరు నుంచి రావి శ్రీనివాస్‌ కూడా టీడీపీ నుంచి రేవంత్‌తో పాటే కాంగ్రెస్‌లో చేరారు. శ్రీనివాస్‌ కాంగ్రెస్‌లో చేరినప్పుడు సీటు ఆయనకే అనే వాతావరణం ఉండేది. అయితే రేవంత్‌రెడ్డికి పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో ఏర్పడ్డ విభేదాల నేపథ్యంలో డీసీసీ అధ్యక్షుడు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి సిర్పూరులో పాల్వాయి హరీష్‌బాబును తెరపైకి తీసుకొచ్చారు. ఇండిపెండెంట్‌గా పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్న హరీష్‌ను అసెంబ్లీ రద్దు తరువాత మహేశ్వర్‌రెడ్డి కాంగ్రెస్‌లోకి తీసుకొచ్చారు. స్థానికంగా నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో హరీష్‌బాబు బలమైన అభ్యర్థిగా మారడంతో టికెట్టు ఆయనకే లభించింది.
  •  సోయం బాపూరావు సైతం రేవంత్‌రెడ్డి వర్గంగా ఆయనతో కలిసి కాంగ్రెస్‌లో చేరగా, ఇక్కడ మహేశ్వర్‌రెడ్డి అనుయాయుడుగా ఉన్న అనిల్‌ జాదవ్‌ కోసం జానారెడ్డి వంటి సీనియర్లు సైతం జోక్యం చేసుకోవలసి వచ్చింది. అనిల్‌ జాదవ్‌ లంబాడా వర్గానికి చెందిన నాయకుడు కావడంతో ఆ వర్గాన్ని విస్మరిస్తే నల్గొండ, మహబూబ్‌నగర్‌ వంటి జిల్లాలో ఇబ్బంది ఎదురవుతుందని జానారెడ్డి అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. సమీకరణలు బేరీజు వేసుకొని సోయం బాపూరావు, అనిల్‌ జాదవ్‌లలో ఎవరికైనా సీటు ఇచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెపుతున్నాయి. ఏదేమైనా రేవంత్‌రెడ్డితో పాటు కాంగ్రెస్‌లో చేరిన ఉమ్మడి జిల్లాలోని ముగ్గురు నేతలకు అవకాశం రాకపోవడం చర్చనీయాంశమైంది.  
మరిన్ని వార్తలు