రిమోట్‌ నొక్కితే కరెంట్‌ వచ్చేస్తుంది!

31 Jul, 2017 01:15 IST|Sakshi
రిమోట్‌ నొక్కితే కరెంట్‌ వచ్చేస్తుంది!

కరెంట్‌ పోతే ఆటోమేటిక్‌గా మరో లైన్‌ నుంచి సరఫరా
జీహెచ్‌ఎంసీ, పారిశ్రామిక ప్రాంతాల్లో డిస్ట్రిబ్యూషన్‌ ఆటోమేషన్‌ ప్రాజెక్టు

డిస్కంల ఆటోమేషన్‌ ప్రాజెక్టుకు ప్రాథమిక అంచనాల మేరకు అయ్యే ఖర్చు  5,000 కోట్లు
జీహెచ్‌ఎంసీ పరిధిలో విద్యుత్‌ సరఫరా వ్యవస్థ సామర్థ్యం (మెగావాట్లలో)   3,000
గత వేసవిలో గరిష్ట విద్యుత్‌ డిమాండ్‌ (మెగావాట్లలో)  2,450

సాక్షి, హైదరాబాద్‌: సాంకేతిక సమస్యతో భాగ్యనగరంలోని ఓ ప్రాంతంలో కరెంట్‌ పోయింది.. విద్యుత్‌ సిబ్బంది వచ్చి మరమ్మతులు చేసేదాకా ఆ ప్రాంతంలో అంధకారమే! ఇకపై ఆ పరిస్థితి ఉండదు. రిమోట్‌ నొక్కితే చాలు.. 5 నిమిషాల్లోపే ప్రత్యామ్నాయ వ్యవస్థ ద్వారా కరెంట్‌ వచ్చేస్తుంది! ‘డిస్కంల ఆటోమేషన్‌’ప్రాజెక్టుతో ఇది సాధ్యం కాబోతోంది. హైదరాబాద్‌ మహానగర పాలక సంస్థ(జీహెచ్‌ఎంసీ)తోపాటు రాష్ట్రంలోని పారిశ్రామిక ప్రాంతాల్లో ఈ ప్రాజెక్టును చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఎక్కడైనా విద్యుత్‌ సరఫరాలో అంతరాయం కలిగితే విద్యుత్‌ సిబ్బంది క్షేత్రస్థాయికి చేరుకుని మరమ్మతులు చేసి సరఫరాను పునరుద్ధరించేందుకు గంటల సమయం పడుతోంది.

ఇలా సిబ్బంది ద్వారా(మాన్యువల్‌గా) మరమ్మతులు చేసే వరకు వేచి చూడకుండా... స్కాడా (సూపర్వైజరీ కంట్రోల్‌ అండ్‌ డాటా అక్విజిషన్‌) కార్యాలయం నుంచి రిమోట్‌ సాయంతో తక్షణమే సరఫరాను పునరుద్ధరించాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును చేపట్టబోతున్నారు. ప్రైవేటు డిస్కంల ద్వారా విద్యుత్‌ సరఫరా జరుగుతున్న ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, అహ్మదాబాద్‌ నగరాల్లో మాత్రమే ఇలాంటి ఆటోమేషన్‌ ప్రాజెక్టులను అమలు చేస్తున్నారు. ప్రభుత్వరంగంలో తొలిసారిగా ఈ సేవలను అమల్లోకి తెచ్చేందుకు దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ(టీఎస్‌ఎస్పీడీసీఎల్‌) కసరత్తు ప్రాంభించింది.

జీహెచ్‌ఎంసీతోపాటు రాష్ట్రంలోని పారిశ్రామిక ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా ఆటోమేషన్‌ ప్రాజెక్టు రూపకల్పనపై నివేదిక(డీపీఆర్‌) తయారు చేసే బాధ్యతను తాజాగా ఓ ప్రైవేటు కన్సల్టెన్సీకి అప్పగించింది. ఒక్క జీహెచ్‌ఎంసీ పరిధిలోనే ఈ ప్రాజెక్టు రూపకల్పనకు దాదాపు రూ.5 వేల కోట్ల ఖర్చు అవుతుందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో విద్యుత్‌ సరఫరా వ్యవస్థ సామర్థ్యం 3 వేల మెగావాట్లు కాగా.. గత వేసవిలో గరిష్ట విద్యుత్‌ డిమాండ్‌ 2,450 మెగావాట్లుగా నమోదైంది. డిస్ట్రిబ్యూషన్‌ ఆటోమేషన్‌ ప్రాజెక్టు అమలు కోసం నగరంలో విద్యుత్‌ సరఫరా సామర్థ్యాన్ని 6 వేల మెగావాట్లకు పెంచనున్నారు.

