జెడ్పీటీసీల్లో అసంతృప్తి

11 Feb, 2015 11:19 IST|Sakshi

ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా పరిషత్‌పై ఎమ్మెల్యేల ఆధిపత్యం విషయంలో అధికార పార్టీ జెడ్పీటీసీలు సైతం ప్రారంభం నుంచి అసంతృప్తితోనే ఉన్నారు. తాజాగా జిల్లా పరిషత్‌కు కేంద్రం నుంచి వచ్చిన నిధుల్లో కూడా ఎమ్మెల్యేలకు వాటా ఇవ్వడంపై జెడ్పీటీసీలు అంతర్గతంగా రగులుతున్నారు. ఇటీవల కేంద్రం 13వ ఆర్థిక సంఘం నిధులను జెడ్పీకి విడుదల చేసింది. సుమారు రూ.17 కోట్లు జిల్లాకు వచ్చాయి. అయితే ఇందులో ఒక్కో ఎమ్మెల్యేకు రూ.25 లక్షల చొప్పున కేటాయించాలని నిర్ణయించారు.

ఆదిలాబాద్ జెడ్పీ చైర్‌పర్సన్ శోభా సత్యనారాయణగౌడ్‌పై ఎమ్మెల్యేలు ఒత్తిడి తేవడంతో ఈ కేటాయింపులు తప్పలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. బుధవారం నిర్వహిస్తున్న జెడ్పీ సమావేశంలో ఈ నిధుల కేటాయింపులకు ఆమోద ముద్ర వేయాలని నిర్ణయించారు. అదేవిధంగా జెడ్పీ సమావేశంలో కూడా ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎక్కువ సమయం మాట్లాడుతుండటంతో తమ మండలాల్లోని సమస్యలను సమావేశం దృష్టికి తీసుకురాలేక పోతున్నామని చాలా మంది అసంతృప్తితో ఉన్నారు. ఈసారి ఒక్కరోజు జరిగే సమావేశంలో తమకు మాట్లాడే అవకాశం ఇవ్వాలనే అభిప్రాయం సభ్యుల నుంచి వ్యక్తమవుతోంది.

ఏ సమస్యలు చర్చకు వచ్చేనో..!
వేసవికి ముందే తాగునీటి కటకట.. గొంతులు తడవాలంటే కిలోమీటర్ల దూరం నడవాల్సిన దుస్థితి.. అర్హులకు అందని ఆహార భద్ర త కార్డులు.. పింఛన్ల కోసం లబ్ధిదారుల పాట్లు.. ఇలా జిల్లా వాసులు ప్రధాన సమస్యలతో సతమతమవుతున్నారు. ఈ నేపథ్యంలో జరగనున్న జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. 50కిపైగా ప్రభుత్వ శాఖల పనితీరుపై సమీక్ష నిర్వహించాలని ఎజెండాలో పొందుపరిచినా, ప్రధానంగా పొంచి ఉన్న తాగునీటి సమస్యపైనే సభ్యులు చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఆదిలాబాద్ జిల్లాలో వందకు పైగా నివాసిత ప్రాంతాల వాసులు ఇప్పటికీ తాగునీటి కోసం అనేక ఇబ్బందులు పడుతున్నారు. రూ.లక్షలు వెచ్చించి పలుచోట్ల నిర్మించిన తాగునీటి పథకాలు ఆసంపూర్తిగా నిలిచిపోయాయి. తాగునీటి ఇబ్బందులకు తాత్కాలికంగానైనా పరిష్కారం చూపాలంటే కనీసం కొత్తగా ఒక్క బోరు కూడా తవ్వించలేని పరిస్థితి. వేసవిలో నీటి సమస్య నెలకొన్న ప్రాంతాలకు ప్రత్యామ్నాయ నీటి వసతి కల్పించడంతో ఆర్‌డబ్ల్యూఎస్ (గ్రామీణ నీటి సరఫరా) విభాగం సంసిద్ధంగా లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇంకా కాంటిజెన్సీ యాక్షన్ ప్లాన్ జాడ లేదు. ఈ తరుణంలో తాగునీటి సమస్య తీవ్ర రూపం దాల్చితే తాము గ్రామాల్లోకి కూడా వెళ్లలేని పరిస్థితి ఉంటుందని సభ్యులు సమావేశంలో చర్చించేందుకు సిద్ధమవుతున్నారు.  గతంలో మాదిరిగా కాకుండా ఈసారి జెడ్పీ సమావేశం ఒక్క రోజుతోనే సరిపెట్టారు.

రైతుల సమస్యలపైనా..
సమావేశంలో రైతుల సమస్యలపై చర్చ జరిగే అవకాశాలున్నాయి. ముఖ్యంగా నెల రోజుల క్రితం కురిసిన అకాల వర్షాలకు కోతకొచ్చిన పంటలు దెబ్బతిన్నాయి. చేతికందే దశలో పంట దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయారు. స్టాండింగ్ క్రాప్ లేదనే కారణంగా రైతులు పంట నష్ట పరిహారానికి నోచుకోలేదు. అలాగే పత్తికి మద్దతు ధర అందలేదు. వీటన్నింటిపై సమావేశంలో చర్చించాల్సిన అవసరం ఉంది.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు