సీఏఏ అంటే రాజ్యాంగంపై దాడే

8 Mar, 2020 02:34 IST|Sakshi

గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చలో అక్బరుద్దీన్‌

సాక్షి, హైదరాబాద్‌: కేంద్రం తీసుకొ చ్చిన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) పూర్తిగా రాజ్యాంగం మీద చేసిన దాడిగా ఎంఐఎం పక్షనేత అక్బరుద్దీన్‌ ఒవైసీ అభివర్ణించారు. సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్‌లు ముస్లింలకే కాదు.. దేశంలోని మొత్తం పేద ప్రజలకు వ్యతిరేకమని పేర్కొన్నారు. ‘దేశ ఆర్థిక పరిస్థితి క్షీణించింది. జాతీయ వృద్ధి రేటు పడిపోతోంది. నిరుద్యోగం పెరుగుతోంది. జీఎస్టీ బకాయిలు పేరుకుపోతున్నాయి. వీటిపై కేంద్రానికి చీమ కుట్టినట్లయినా లేదు. సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్‌లనే పట్టుకొని వేలాడుతోంది’అని ఒవైసీ దుయ్యబట్టారు. శనివారం అసెంబ్లీలో గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా మాట్లాడుతూ.. తమ హక్కుల కోసం కొట్లాతూనే ఉంటామని, హక్కుల సాధనలో ఎవరికీ భయపడేది లేదని స్పష్టం చేశారు.

సీఏఏను తిప్పికొట్టే పోరాటానికి సీఎం కేసీఆర్‌ నాయకత్వం వహించాలని కోరారు. దేశంలో లౌకికత్వాన్ని కాపాడే దిశగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే చర్యలకు తాము సహకరిస్తామని తెలిపారు. ఇటీవల జరిగిన ఢిల్లీ అల్లర్లలో చనిపోయిన వారి కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. సీఏఏతో పాటు, కాళేశ్వరానికి జాతీయ హోదా ఇవ్వాలని ఈ సమావేశాల్లోనే తీర్మానం చేయాలని సూచించారు. మైనార్టీల సంక్షేమానికి కేసీఆర్‌ ప్రభుత్వం చేసిన కృషిని ఆయన అభినందించారు. అయితే వాటి అమలులో వేగం పెంచాలని కోరారు. ముస్లిం రిజర్వేషన్లపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. 

మరిన్ని వార్తలు