ఆపద్బంధులా డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ వింగ్‌

28 Sep, 2019 10:52 IST|Sakshi

గ్రేటర్‌లో ప్రశంసలందుకుంటున్న డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ వింగ్‌  

ఆరేళ్ల క్రితం ఏర్పాటు

సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్‌ఎంసీలోని డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ వింగ్‌ పలు విపత్తుల సమయాల్లో అందించిన సేవలతో ప్రజలను పలు ఆపదల నుంచి కాపాడటంతో రాష్ట్రంలోని మిగతా కార్పొరేషన్లలోనూ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ వింగ్‌లను ఏర్పాటు చేస్తామని మునిసిపల్‌ మంత్రి కేటీఆర్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ డిజాస్టర్‌ మేనేజ్‌ మెంట్‌ వింగ్‌ అంటే ఏంటి? దాని పనితీరు ఎలా ఉంటుంది? అనే అంశాలపై ప్రత్యేక కథనం.  

ఆరేళ్ల క్రితం జీహెచ్‌ఎంసీలో ఏర్పాటు
జీహెచ్‌ఎంసీలో దాదాపు ఆర్నెళ్ల క్రితం ఏర్పాటైన విజిలెన్స్‌ విభాగం వర్షాలతో రోడ్లు చెరువులుగా మారినా, నీళ్లలో ఎవరైనా కొట్టుకుపోతున్నా, అగ్నిప్రమాదాలు సంభవించినా భవనాలు కూలినా, చెట్లకొమ్మలు విరిగి రోడ్డుకు అడ్డంగా పడ్డా  తక్షణం అక్కడకు చేరుకొని సహాయకచర్యలు చేపడుతుంది. ఈ వింగ్‌లో ఉండే వారిని డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ రెస్పాన్స్‌ ఫోర్స్‌(డీఆర్‌ఎఫ్‌)గా వ్యవహరిస్తారు. ఒక్కో బృందానికి ప్రత్యేకమైన వాహనంతోపాటు డ్రైవర్‌తో సహ ఐదుగురు, ఆరుగురు  ఉంటారు. విపత్తుల సమయాల్లో ఆదుకునేందుకు అవసరమైన ఉపకరణాలు, లైఫ్‌సేవింగ్‌ జాకెట్లు తదితర సరంజామా అన్నీ వాహనంలోనే ఉంటాయి. తొలుత రెండు వాహనాలతో ప్రారంభమైన ఈ విభాగంలో  ప్రస్తుతం 13 ఫోర్స్‌లున్నాయి. మూడుషిప్టుల్లో వెరసి మొత్తం 39 లొకేషన్లలో విధుల్లో  ఉంటాయి. ప్రస్తుతం వర్షాకాలమైనందున నగరంలో లోతట్టు ప్రాంతాలు, వానలొస్తే ప్రమాద భరితంగా మారనున్న  వల్నరబుల్‌ ప్రాంతాల జాబితా ఈ విభాగం వద్ద ఉంది. ఎప్పటికప్పుడు వాతావరణ శాఖ సూచనల్ని, ఆన్‌లైన్‌లో మేఘాల కదలికల్ని, వర్షం వచ్చే సూచనల్ని బట్టి  ఎక్కువ వర్షం పడనున్న ప్రాంతాల్లో ఎంపిక చేసిన చోట్ల ఈ బృందాలు సిద్ధంగా ఉంటాయి.

ప్రస్తుత అవసరాల్ని గుర్తించి నడవడానికి వీల్లేని ప్రాంతాల్లో ప్రజలను ఇళ్లకు, ప్రధాన రోడ్లమీదకు చేర్చడానికి రెండు చిన్న బోట్లను కూడా సమకూర్చుకుంది.   ఈ విభాగం డైరెక్టరేట్‌లోని కమాండ్‌ కంట్రోల్‌సెంటర్‌లో నగరంలోని సీసీ కెమెరాల ద్వారా ఏప్రాంతంలో ఎలాంటి పరిస్థితులున్నాయో కూడా పరిశీలిస్తారు.  విపత్తు సంభవించినప్పుడు తక్షణం అక్కడకు చేరుకొని  ఈ బృందాలు విపత్తునుంచి ప్రజలను రక్షిస్తాయి. డయల్‌ 100, జీహెచ్‌ఎంసీ కాల్‌సెంటర్‌ నెంబర్‌ 040–21111111ల ద్వారా అందే ఫిర్యాదులతోపాటు  ట్విట్టర్‌ తదితర మాధ్యమాల ద్వారా అందే సమాచారంతోనూ ఈ బృందాలు వెంటనే అక్కడకు చేరుకొని సేవల్లో నిమగ్నమవుతాయి. మూడు షిఫ్టుల్లో 24 గంటల పాటు విధుల్లో ఉంటాయి.  ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో ఈ సంవత్సరం ఎగ్జిబిషన్‌ సందర్భంగా,  బషీర్‌బాగ్‌ తదితర ప్రాంతాల్లో అగ్నిప్రమాదాలు జరిగినప్పుడు,  ఎల్‌బీ స్టేడియంలో ఫ్లడ్‌లైట్స్‌ టవర్‌ కూలినప్పుడు ఈ వింగ్‌ తక్షణం అందించిన సేవల్ని పలువురు ప్రశంసించారు.  విపత్తులు సంభవించాక చేపట్టే చర్యలతో పాటు విపత్తులు జరగకుండా నివారణ చర్యలు సైతం తీసుకుంటోంది. 

ఎప్పటికప్పుడు ప్రత్యేక చర్యలు
నిబంధనలకు విరుద్ధంగా, ప్రమాదకరంగా ఉన్న బార్లు,పబ్‌లను గుర్తించి  దాదాపు 20 బార్లు,పబ్‌లను సీజ్‌ చేసింది. హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు గుర్తించిన 27 క్రిటికల్‌ వాటర్‌ లాగింగ్‌ ఏరియాలు, 16 మేజర్‌ లాగింగ్‌ ఏరియాల జాబితాతో పాటు ఇతరత్రా సమాచారంతో ప్రమాదాలకు ఆస్కారమున్న ప్రాంతాల్ని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ అవసరమైన చర్యలు చేపడుతుంది. 

మేఘాల కదలికలను బట్టి ..
ఆకాశంలో మేఘాల కదలికల్నిబట్టి భూమ్మీద ఈ ఫోర్స్‌ సిద్ధంగా ఉండేలా దీని డైరెక్టర్‌ విశ్వజిత్‌ కాంపాటి తగిన శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. వర్షంతో రోడ్లపై నిల్వనీరు చేరితే వెంటనే తోడి  ఇబ్బందులు లేకుండా చేస్తారు.  విపత్తులులేని సమయంలో గోతుల్లో పడ్డ, చెట్లపై ఇరుక్కుపోయిన  పశుపక్షాదులను సైతం ఈ వింగ్‌  కాపాడుతుండటం నగర ప్రజలకు తెలుసు.  ఈవింగ్‌ పనితీరుకు మెచ్చిన మంత్రి కేటీఆర్‌ వింగ్‌  డైరెక్టర్‌ను ప్రశంసించడంతోపాటు ఇతర కార్పొరేషన్లలో ఏర్పాటుకు ఇక్కడి అనుభవాలను  వినియోగించాలని సూచించారు.

మరిన్ని వార్తలు