ఇలా అమలు చేస్తారు..
డిస్ట్రిబ్యూషన్‌ ఆటోమేషన్‌ అమలు కోసం జీహెచ్‌ఎంసీతోపాటు రాష్ట్రంలోని పారిశ్రామిక ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా వ్యవస్థ సామర్థ్యాన్ని రెట్టింపు చేయనున్నారు. కరెంట్‌ వినియోగదారుడికి రెండు వనరుల నుంచి విద్యుత్‌ సరఫరా చేసేలా.. ప్రస్తుతమున్న 33 కేవీ, 11 కేవీ విద్యుత్‌ లైన్లు, డిస్ట్రిబ్యూషన్‌ ట్రాన్స్‌ఫార్మర్లు, సబ్‌స్టేషన్ల సామర్థ్యాన్ని రెట్టింపు చేయనున్నారు. రెండు లైన్ల నుంచి సరఫరాకు వీలుగా ప్రతి పోల్‌పై ఓ బాక్స్‌ ఏర్పాటు చేస్తారు. సరఫరాను ఓ లైన్‌ నుంచి మరో లైన్‌కు మార్చేందుకు ఈ బాక్స్‌లో సెక్షనలైజర్‌ అనే పరికరాన్ని అమరుస్తారు.

సాంకేతిక కారణాలతో ట్రాన్స్‌ఫార్మర్‌/సబ్‌స్టేషన్‌ నుంచి ఏదైనా లైన్‌కు విద్యుత్‌ సరఫరాలో అంతరాయం కలిగితే అదేలైన్‌ ద్వారా సరఫరాను పునరుద్ధరించేందుకు రెండుసార్లు టెస్ట్‌చార్జ్‌ చేస్తారు. ఒకవేళ సాధ్యం కాని పక్షంలో ప్రత్యామ్నాయ వనరుగా ఏర్పాటు చేసే ట్రాన్స్‌ఫార్మర్‌/సబ్‌ స్టేషన్‌ నుంచి మరో లైన్‌ ద్వారా 5 నిమిషాల్లోపు సరఫరాను పునరుద్ధరిస్తారు. రిమోట్‌ సాయంతో సెక్షనలైజర్‌కు సంకేతాలు పంపి రెండో లైన్‌ ద్వారా కరెంట్‌ సరఫరా చేస్తారు. క్షేత్రస్థాయిలో వెళ్లి మరమ్మత్తులు చేసే వరకు ఎదురుచూడకుండా హైదరాబాద్‌లోని ఎర్రగడ్డలోని స్కాడా కార్యాలయం నుంచి రిమోట్‌ సహాయంతో ఈ వ్యవస్థను నిర్వహించనున్నారు.

ప్రతిష్ట పెరుగుతుంది
సీఎండీ రఘుమారెడ్డి

ఈప్రాజెక్టు అమల్లోకొస్తే రాష్ట్రంలోని పారిశ్రామిక ప్రాంతాల ప్రతిష్ట పెరుగుతుందని టీఎస్‌ఎస్పీడీసీఎల్‌ సీఎండీ జి.రఘుమారెడ్డి తెలిపారు. సాంకేతిక కారణాలతో విద్యుత్‌ సరఫరాలో అంతరాయాలు కలిగితే విద్యుత్‌ అమ్మకాలు తగ్గి సంస్థ ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తోందన్నారు. డిస్ట్రిబ్యూషన్‌ ఆటోమేషన్‌ ప్రాజెక్టు అమల్లోకి వస్తే సాంకేతిక సమస్యలు ఎదురైనా నిరంతరాయంగా సరఫరా కొనసాగించవచ్చని, ఈ ప్రాజెక్టుపై పెట్టే ఖర్చు 4 ఏళ్లలో తిరిగి వస్తుందన్నారు. పారిశ్రామిక ప్రాంతాల్లో ఏడాదిన్నరలో ప్రాజెక్టును అమల్లోకి తెస్తామని చెప్పారు.

మరిన్ని వార్తలు