జ్వర వలయం

25 Jul, 2014 01:25 IST|Sakshi

ఉట్నూర్ : ఏజెన్సీని వ్యాధులు ‘ముసురు’కున్నాయి. నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా చిరుజల్లులు పడుతుండటంతో గిరిజనులు బయటకు వెళ్లలేని పరిస్థితి. వాతావరణం ఒక్కసారిగా మారడం.. చలిగాలులు వీచడం, వర్షంతో ఈగలు, దోమలు వృద్ధి చెందడంతో వ్యాధులు విజృంభిస్తున్నాయి. ఫలితంగా గిరిజనులు ఇంటికొకరు మంచం పడుతున్నారు.

ఉట్నూర్ మండలం భీంగూడ, నాగాపూర్, అడగూడ, నర్సాపూర్-జే గ్రామాల్లో నాలుగు రోజులుగా జ్వరాలు ప్రబలడంతో ఏఎన్‌ఎంలు, ఇతర వైద్య సిబ్బంది వైద్యం అందించిన పరిస్థితి అదుపులోకి రావడం లేదు. జ్వరపీడితులను పీహెచ్‌సీలకు తరలిస్తామంటే అంబులెన్స్‌లు లేవు. గురువారం వర్షం తగ్గుముఖం పట్టడంతో జ్వరపీడితులను బాధిత కుటుంబ సభ్యులు ఎడ్లబండిపై పీహెచ్‌సీలకు తరలించారు. సీజనల్ వ్యాధులు పొంచి ఉన్నాయని తెలిసినా, మీడియా కోడై కూసినా, ఏటా మరణాలు సంభవిస్తున్నా ఐటీడీఏ, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు మాత్రం స్పందించడం లేదు. ఫలితంగా గిరిజనులు పాడె ఎక్కుతున్నారు.

 జనవరి నుంచి అంబులెన్సులు ఎత్తివేత
 1999లో ఐటీడీఏ పరిధిలోని పీహెచ్‌సీల్లో గిరిజనులకు అత్యవసర వైద్యం అందించడానికి ఏన్‌ఎస్‌ఎఫ్‌డీసీ(నేషనల్ షెడ్యూల్డ్ ట్రైబల్ ఫైనాన్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్) అంబులెన్స్‌లు ఏర్పాటు చేసింది. గత అక్టోబర్‌లో రాష్ట్రస్థాయి వైద్యశాఖలో జరిగిన మినిట్స్ అఫ్ ది మీటింగ్‌లో ఏజెన్సీ పీహెచ్‌సీల అంబులెన్సుల సాధ్యాసాధ్యాలపై యంత్రాంగం చర్చించింది. అంబులెన్సులు ఎత్తివేయ్యాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సర్కా రు ఆదేశాల మేరకు ఐటీడీఏ జనవరి నుంచి అంబులెన్స్‌లను ఎత్తివేసింది.దీంతో గిరిజన ప్రాంతాల్లో ఉన్న ఇచ్చో డ, దండేపల్లి, బజార్‌హత్నూర్, నర్సాపూర్(టి), నేరడిగొండ, గుడిహత్నూర్, భీంపూర్, నార్నూర్, వాంకిడి, దంతన్‌పల్లి, ఝర్రి, పిట్టబొంగరం పీహెచ్‌సీల పరిధిలోని గిరిజనులకు అంబులెన్సు సౌకర్యం దూరమైంది.

 రూ.80 లక్షలు వచ్చినా..
 గిరిజన ప్రాంతాల్లోని 31 పీహెచ్‌సీల్లో వ్యాధుల తీవ్రత లేని మందమర్రి, లోన్‌వెల్లి, ఈజ్‌గాం పీహెచ్‌సీలు మినహాయించి మిగతా వాటిల్లో అద్దె ప్రతిపాదికన ఏడాదిపాటు అంబులెన్సులను ఏర్పాటు చేయాలని వైద్యశాఖ రూ.80 లక్షలు విడుదల చేసింది. ఈ నిధులను ఐటీడీఏ ఏజెన్సీలో ప్రసవ సమయంలో ఉన్న గర్భవతులను పీహెచ్‌సీలకు, ఇళ్లకు తరలించడానికి ఐఏపీ ద్వారా కొనుగోలు చేసిన ఆరు అంబులెన్సుల నిర్వహణకు వినియోగించారు. ఏజెన్సీలో ఎన్‌ఆర్‌హెచ్‌ఎంకు చెందిన మూడు అంబులెన్సులు జైనూర్, సిర్పూర్(యు), తిర్యాణి పీహెచ్‌సీల్లో ఉన్నాయి.

 ఐఏపీ పథకంలో కొనుగోలు చేసిన అరింటిలో కాసిపేట, అంకోళి, గిన్నెధరి పీహెచ్‌సీలకు, ఆస్రా హెచ్‌ఎంఆర్‌ఐ సంస్థ అధీనంలోని ఇంద్రవెల్లి, తిర్యాణి  పీహెచ్‌సీలకు రెండు, మరొక్కటి హెల్త్ సెల్ నిర్వహణకు వాంకిడి పీహెచ్‌సీలో ఇలా తొమ్మిది అంబులెన్సులు మాత్రమే ఉన్నాయి. 31 పీహెచ్‌సీల్లో తొమ్మిందింటికే ఇతర పథకాల ద్వారా వచ్చిన అంబులెన్సులు ఉండటం, మిగతా పీహెచ్‌సీలకు లేకపోవడం గిరిజనులకు శాపంగా మారింది. దీంతో అత్మవసర వైద్యం అందక గిరిజనులు మృత్యుఒడికి చేరుతున్నారు. వైద్యశాఖ విడుదల చేసిన నిధులతో ప్రతి పీహెచ్‌సీకి అద్దె అంబులెన్సు సౌకర్యం కల్పించాలని గిరిజన సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

మరిన్ని వార్తలు