30న నివేదిక!

19 Nov, 2019 05:01 IST|Sakshi

ఈఆర్సీకి అందించనున్న డిస్కంలు

కొత్త టారిఫ్‌ లేకుండానే సమర్పణ

మున్సిపోల్స్‌ తర్వాత టారిఫ్‌ పెంపు ప్రతిపాదనలు

వచ్చే ఏడాది విద్యుత్‌ చార్జీల పెంపు కసరత్తు పూర్తి

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర విద్యుత్‌ పంపిణీ సంస్థ(డిస్కం)లు 2020–21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తమ వార్షిక ఆదాయ అవసరాల నివేదిక(ఏఆర్‌ఆర్‌)ను ఈ నెల 30న తెలంగాణ రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి(ఈఆర్సీ)కి సమర్పించనున్నాయి. ఏప్రిల్‌ 1 నుంచి రాష్ట్రంలో విద్యుత్‌ చార్జీలను పెంచాలని భావిస్తున్న నేపథ్యంలో కొత్త టారిఫ్‌ ప్రతిపాదనలను ఏఆర్‌ఆర్‌తోపాటు ఈఆర్సీకి సమర్పించడం లేదని దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ(టీఎస్‌ఎస్పీడీసీఎల్‌) అధికార వర్గాలు తెలిపాయి. సాధారణంగా ఏఆర్‌ఆర్‌ నివేదికతోపాటు టారిఫ్‌ పెంపు ప్రతిపాదనలపై అభ్యంతరాలు, సలహాలు స్వీకరించిన అనంతరం బహిరంగ విచారణ నిర్వహించి కొత్త విద్యుత్‌ టారిఫ్‌ను ఖరారు చేసేందుకు ఈఆర్సీకి కనీసం 120 రోజులు అవసరం కానుంది.

ఏటా నవంబర్‌ 30లోగా తదుపరి ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఏఆర్‌ఆర్‌ నివేదికతోపాటు టారిఫ్‌ ప్రతిపాదనలను డిస్కంలు ఈఆర్సీకి సమర్పించాలని టారిఫ్‌ నిబంధనలు పేర్కొంటున్నాయి. రాష్ట్రంలో మున్సిపల్‌ ఎన్నికలు జరగాల్సి ఉండటంతో వచ్చే ఏడాది టారిఫ్‌ పెంపు ప్రతిపాదనలు మినహా ఏఆర్‌ఆర్‌ నివేదికను మాత్రమే ఈఆర్సీకి సమర్పించాలని డిస్కంలు నిర్ణయించాయి. గృహ, వాణిజ్యం తదితర కేటగిరీల వారీగా పెంచాల్సిన విద్యుత్‌ చార్జీల ప్రతిపాదనలను మున్సిపల్‌ ఎన్నికలు ముగిసిన వెంటనే ఈఆర్సీకి అందజేయనున్నాయి.

యూనిట్‌పై రూ.1.66 నష్టం.. 
ఒక యూనిట్‌ విద్యుత్‌ సరఫరాకు 2018–19లో డిస్కంలు సగటున రూ. 6.91 ఖర్చు చేయగా, బిల్లుల వసూళ్ల ద్వారా సగటున రూ.5.25 మాత్రమే ఆదాయాన్ని ఆర్జించాయి. ప్రతి యూనిట్‌ విద్యుత్‌ సరఫరాపై సగటున రూ.1.66 నష్టపోయాయి. 2015–16లో యూనిట్‌ విద్యుత్‌పై రూ.0.95 ఉన్న ఆదాయలోటు 2016–17లో రూ.1.55కు, 2017–18లో రూ.1.42కు, 2018–19లో 1.66కు పెరిగింది. ఏటా 60 వేల మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ను రాష్ట్రానికి డిస్కంలు సరఫరా చేస్తున్నాయి. 2018– 19లో రూ.9970. 98 కోట్ల ఆర్థికలోటు ఎదుర్కోనున్నామని అప్పట్లో ఈఆర్సీకి ఇచ్చిన ఏఆర్‌ఆర్‌ నివేదికలో డిస్కంలు అంచనా వేశాయి.

విద్యుత్‌ చార్జీల పెంపుతో ఈ ఆదాయ లోటును భర్తీ చేసుకోవాలని డిస్కంలు భావించినా వరుస ఎన్నిక ల నేపథ్యంలో మూడేళ్లుగా విద్యుత్‌ చార్జీల పెంపునకు ప్రభుత్వం అనుమతించలేదు.  కాగా, ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా 2019–20 ముగిసే నాటికి ఆర్థికలోటు రూ.11 వేల కోట్లకు చేరనుందని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. ఈ ఏడాది బడ్జెట్‌లో కేటాయించిన రూ.6,079 కోట్లు విద్యుత్‌ రాయితీలకు పోగా రూ.5 వేల కోట్ల ఆర్థికలోటు మిగిలి ఉండనుంది. దీనిని భర్తీ చేసుకోవడానికి వచ్చే ఏడాది చార్జీల పెంపు తప్పదని అధికారులు అంటున్నారు. మున్సిపల్‌ ఎన్నికలు ముగిసిన వెంటనే చార్జీల పెంపు ప్రతిపాదనలపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా