ఆలయంలో అపచారం

18 Jun, 2017 01:52 IST|Sakshi
భద్రాద్రిలో లక్ష్మి అమ్మవారి ఆలయం తలుపులు మూయని అర్చకులు
 
భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి ఆలయంలో అపచారం చోటుచేసుకుంది. గర్భగుడి ప్రాంగణంలోని లక్ష్మి తాయారమ్మవారి కోవెల తలు పులను శుక్రవారం రాత్రి మూయకుండానే వదిలేశారు. రాత్రి వేళ విధుల్లో ఉన్న సెక్యూరిటీ(ఎస్టీఎఫ్‌)సిబ్బంది దీనిని గుర్తించి, తెల్లవార్లూ అక్కడనే కాపలా కాయాల్సి వచ్చింది. భద్రాద్రి రామాలయ తలుపులు ప్రతిరోజు రాత్రి 9.30 గంటలకు మూస్తారు. గర్భగుడి తలుపులతో పాటు, ప్రాంగణంలో ఉన్న లక్ష్మి తాయారమ్మవారు, అభయాంజనేయ స్వామి వారి ఆలయాలను కూడా ఇదే సమయంలో మూస్తారు. అయితే శుక్రవారం రాత్రి విధు ల్లో ఉన్న అర్చకుడు పూజాది కార్యక్రమాల అనంతరం లక్ష్మి అమ్మవారి కోవెల ప్రధాన తలుపులు వేయకుండా బయట గేట్లును వేసి వెళ్లిపోయారు.

అదే సమయంలో ఆలయ ప్రధాన ద్వారం(రాజగోపురం) తలుపులు కూడా వేసి బయటకు వెళ్లిపోయారు. కొద్ది సేపటి తరువాత ఆలయం లోపల విధులు నిర్వహిస్తున్న ఎస్టీఎఫ్‌ సిబ్బంది ఈ విషయాన్ని గుర్తించి, దీనిపై ఆలయ అర్చకుల దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు.  రాత్రి కావటంతో ఆ సమయంలో ఎవరూ అందుబాటులోకి రాలేదని ఎస్టీఎఫ్‌ సిబ్బంది చెబుతున్నారు. శనివారం తెల్లవారుజామున 4 గంటలకు ఆలయ తలుపులు తీసిన సమయంలో ఈ విషయాన్ని ఎస్టీఎఫ్‌ సిబ్బంది ఆలయ ఇన్‌స్పెక్టర్‌ దృష్టికి తీసుకొచ్చారు.   ఉదయం విధులకు హాజరైన అర్చకులు సంప్రోక్షణ అనంతరం తిరిగి యథావిధిగా పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ విషయాన్ని ఇన్‌స్పెక్టర్‌ శేఖర్‌ ఈవోకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. 
 
అర్చకుడికి మెమో జారీ చేస్తాం
లక్ష్మి తాయారు అమ్మవారి కోవెల తలుపులు శుక్రవారం రాత్రి వేయకుండా వదిలేసిన విషయమ వాస్తవమే. దీనిపై ఆ సమయంలో విధుల్లో ఉన్న అర్చకుడికి మెమో జారీ చేస్తాం. ఎందుకిలా జరిగిందనే దానిపై ఆయన వివరణ కోరుతాం. ఆయన ఇచ్చిన సమాధానం అనంతరం ఏ మేరకు చర్యలు తీసుకోవాలనే దానిపై నిర్ణయం తీసుకుంటాను.
– ఈఓ ప్రభాకర శ్రీనివాస్‌ 
మరిన్ని వార్తలు