-

డామిట్‌ ‘కారు’ అడ్డం తిరిగింది

22 May, 2018 08:03 IST|Sakshi
నిందితుడు ఆకాశ్‌

నష్టాల కోసమే ఖరీదైన కార్ల వ్యాపారం  

లాస్‌ మేకింగ్‌ కంపెనీ నిర్వహణే ధ్యేయం  

కథ అడ్డం తిరగడంతో కంగుతిన్న ఆకాష్‌  

పోలీసులకు చిక్కిన ‘డిస్కౌంట్‌ స్కామ్‌’ నిందితుడు  

ఇదో వింత ‘క్రైమ్‌’ కథ. ఎవరైనా కోట్ల లాభాలు ఆర్జించాలని బిజినెస్‌ ప్రారంభిస్తారు. కానీ.. ఆకాష్‌ నష్టాల కోసమే వ్యాపారంలోకి దిగాడు. ఎందుకంటే.. లాస్‌ మేకింగ్‌ సంస్థను ‘నల్లధన అక్రమార్కుల’కు అధిక మొత్తానికి అమ్మేయాలని స్కెచ్‌ వేశాడు. ఇందుకు ఖరీదైన కార్ల వ్యాపారాన్ని ఎంచుకున్నాడు. కోట్లు విలువ చేసే లగ్జరీ కార్లను 70శాతం ధరలకే కస్టమర్లకు విక్రయించి, 30శాతం తానే భరించేవాడు. ‘డిస్కౌంట్‌ స్కామ్‌’కు తెరతీయడంతో కస్టమర్లు పెరిగిపోయి, విపరీతంగా డబ్బు వచ్చి పడింది. ఒక్కసారిగా నోట్లకట్టలను చూసిన ఆకాష్‌ జల్సాలకు అలవాటు పడ్డాడు. పబ్బులు, క్లబ్బులు, టూర్లంటూ తెగ ఎంజాయ్‌ చేశాడు. కానీ.. డామిట్‌ ‘కారు’ అడ్డం తిరిగింది! ఆకాష్‌ కటకటాల పాలయ్యాడు.  

సాక్షి,సిటీబ్యూరో : సాధారణంగా ఎవరైనా లాభాలు ఆర్జించడానికే వ్యాపారం చేస్తారు. డిస్కౌంట్‌లో ఖరీదైన కార్లు ఇస్తానంటూ భారీ స్కామ్‌కు పాల్పడిన ఆత్మకూరు ఆకాష్‌ మాత్రం నష్టాల కోసమే దందా ప్రారంభించాడు. తన సంస్థను లాస్‌ మేకింగ్‌ సంస్థగా మార్చేసి ‘అమ్మేయాలనే’ ఉద్దేశంతోనే కార్ల వ్యాపారం ప్రారంభించాడు. అసలే నష్టానికి కార్లు విక్రయించే ఇతడి చేతికి డబ్బు రాగానే జల్సాలకు అలవాటుపడ్డాడు. సీన్‌ కట్‌ చేస్తే కేవలం ఏడాదిలో దాదాపు 100 మందికి రూ.18 కోట్ల వరకు బకాయి పడ్డాడు. శుక్రవారం ఆకాష్‌ను అరెస్టు చేసిన బంజారాహిల్స్‌ పోలీసులు ఈ కేసును వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. అయితే పెద్దలతో ముడిపడి ఉన్న వ్యవహారం కావడంతో సొత్తు రికవరీ సవాల్‌గా మారింది.  

తండ్రి సంస్థను చేపట్టి... 
జహీరాబాద్‌కు చెందిన ఆకాష్‌ తండ్రి ఆర్కిటెక్ట్‌. వృత్తిలో భాగంగా  సిటీకి వలసవచ్చిన ఆయన స్పేస్‌ టైమ్‌ ఇంటీరియర్స్‌ పేరుతో సంస్థను ఏర్పాటు చేశారు. ఇంజినీరింగ్‌ విద్యను మధ్యలో ఆపేసిన ఆకాష్‌ జూబ్లీహిల్స్‌లోని ఈ సంస్థను తన చేతుల్లోకి తీసుకున్నాడు. ఓ దశలో లాస్‌ మేకింగ్‌ కంపెనీలను నల్లధనం ఉన్న వారు భారీ మొత్తం వెచ్చించి ఖరీదు చేస్తారంటూ ఇతడికి తెలిసింది. దీంతో తన సంస్థను విక్రయించాలనే ఉద్దేశంతో నష్టాలబాటలో నడిపించాలని కంకణం కట్టుకున్నాడు. ఇందుకు మార్గాలు అన్వేషిస్తున్న అతడి దృష్టి ఖరీదైన కార్లపై పడింది. తక్కువ ధరకు వాహనాలు అమ్ముతానంటూ ప్రచారం చేసుకుని రంగంలోకి దిగితే నష్టాలతో పాటు పెద్ద సర్కిల్‌ ఏర్పడుతుందని భావించాడు. అనుకున్నదే తడవుగా పబ్స్, క్లబ్స్‌లో ప్రచారం చేసుకుంటూ పెద్దలు, రాజకీయ, సినీ ప్రముఖుల కుమారులు/సంబంధీకులకు గాలం వేశాడు.  

