సర్వతో 'ఛి'ద్రాలయం

25 Apr, 2018 03:10 IST|Sakshi
ఆలయం చుట్టూ ఉన్న అఖండరాయిని బ్లాస్టింగ్‌తో తొలగిస్తున్న దృశ్యం

కనుమరుగవుతున్న భూపాలపల్లి నయన్‌పాక మందిరం ప్రత్యేకత

అభివృద్ధి పేరుతో దేవాదాయ శాఖ ధ్వంసరచన

పురావస్తు శాఖ పర్యవేక్షణ లేకుండా అడ్డగోలు వ్యవహారం

అలనాటి శిఖరాన్నే తొలగించేందుకు ప్రణాళిక

మూలవిరాట్టుతో అనుసంధానమైన అఖండరాయి పేల్చి తొలగింపు!

ఆలయం నాలుగు ద్వారాలు మూసుకుపోయేలా ప్రాకార మండపం

సాక్షి, హైదరాబాద్‌: చుట్టూ భారీ బండరాయి.. దానిపై భారీ శిఖరంతో ఆలయం.. నాలుగు వైపులా నాలుగు ద్వారాలు.. ఒక్కో ద్వారం నుంచి వెళ్తే ఒక్కో రూపంలో స్వామి దర్శనం.. తూర్పు వైపు లక్ష్మీ నరసింహుడు, పశ్చిమాన నాగలి ధరించిన బలరాముడు, దక్షిణాన వేణుగోపాల స్వామి, ఉత్తరాన సీతారామలక్ష్మణులు.. చుట్టూ విస్తరించిన బండరాయి మధ్య భాగాన్నే విగ్రహంగా మలిచారు నాటి శిల్పులు..  

వందల ఏళ్లనాటి ఈ అరుదైన కట్టడం ఇప్పుడు ప్రమాదంలో పడింది. దాని ప్రత్యేకత, గొప్పతనంపై అవగాహన లేని దేవాదాయ శాఖ.. అభివృద్ధి పేరుతో ధ్వంసరచన మొదలుపెట్టింది. వెలకట్టలేని ఆ నిర్మాణాలను అపురూపంగా మరమ్మతు చేయాల్సింది పోయి, నిర్మాణ ప్రత్యేకతలు నాశనమయ్యేలా అడ్డగోలు వ్యవహారాన్ని తెరపైకి తెచ్చింది. భూపాలపల్లి జిల్లా నయన్‌పాకలో సర్వతోభద్ర నమూనాలో నిర్మితమైన ఆలయ దీన గాథ ఇది. 

‘సాక్షి’ కథనంతో.. 
బాహ్య ప్రపంచానికి పెద్దగా తెలియని ఈ ఆలయంపై గతేడాది నవంబర్‌లో ‘సాక్షి’ప్రత్యేక కథనం ప్రచురించింది. పురావస్తు శాఖ విశ్రాంత అధికారి రంగాచార్యులుతో కలసి అమెరికా ప్రొఫెసర్‌ వ్యాగనార్‌ ఈ ఆలయాన్ని సందర్శించి నిర్మాణ రహస్యాలను వెలుగులోకి తేవడాన్ని ఉటంకిస్తూ కథనం సాగింది. ఆలయాన్ని చూసి మంత్రముగ్ధుడైన వ్యాగనార్‌.. ఇది అత్యంత అరుదైన అద్భుత నిర్మాణంగా పేర్కొన్నారు. దీనికి అలనాటి పద్ధతిలోనే మరమ్మతు చేసి భావితరాలకు అందించాలని సూచించారు. దీంతో స్పందించిన స్పీకర్‌ మ ధుసూదనాచారి.. ఆలయ పురోభివృద్ధికి నిధులు మంజూరు చేయించారు. అయితే ఆలయాన్ని మరమ్మతు చేసి భావితరాలకు అందిం చాల్సింది పోయి ఆ ప్రత్యేకతల్నే నాశనం చేసేలా ప్రణాళికలు రూపొందించి పనులు మొదలుపెట్టారు అధికారులు. 

