ఆశ నిరాశ బడ్జెట్

11 Jul, 2014 01:12 IST|Sakshi
ఆశ నిరాశ బడ్జెట్

కొన్ని మెరుపులు.. ఇంకొన్ని పెదవి విరుపులు.. ఇదీ అరుణ్‌జైట్లీ బడ్జెట్‌పై నగరవాసుల స్పందన. ఆదాయ పన్ను పరిమితి వేతన జీవుల్లో కొందరికి ఊరటనివ్వగా, ఇంకొందరిని ఉస్సూరుమనిపించింది. రూ.2 లక్షలలోపు గృహ రుణాలపై పన్ను మినహాయింపు, సిమెంటు, స్టీలు ధరల తగ్గింపుతో మధ్యతరగతి, అల్పాదాయ వర్గాలను సొంతింటి నిర్మాణం వైపు దృష్టిసారించేలా చేసింది.
 
సాక్షి, సిటీబ్యూరో: పెరిగిన ధరలతో ఇంటి బడ్జెట్ తల్లకిందులైన నగరవాసికి సబ్బులు, వంట నూనెల ధరలు కాస్త దిగిరానుండడం స్వల్ప ఉపశమనం కలిగించింది. పాదరక్షలు, బ్రాండెడ్ దుస్తుల ధరలు దిగిరావడం షాపింగ్ ప్రియులైన సిటీజన్లకు పండగే. బర్గర్‌లు, పిజ్జాలు, బేకరీ ఉత్పత్తులపై సుంకం తగ్గడంతో వెరైటీ రుచులు ఆస్వాదించే ‘భాగ్యం’ దక్కనుంది. స్మార్ట్‌ఫోన్లు, సెల్‌ఫోన్ల ధరలు స్వల్పంగా పెరగడం నెటిజన్లయిన మన గ్రేటర్ యూత్‌కు నిరాశే మిగిల్చింది. ఇక ఎల్‌సీడీ, ఎల్‌ఈడీ, సోలార్ కాంతులతో ఇళ్లను ధగదగలు చేసుకునేందుకు మక్కువ చూపే ఎగుమ మధ్యతరగతి వర్గం ఆశలు ఈ ఏడాది నెరవేరే అవకాశాలున్నాయి. వంట పాత్రల ధరలు తగ్గుముఖం పట్టనుండడం గృహిణులకు ఉపశమనం కల్పించింది. సిగరెట్లు, పొగాకు ఉత్పత్తుల ధరల పెంపు జేబులు గుల్ల చేయనుంది. తాజా బడ్జెట్ గ్రేటర్ వాసిపై చూపనున్న ప్రభావంపై ‘సాక్షి’ ఫోకస్..
 
‘రేడియో క్యాబ్’కు రెక్కలు

రేడియో క్యాబ్ ప్రయాణంపై సేవా పన్ను రూపంలో భారం మోపారు. ప్రస్తుతం గ్రేటర్‌లో హైటెక్‌సిటీ, ఐటీ  కారిడార్‌లతో పాటు, శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్ర యానికి రోజూ 2 లక్షల మంది ప్రయాణిస్తారు. సాఫ్ట్‌వేర్ నిపుణులు, ఐటీ ఉద్యోగులు, వ్యాపార వర్గాలు  విరివిగా వినియోగించే రేడియో క్యాబ్‌లపైన కిలోమీటర్‌కు రూ.2 నుంచి రూ.3 చొప్పున సేవా పన్ను విధించారు. ఈ క్రమంలో చార్జీలు పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం 2 కిలోమీటర్లకు కనీస చార్జీ రూ.40, ఆపై ప్రతి కిలోమీటర్‌కు రూ.21 చొప్పున క్యాబ్ చార్జీలు ఉన్నాయి. రాత్రి వేళల్లో ఈ చార్జీల పై రూ.25 శాతం అదనంగా వసూలు చేస్తారు. సర్వీసు ట్యాక్సీ వల్ల కనీస చార్జీ రూ.45కి, ఆపై ప్రతి కిలోమీటర్‌కు  రూ.25 చొప్పున పెరగొచ్చని క్యాబ్ నిర్వహణ సంస్థలు చెబుతున్నాయి. మరోవైపు ఈ పన్ను విధింపుపై క్యాబ్ నిర్వాహకులూ పెదవి విరుస్తున్నారు. ప్రయాణికుల నుంచి విముఖత వచ్చే అవకాశం ఉందని, ఇది తమ ఉపాధిపై ప్రభావం చూపుతుందని అంటున్నారు.
 