అసలు విషయం తెలిసి.. 
ఫార్చునర్, బీఎండబ్ల్యూ, జాగ్వార్, ఆడి, ఫోర్చే... తదితర హైఎండ్‌ కార్లను 30 శాతం తక్కువ ధరకు విక్రయించడం మొదలెట్టాడు. 70 శాతం కస్టమర్ల నుంచి తీసుకుని మిగిలిన మొత్తం తానే వేసుకుని కార్లు ఇచ్చేవాడు. మౌత్‌ టు మౌత్‌ పబ్లిసిటీతో ఆకాష్‌కు డిమాండ్‌ పెరిగింది. కొన్నాళ్లకు అతడు అందుబాటులో లేకపోయినా ఫోన్‌లో సంప్రదింపులు జరిగిన బ్యాంకు ఖాతాలో డబ్బు డిపాజిట్‌ చేయడం మొదలెట్టారు. ఓ దశలో ఇతగాడికి షాకింగ్‌ నిజం తెలిసింది. లాస్‌ మేకింగ్‌ కంపెనీలకు ఖరీదు చేయడం అరుదుగా జరుగుతుందని, అలా చేయాలన్నా సదరు కంపెనీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అయి ఉండాలని తెలుసుకున్నాడు.     అయితే అప్పటికే భారీ మొత్తం అడ్వాన్సులు తీసుకోవడం, తన వద్ద ఉన్న డబ్బు అయిపోగా... ఒకరు ఇచ్చిన అడ్వాన్సులతో మరొకరికి కార్లు అందించడం జరిగిపోయింది.  

రుణమైనా తీసుకుందామని... 
దీంతో కంగుతిన్న ఆకాష్‌ కొన్నాళ్ల పాటు చేష్టలుడిగిపోయాడు. అయితే అప్పటికే అడ్వాన్సులు ఇచ్చిన వారి నుంచి ఒత్తిళ్లు పెరగడంతో పాటు ‘బిజినెస్‌’ ఆపే పరిస్థితి లేకపోవడంతో మరో గత్యంతరం లేక ముందుకు వెళ్లాడు. కనీసం తన సంస్థను సమకాలీన అవసరాలకు తగ్గట్టు విస్తరించాలని, మరింత అభివృద్ధి చేయాలని భావించాడు. దీనికోసం బ్యాంకు నుంచి భారీ మొత్తం రుణం తీసుకోవాలని యోచించాడు. ఈ సంస్థ పేరుతో ఉన్న బ్యాంకు ఖాతాల్లో ఎంత ఎక్కువ మొత్తం టర్నోవర్‌ చూపిస్తే అంత ఎక్కువ లోన్‌ వస్తుందంటూ కొందరు ఇచ్చిన సలహా మేరకు టర్నోవర్‌ కోసం కార్ల దందాను కొనసాగించాడు. కార్లు ఖరీదు చేస్తామని చెప్పిన వారి నుంచి డబ్బును తన సంస్థ తన ఖాతాలో జమ చేయించుకునే ఆకాష్‌ దాని నుంచే షోరూమ్స్‌కు బదిలీ చేసేవాడు.  

కారు నంబర్‌ కోసం రూ.15 లక్షలు 
ఒక్కసారిగా రూ.కోట్ల టర్నోవర్‌ చూసేసరికి ఆకాష్‌ దృష్టి జల్సాలపై పడింది. రూ.3.5 కోట్ల ఖరీదైన కారును కొన్న ఆకాష్‌ రూ.15 లక్షలు వెచ్చించి ‘6666’ నెంబర్‌ దక్కించుకున్నాడు. తన వద్దకు కస్టర్లను తీసుకువచ్చిన దళారులకు రూ.1.9 కోట్లు కమీషన్లుగా చెల్లించాడు. కుటుంబంతో సహా వారం రోజుల పాటు  బాలీకి వెకేషన్స్‌ కోసం వెళ్లి రూ.40 లక్షలు ఖర్చు చేశాడు. తరచూ స్నేహితులతో కలిసి బెంగళూరు వెళ్లి జల్సాలు చేసే ఇతడు ఒక్కో సందర్భంలో రూ.80 వేల నుంచి రూ.లక్ష వరకు బిల్లు చెల్లించేవాడు. ఇలా మొత్తమ్మీద రూ.4.5 కోట్లు సొంత అవసరాలకు, రూ.13.5 కోట్లు ‘30 శాతం’ కింద ఇతరులకు కార్లు సరఫరా చేయడానికి ఖర్చుచేశాడు. చివరకు విషయం పోలీసులకు వద్దకు చేరడంతో శుక్రవారం కటకటాల్లోకి వెళ్లాడు.

మరోపక్క ఈ కేసులో రివకరీలకు చేయాలా? వద్దా? అనేది పోలీసులకు అంతు చిక్కట్లేదు. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి న్యాయ సలహా తీసుకోవాలని భావిస్తున్నారు. దాదాపు ఏడాది కాలంలో ఆకాష్‌ 155 కార్లను డిస్కౌంట్‌లో విక్రయించాడు. వీటిని ఖరీదు చేసిన వారిలో విద్యాధికులు, బడా బాబులు, రాజకీయ, సినీ నేపథ్యం ఉన్న వారే ఎక్కువగా ఉన్నారు. వీరంతా డిస్కౌంట్‌ మొత్తం పోగా మిగిలింది చెల్లించిన వారే. దీంతో వీరి నుంచి కార్లు రికవరీ చేయాల్సిన అవసరం ఉండదని పోలీసులు భావిస్తున్నారు. డిస్కౌంట్‌గా తీసుకున్న 30 శాతం రికవరీ చేసి నష్టపోయిన వారికి ఇప్పించాల్సి ఉంటుందని భావిస్తున్నారు. ఈ వ్యవహారాల పరిష్కారానికి న్యాయసలహాలు తీసుకుంటున్నారు.   

మరిన్ని వార్తలు