నిబంధనలు పక్కనబెట్టి.. 
పురాతన కట్టడాల మరమ్మతు, పునరుద్ధరణకు ప్రత్యేక నిబంధనలున్నాయి. అప్పట్లో పెద్ద రాళ్లు, ఇటుకలు, డంగు సున్నం, కరక్కాయ, నల్లబెల్లం, గుడ్డు సొన, రాతిపొడి మిశ్రమంతో నిర్మాణాలు చేపట్టారు. కాబట్టి వాటికి మరమ్మతును ఆ మిశ్రమంతోనే పూర్తి చేయాలి. చార్మి నార్, వేయిస్తంభాల గుడి, రామప్ప దేవాలయం సహా ఏ చిన్న నిర్మాణాలైనా ఇదే నిబంధన. కట్టడం నిర్మాణ విశిష్టత దెబ్బతినకుండా, పురావస్తు శాఖ నిపుణుల పర్యవేక్షణలోనే పనులు జరగాలి. కానీ ఇక్కడ పూర్తి విరుద్ధంగా పనులు జరుగుతున్నాయి. ఆలయాన్ని అప్పగించాలని ఏఎస్‌ఐ కోరుతున్నందున నిధులు దానికి మళ్లించి పనులు చేయించాలని చరిత్రకారులు కోరుతున్నారు. 

ఆలయ గోపురాన్ని 15.2 అడుగుల ఎత్తు భారీ రాయితో, ఆ పైన 30 అడుగుల ఎత్తు పెద్దపెద్ద ఇటుకలతో నిర్మించారు. కొంతభాగం తప్ప మిగతా ఇటుక నిర్మాణం ఇప్పటికీ పటిష్టంగా ఉంది. ఇప్పుడు ఆ రాతి నిర్మాణం వరకు ఉంచి, పైన ఉన్న ఇటుక నిర్మాణాన్ని తొలగించబోతున్నారు. కానీ నాటి ఇటుక నిర్మాణాన్ని ధ్వంసం చేయకుండా దెబ్బతిన్న భాగాన్ని ఆ నమూనా ఇటుకలు రూపొందించి అప్పట్లో వాడిన మిశ్రమంతో మరమ్మతు చేయాలి. 

ఏం చేస్తున్నారు? 
దేవాలయానికి నాలుగు వైపులా 25 అడుగుల వెడల్పుతో ప్రాకార మండపాలు నిర్మించనున్నారు. అయితే నాటి ఆలయ భాగం మూసుకుపోయేలా, దాన్ని ఆనుకుని కొత్త నిర్మాణం చేపట్టరాదు. ఇప్పటి నిర్మాణాలు సిమెంటుతో చేపడతారు కాబట్టి ఆలయ ప్రత్యేకత కోల్పోయే అవకాశం ఉంది.  

ఆలయం చుట్టూ ప్రహరీ గోడ నిర్మించనున్నారు. ఇందుకు జిల్లా నిధులు రూ.13 లక్షలు ఖర్చు చేయనున్నారు. అయితే ఆలయానికి సంబంధించి రెండున్నర ఎకరాల భూమి వరకు గోడ నిర్మించాల్సి ఉండగా, దాన్ని తగ్గించి ఆలయానికి చేరువగా నిర్మించాలని యోచిస్తున్నారు. దేవాలయానికి చేరువగా భారీ కమ్యూనిటీ హాలు కూడా నిర్మించనున్నారు. ఇందుకు సింగరేణి సంస్థ రూ.75 లక్షలు వెచ్చించనుంది. 

మండపం ఫ్లోరింగుపై పూర్తిగా టైల్స్‌ అమర్చనున్నారు. ఇందుకోసం బ్లాస్టింగ్‌ చేస్తూ రాయిని పగులగొడుతున్నారు. కానీ ఇక్కడే ఈ ఆలయ ప్రత్యేకత ఉంది. చుట్టూ విస్తరించిన భారీ అఖండ రాయిపైనే ఆలయం నిర్మించారు. మధ్యలో నాలుగున్నర అడుగుల ఎత్తుతో ఆ గుట్ట రాతి భాగాన్నే విగ్రహాలుగా మలిచారు. ఆలయం చుట్టూ ఉన్న రాయిని తొలగించి టైల్స్‌ వేస్తే ఆలయం అసలు ప్రత్యేకత నాశనం అయ్యే అవకాశం ఉంది. బ్లాస్టింగ్‌ వల్ల ఆలయ ఉనికికి ప్రమాదం పొంచి ఉంది. ఈ మరమ్మతులకు దేవాదాయ శాఖ రూ.2 కోట్లు వెచ్చిస్తోంది. 

మరిన్ని వార్తలు