మిడిల్‌క్లాస్‌కు ఓకే..
బడ్జెట్‌లో మహిళలకు ఒరిగిందేమీ లేదు. దిగుమతి వస్తువులు, రెస్టారెంట్స్ ఖరీదుగా మారనున్నాయి. విలాస వస్తువులు ధరలూ పెరగనున్నాయి. ఇవన్నీ సంపన్నులకు భారమైనా భరించగలరు. మరోవైపు జ్యువెలరీ, ఫుట్‌వేర్ ధరలు తగ్గనున్నాయి. ఇది మిడిల్‌క్లాస్‌కి మేలు చేసేదే. రూరల్ యూత్‌కి స్టార్టప్స్‌కి ఎంకరేజింగ్‌గా ఉంది. వ్యవసాయంపై మరింత దృష్టి పెట్టాల్సింది. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పరిశ్రమకు రూ.37 వేల కోట్ల కేటాయింపు మంచి పరిణామం.          
- పార్వతీరెడ్డి, ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్, నార్ ఇన్‌ఫ్రా
 
ఏపీ,టీజీలపై కేంద్రం వివక్ష

ఇది పూర్తిగా ధరలు పెంచే బడ్జెట్. పెట్రోలియం ఉత్పత్తులపై ప్రభుత్వ సబ్సిడీని తగ్గించి, పరోక్షంగా ధరల పెరుగుదలకు కారణమైంది. ప్రభుత్వ వ్యయాన్ని పూర్తిగా నియంత్రిస్తామన్నారు. ఈ నిర్ణయం ధరల పెరుగుదలకు కారణమవుతుంది. మధ్య తరగతి ప్రజలు ఆశించిన స్థాయిలో పన్నులకు సంబంధించి ఆదాయ పరిమితిని పెంచలేదు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు బడ్జెట్‌లో ప్రాధాన్యంఇవ్వలేదు. సాధారణ ఇన్‌స్టిట్యూట్‌లు మినహా కొత్త కేటాయింపుల్లేవు.

రెండు తెలుగు రాష్ట్రాల పైనా కేంద్రం వివక్ష చూపింది. రక్షణ, బీమా, మైనింగ్, రైల్వే వంటి కీలక రంగాల్లోకి విదేశీ పెట్టుబడులను ఆహ్వానించడం వల్ల భవిష్యత్తులో దేశ సార్వభౌమాధికారం దెబ్బతినే ప్రమాదం ఉంది. ధరల స్థిరీకరణ నిధికి ఆశించిన స్థాయిలో నిధులు కేటాయించ లేదు. రూ.150 కోట్లతో మహిళలకు భద్రత ఎలా కల్పిస్తారో అర్థం కావడం లే దు. ఓ వైపు వ్యవసాయానికి పెద ్దపీట వేస్తామని చెబుతూనే మరోవైపు నీటి పారుదల రంగాన్ని పూర్తిగా విస్మరించారు. ఇది ఏదో రకంగా ధరల పెరుగుదలకు కారణమవుతుంది. పారిశ్రామిక వృద్ధి రేటు పెరగాలంటే ప్రజల కొనుగోలు శక్తి పెరగాలి. ఆ దిశగా ఉపాధి అవకాశాలు కల్పించాలి.
 - ప్రొఫెసర్ నాగేశ్వర్, ఎమ్మెల్సీ
 
విదేశీ పెట్టుబడులను ఆకర్షించే విధంగా ఉంది
మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్ అల్పాదాయ వర్గాల ఆర్థిక పరిస్థితిని మెరుగు పర్చేవిధంగా లేదు. ద్ర వ్యోల్బణాన్ని నియంత్రించే కోణంలో లేదు. బడ్జెట్ కేటాయింపులు వివిధ రంగాలకు అనుకున్నంత మేరకు లేవు.  ప్రజలు తమ ఆదాయంలో ఎక్కువ భాగం నిత్యవసరాలు, విద్య, వైద్యం కోసం ఖర్చు చేస్తున్నారు. ఈ ఖర్చులు తగ్గించే చర్యలు తీసుకోకుండా సబ్బుల ధరలు తగ్గించడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. ప్రాధాన్య రంగాలను ఇది పూర్తిగా నిరుత్సాహ పరించింది. విదేశీ పెట్టుబడులను ఆకర్షించే విధంగా ఈ బడ్జెట్ ఉంది.
 - యనగందుల మురళీధర్‌రావు, హెచ్‌ఓడీ, ఎకనామిక్స్, ఓయూ
 

మరిన్ని వార్తలు