మా కొడుకు జాడ చెప్పండి

14 Aug, 2019 09:56 IST|Sakshi

సాక్షి, పెద్దపల్లి : జిల్లా విద్యాశాఖలోని సర్వశిక్ష అభియాన్‌ విభాగంలో డివిజినల్‌ లెవల్‌ మానిటరింగ్‌ టీం మెంబర్‌ (డీఎంఎల్‌టీ)గా పనిచేస్తున్న ఎలగందుల రమేశ్‌ అదృశ్యం మిస్టరీ ఇంకా వీడలేదు. లేఖ రాసి గత శనివారం నుంచి ఆచూకీ లేకుండా పోయిన అతని ఉదంతం ప్రస్తుతం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. రమేశ్‌ జాడ తెలియక కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. తమకొడుకు ఆచూకీ చెప్పాలంటూ జిల్లా విద్యాశాఖ కార్యాలయం ఎదుట కుటుంబ సభ్యులు రమేశ్‌ చిత్రపటాలతో  మంగళవారం ఆందోళనకు దిగారు. తమ కుమారుడు కనిపించకుండా పోవడానికి కారణమైన జీసీడీవో పద్మను వెంటనే సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. తమ కుమారుని ఆచూకీ దొరికే వరకు కదిలేది లేదని కార్యాలయం ఎదుట భీష్మించుకు కూర్చున్నారు. 

బాధ్యులను సస్పెండ్‌ చేయాలి.. 
తనకు రావాల్సిన సెక్టోరల్‌ అధికారి పోస్టును ఇతరులకు ఇప్పించడంతో మనస్థాపానికి గురైన ఎలగందుల రమేశ్‌ నాలుగు రోజుల క్రితం అదృశ్యమయ్యాడు. తన చావుకు కారణం జీసీడీవో పద్మ పేరును ప్రస్తావిస్తూ లేఖను రాసిన విషయం విధితమే. కుటుంబ సభ్యులకు బీజేపీ, కాంగ్రెస్‌ నాయకులు మద్దతుగా నిలిచారు. రమేశ్‌కు న్యాయం జరిగే వరకు ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. అనంతరం డీఈవో జగన్మోహన్‌రెడ్డికి వినతిపత్రాన్ని సమర్పించి జీసీడీవో పద్మను వెంటనే సస్పెండ్‌ చేసి విచారణ జరిపించాలని కోరారు. స్పందించిన డీఈవో ఉన్నతాధికారుల దృష్టికి విషయాన్ని తీసుకువెళ్తానని చెప్పడంతో ఆందోళన విరమించారు.  

కలిచివేసిన కన్నీళ్లు.. 
రమేశ్‌ ఆచూకీ కోసం డీఈవో కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టిన కుటుంబ సభ్యులు కన్నీటి పర్యాంతమయ్యారు. రమేశ్‌ తల్లి మధునమ్మ తన కొడుకును క్షేమంగా తనకు అప్పగించాలని గుండెలవిసేలా రోధించింది. తాము పేదవాళ్లమని, అందుకే పోలీసులు, అధికారులు తమ కొడుకు కనిపించకుండా పోయినా పెద్దగా పట్టించుకోవడం లేదని  క్షేమంగా వస్తే చాలని వేడుకుంది. రమేశ్‌ తమ్ముడు, చెల్లె, బంధువులు సైతం కన్నీళ్లు పెట్టుకున్నారు.   

మరిన్ని వార్తలు